పాకిస్తాన్‌కు వద్దన్న ఇంగ్లాండ్.. పద్ధతి కాదన్న పీసీబీ చైర్మన్

by Shyam |   ( Updated:2021-09-21 04:26:06.0  )
పాకిస్తాన్‌కు వద్దన్న ఇంగ్లాండ్.. పద్ధతి కాదన్న పీసీబీ చైర్మన్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ పర్యటన నుంచి న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఆశ్చర్యకంగా వైదొలిగిన విషయం తెలిసిందే. కివీస్ బాటలోనే నడవాలని నిర్ణయించిన ఇంగ్లాండ్ బోర్డు తమ పురుషులు, మహిళల జట్లు వెళ్లాల్సిన పాక్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. అయినా, ఈ వివాదం ఇంకా సద్దుమణిగేలా లేదు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా ఓ స్పోర్ట్స్ న్యూస్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ’ పాకిస్తాన్ పర్యటనను ఇంగ్లాండ్ రద్దు చేసుకోవడం మమ్మల్ని తీవ్ర వేదనకు గురి చేసింది. కానీ, ఇది మేం ఊహించిన విధంగానే ఉంది. ప్రాశ్చాత్య దేశాలు అనూహ్యంగా కలిసిపోయాయి. భద్రతా కారణాలను సాకుగా చూపి పర్యటనను రద్దు చేసుకోవడం సరైన పద్ధతి కాదని.. ప్రపంచంలో బెస్ట్ టీమ్‌గా మారుతున్నామన్నారు.

తమకు ఎదురైన భద్రతా సమస్యల గురించి మాతో చర్చించకుండానే న్యూజిలాండ్ పాక్ నుంచి వెళ్లిపోవడం మమ్మల్ని ఆగ్రహానికి గురి చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా అలాగే చేసింది.. ఇది మాకో గుణపాఠం. ఇలాంటి జట్లు మా దేశ పర్యటనకు వచ్చినప్పుడు వారికి అన్ని వసతులు కల్పిస్తాం. కానీ, మేం ఆ దేశాలకు వెళ్లినప్పుడు మాత్రం మాపై కఠినమైన క్వారంటైన్ నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినా మేం వాటిని భరించాం. ఇకపై ఇలాంటివి చెల్లవు. మా ఇష్టంతోనే మేం ఎక్కడికైనా వెళ్తాం’ అని రమీజ్ రాజా స్పష్టం చేశారు.

టీ 20 ప్రపంచకప్‌లో మా సత్తా చూపిస్తాం: షోయబ్‌ అక్తర్‌

తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ మాట్లాడుతూ.. ఈ పరిణామాలకు కారణం కివీస్ జట్టు అని విమర్శించాడు. ఇప్పటికే పలుమార్లు న్యూజిలాండ్‌ తీరును విమర్శించిన ఈ మాజీ బౌలర్‌ ఇంగ్లాండ్‌ ప్రకటనతో తాజాగా మరోసారి కివీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ’ ఇప్పుడు ఇంగ్లాండ్‌ కూడా మనల్ని తిరస్కరించింది. ఏం పర్వాలేదు మిత్రుల్లారా టీ20 వరల్డ్‌కప్‌లో కలుసుకుందాం. ముఖ్యంగా బ్లాక్‌క్యాప్స్‌ (న్యూజిలాండ్‌)ను బాగా గుర్తు పెట్టుకుంటాం. పంజా విసరాల్సిన సమయం వచ్చింది. వాళ్లను అస్సలు వదిలిపెట్టకూడదు బాబర్‌ ఆజం‘ అని వ్యాఖ్యానించాడు. ఇలాంటి కష్ట సమయంలో గెలుపు మనకు ఎంతో అవసరం అని ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed