- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా భయం.. ఎన్నికల డ్యూటీకి విముఖత
జీహెచ్ఎంసీ ఎన్నికల విధులు నిర్వహించేందుకు సిబ్బంది జంకుతున్నారు. కరోనా రెండో వేవ్ వస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఎలక్షన్స్ సిబ్బందిలో భయం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల డ్యూటీల నుంచి తమను మినహాయించాలని కోరుతూ విభాగాధిపతులకు సిబ్బంది లేఖలు రాస్తున్నారు. తమకు తెలిసిన సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులతో పైరవీలు చేయిస్తూ విధుల నుండి తప్పించుకోజూస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం సిబ్బందిలో 35% మంది ఇప్పటికే డ్యూటీలను మినహాయింపు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన సిబ్బందిని కరోనా భయాలు వెంటాడుతున్నాయి. డిసెంబర్ ఒకటో తేదీనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, మంగళవారం నుంచి సిబ్బందికి, అధికారులకు శిక్షణ ప్రారంభించారు. జీహెచ్ఎంసీతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్నికల విధుల కోసం సిబ్బందిని రప్పించాలని లేఖలు రాశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందిని కేటాయిస్తూ వివిధ శాఖలు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగాలకు వివరాలను అందజేశాయి. వీరందరికి శిక్షణనిచ్చేందుకు షెడ్యూల్ రూపొందించిన ఎన్నికల అధికారులకు ఆయా ఉద్యోగులు ఇప్పుడు ఝలక్ ఇస్తున్నారు. అనారోగ్యం, ఇతర వ్యక్తిగత, కుటుంబ కారణాలు చెబుతూ తమను ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని విజ్ఞాపన ఉత్తరాలు రాస్తున్నారు. కొందరు తెలిసిన సీనియర్ అధికారులతో జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారు. మరికొందరైతే ఒకడుగు ముందుకేసి శాఖలోని ఎవరినీ ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని సూచిస్తూ శాఖాధిపతులతో ఎన్నికల అథారిటీ అధికారికి డిపార్ట్‌మెంట్ లేఖ రాయించే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసు ఉద్యోగులతో పాటు రాష్ట్ర సర్వీసుల నుంచి కూడా కొందరు అధికారుల నుంచి ఇలాంటి ఉత్తరాలు ఎన్నికల అధికారులకు అందుతున్నాయి. ఒక వైపు ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏ పరిణామాలు ఎదురవుతాయోనని ఎన్నికల అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
కారణం కరోనానే..
ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిబ్బందిలా ఇంతలా జంకుతున్నందుకు కారణం కరోనా భయాలు. కొవిడ్ రెండో వేవ్ ప్రారంభమడంతో దేశంలోనూ పలు చోట్ల లాక్‌డౌన్ విధిస్తున్నారన్న వార్తలు, కరోనా మళ్లీ వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ స్వయంగా సూచించడం.. తదితర వాటితో వారిలో భయాందోళనలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. శానిటైజేషన్, భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరి చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటనలు కూడా సిబ్బందిలో ధైర్యం కల్పించలేకపోతున్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో వేల మంది ఓటర్లు ఒక్క రోజులోనే ఓటు వేయాల్సి ఉండడంతో కొవిడ్ నిబంధనలు ఎంతవరకు అమలవుతాయోననే అనుమానాలు వారికి కలుగుతున్నట్లు తెలుస్తోంది.
35శాతం మంది దూరం..
గ్రేటర్ ఎన్నికల విధులు నిర్వహించేందుకు 45 వేల సిబ్బంది కేటాయించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాలతో పాటు రాష్ట్రంలోని 11 జిల్లాల నుంచి ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని ఎన్నికల విధుల కోసం తీసుకున్నారు. 431 రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికీ శిక్షణ పూర్తి చేయడంతో విధులు నిర్వహిస్తున్నారు. మరో 24 వేల మందికి మంగళవారం శిక్షనిచ్చేందుకు ఎన్నికల అధికారులు సమాచారమిచ్చారు. అయితే సుమారు నాలుగు వేల మంది సిబ్బంది శిక్షణకు హాజరు కాలేదని సమాచారం. సికింద్రాబాద్ జోన్‌లోని మూడు సర్కిళ్లకు సంబంధించి 70 శాతం సిబ్బంది మాత్రమే శిక్షణకు హాజరయ్యారని తెలుస్తోంది. కొందరు ఫోన్లు స్విఛాఫ్ చేయడం, మరికొందరు విధులకు హాజరుకాలేమంటూ ఎన్నికల అధికారులకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో 45 వేల సిబ్బందిలో 30శాతం సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుకోవాలని ఎన్నికల అధికారులు భావిస్తుంటే, మొత్తంగా 35 శాతం వరకూ సిబ్బంది, అధికారులు తాము ఎన్నికల విధులు చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఎలక్షన్స్ డ్యూటీలకు గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. అయితే తమ డ్యూటీ కాకపోయినా పనులు కేటాయించి తమనే బెదరించడం సరికాదనే అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తగ్గుతున్న సిబ్బందిని సర్దుబాటు చేస్తారో.. లేక వారిలో భరోసా కల్పించి విధులకు రప్పించగలుగుతారో ఎన్నికల అధికారులకే తెలియాలి.