సూర్యాపేట జిల్లాలో కోతికి అరుదైన గౌరవం

by Anukaran |
సూర్యాపేట జిల్లాలో కోతికి అరుదైన గౌరవం
X

దిశ, వెబ్‌డెస్క్ : అడవులను వదిలిన కోతులు ఊర్లపై పడి నానా రభస చేస్తున్నాయి. వాటి ధాటికి తట్టుకోలేక రైతులు కూరగాయలు, పండ్ల తోటలను సైతం వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. ఇండ్లపై కోతుల గుంపు దండెత్తి ప్రజలపై దాడుల చేయడంతో కొందరు గాయపడిన, చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. కోతులు ఇంత హంగామా చేస్తున్నా కొందరు వాటిని ఆదరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కోతిని ఆంజనేయస్వామి స్వరూపంగా భావిస్తుంటారు ప్రజలు. ఇందుకు ఉదాహారణగా సూర్యాపేట జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. కోతి మరణిస్తే.. దానిని సాంప్రదాయ బద్దంగా ఖననం చేయడంతోపాటు దిన ఖర్మను కూడా చేసి గ్రామస్తులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్)మండలం, పాతర్లపహాడ్ గ్రామంలోని ముదిరాజ్ కాలనీలో 13 రోజుల క్రితం ఓ కోతిపై కుక్కల దాడి చేశాయి. అది తీవ్రంగా గాయపడి కాలనీలోని పాండవుల హరిబాబు ఇంట్లో పడిపోయింది. దానిని చూసి చలించిపోయిన ఆయన.. మూడు రోజుల పాటు చికిత్సను అందించడంతోపాటు ఆహారాన్ని అందించాడు. అయినా ఆ కోతి జనవరి 13న మృతిచెందడంతో మనిషి అంతిమ సంస్కారాలు నిర్వహించిన మాదిరిగానే పాడె కట్టి.. డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఖననం చేశారు.

జనవరి 21న కోతి మరణించి తొమ్మిది రోజులు కావడంతో దానికి దశ దిన ఖర్మ చేయాలని ముదిరాజ్ కాలనీ వాసులు నిర్ణయించుకున్నారు. కాలనీలోని పాండవుల హరిబాబు, గణేశ్, నర్సమ్మ, సులోచన, అంజయ్య, వెంకన్న తదితరుల ఆధ్వర్యంలో కాలనీవాసులంతా కలిసి చందాలు వేసుకోని కోతి దశ దిన ఖర్మను నిర్వహించారు. కాలనీలోని అందరికీ భోజనాలు వండిపెట్టారు. కోతి ఫొటోకు దండవేసి నివాళులు అర్పించారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్క గ్రామాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తోటి మనిషి ఆపదలో ఉంటే పట్టించుకోని నేటి సమాజంలో ఓ కోతికి సపర్యలు చేసి, అది చనిపోయాక అంతిమ సంస్కారాలు నిర్వహించి, దశ దిన ఖర్మలు చేసిన ముదిరాజ్‌లను ప్రజలు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed