ఫామ్ పాండ్ నిర్మాణం రైతుల ఆర్థిక అభివృద్ధికి నాంది

by Sumithra |   ( Updated:2025-04-03 09:22:55.0  )
ఫామ్ పాండ్ నిర్మాణం రైతుల ఆర్థిక అభివృద్ధికి నాంది
X

దిశ, కొత్తగూడెం : వ్యవసాయ భూములలో ఫామ్ పాండ్ నిర్మాణం రైతుల ఆర్థిక అభివృద్ధికి నాంది అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో పురోగతిలో ఉన్న ఉపాధి హామీ పనులు, జల్ సంచెయ్ జెన్ భాగీదారి, నర్సరీల్లో మొక్కల పెంపకం, తాగునీటి పైపుల మరమ్మత్తు పనులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, అంగన్వాడీల్లో విద్యుదీకరణ తదితర అంశాల పై గురువారం ఐడీఓసీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ లక్ష్యాలను సాధించినందుకు అధికారులను అభినందించారు. అదే విధంగా ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఉపాధి హామీ పథకం లక్ష్యాలను త్వరితగతిన పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో అన్ని వ్యవసాయ భూముల్లో ఫాం పాండ్ నిర్మాణాలను చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 52 వేల బోర్లు వ్యవసాయ భూముల్లో ఉన్నాయని, కనీసం 50 వేల ఫామ్ పౌండ్ నిర్మాణాలను చేపట్టాలన్నారు. బోర్ ఉన్న ప్రతి వ్యవసాయ భూమిలో కచ్చితంగా ఫాం పౌండ్ ఉండాలన్నారు. ఫాం పాండు నిర్మాణం ద్వారా చేపల పెంపకం, అజోల్ల పెంపకం వంటి వాటిని సాగు చేయడం ద్వారా రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. మన జిల్లాలో చేపడుతున్న ఫాం పౌండ్ తవ్వకాలు, మునగ సాగు వంటి వాటిని ఆదర్శంగా ఇతర జిల్లాలు తీసుకుని ముందుకు సాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.

ఉపాధి హామీ పథకం కూలీల అందరికీ జీవనజ్యోతి, జీవన సురక్ష పథకం గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కరికి ఆ పథకాల ప్రయోజనాలు వివరించాలని అధికారులను ఆదేశించారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందువలన ఉపాధి హామీ కూలీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి కూలీలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులు వద్ద త్రాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. జల్ సంచెయ్, జెన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలు, ప్రభుత్వ స్థలాలలో ఎన్ని ఇంకుడు గుంతలు త్రవ్వడానికి అవకాశం ఉందో సోమవారం లోగా నివేదికలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులతో కలిసి ఉద్దేశించిన పరిమాణంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లాలో తవ్విన ఇంకుడు గుంతల చుట్టూ గోరింటాకు మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్ వివరాలను గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఇంకుడు గుంతలు నిర్మాణాల్లో జిల్లాలోని యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలన్నారు. ఏ గ్రామంలో అయితే ఎక్కువ ఇంకుడు గుంతలు నిర్మాణం చేపడతారో వారిని ఆగస్టు 15 న 5 గురికి సన్మాన కార్యక్రమం చేస్తామని తెలిపారు.

నిర్మాణం చేపట్టిన ప్రతి ఇంకుడు గుంత వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి అవార్డు రావాలని అందులో మన జిల్లా అగ్రస్థానంలో నిలవడమే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. మే 31 వ తేదీ నాటికి అన్ని వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని ఆయన తెలిపారు.

స్వచ్ఛభారత్ లో భాగంగా మంజూరైనటువంటి మరుగుదొడ్ల నిర్మాణం వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నర్సరీలో ఖాళీగా ఉన్న బ్యాగులలో మందారం, మునగ మొక్కలను పెంపకం చేపట్టాలన్నారు. మునగ సాగులో మన జిల్లా తమిళనాడును మించాలన్నారు. జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న పైప్ లైన్ల మరమ్మత్తుల వివరాలను ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని, పనులు పూర్తి చేయడంలో నాణ్యత పాటించాలని, ఇంకా ఎక్కడైనా త్రాగునీటికి అవసరమైన పైప్ లైన్ ల వివరాలను అందించాలన్నారు. సోమవారంలోగా అందించాలన్నారు. ఏప్రిల్ నెల ఆఖరి లోపు అన్ని పనులను పూర్తి చేయాలని, మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా జరిగేలా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

జనవరి 26న మంజూరైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ పనులను త్వరిత చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండల పరిషత్ కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని, దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని, పథకం కోసం దరఖాస్తుకు వచ్చిన వారి వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించి దరఖాస్తులను పూర్తి చేయడానికి ఒక అధికారిని అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 14 వరకు గడువు ఉందని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, అన్ని అంగన్వాడి కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు ఉండే విధంగా పనులను చేపట్టాలన్నారు. చేపట్టిన పనుల వివరాలను ఫోటోలు, నివేదికలు సమర్పించాలని రెండు వారాల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సన్న బియ్యం పంపిణీ పథకం అమలులో భాగంగా ప్రతి మండలంలో ఒకచోట స్థానిక శాసనసభ్యులచే సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

పెన్షన్ దారుడు ఎవరైనా చనిపోతే వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తూ వెంటనే పెన్షన్ దారుని భార్యకు పెన్షన్ మంజూరు అయ్యే విధంగా వితంతు పెన్షన్ లేదా 57 సంవత్సరాలు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్ మంజూరయ్యే విధంగా ఆన్లైన్లో అప్డేట్ చేయడం ద్వారా వెంటనే భార్యకు పెన్షన్ మంజూరు అవుతుందని కాబట్టి ఎంపీడీవోలు అప్డేషన్ కచ్చితంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, హౌసింగ్ పీడీ శంకర్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, మిషన్ భగీరథ ఈఈలు నలిని, తిరుమలేష్, ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed