ట్రాన్స్​కో, జెన్​కో బకాయిలు రూ.15 వేల కోట్లు 

by Shyam |
SINGARENI
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణికి ట్రాన్స్​కో, జెన్​కో రూ.15 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఆ డబ్బులను వెంటనే సింగరేణికి ఇప్పించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రతినిధులు విన్నవించారు. ఈ బృందం ఢిల్లీలో ఆయనను గురువారం కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి పై ఆధారపడి లక్షలాది కుటుంబాలు, కార్మికులు బతుకుతున్నారన్నారు. కానీ వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చారని, కానీ సింగరేణి సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని వారు ప్రశ్నించారు. సింగరేణిలో లాభాలు బాగా వస్తున్నాయని చెబుతున్న అధికారులు కాంట్రాక్టు ఉద్యోగులకు కోల్ ఇండియాతో సమానంగా ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. టీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే చూస్తోందని ఆయన ఆరోపించారు.

ఇదిలా ఉండగా తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా వారు తెలిపారు. సింగరేణి సమస్యలపై సీఎం గతంలో వచ్చినప్పుడు మాట్లాడినా ఎప్పుడో పరిష్కారమయ్యేదన్నట్లుగా మంత్రి చెప్పారన్నారు. కొత్తగా 4 బొగ్గు గనుల వేలంలో సింగరేణి యాజమాన్యం ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో భారతీయ మజ్దూర్​సంఘ్​నాయకులు కొత్త కాపు లక్ష్మారెడ్డి, మాధవి నాయక్, యాదగిరి, సత్తయ్య, పులి రాజా రెడ్డి, ఎం రమాకాంత్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story