అమాంతం పెరిగిన చికెన్ ధరలు

by Shyam |
అమాంతం పెరిగిన చికెన్ ధరలు
X

దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను నిరోధించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ‘జనతా కర్ఫ్యూ’‌ను ఆదివారం నాడు స్వచ్ఛందంగా పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో శనివారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లలో బిజీగా గడిపారు. చికెన్, మటన్ షాపులు వద్ద ప్రజలు క్యూలు కట్టారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు నేల చూపులు చూసిన చికెన్ ధరలు కర్ఫ్యూ నేపథ్యంలో భారీగా పెరిగాయి. మొన్నటి వరకు చికెన్ కిలో ధర రూ. 50 ఉంటే.. శనివారం నాడు రూ.100 దాటింది. హైదరాబాద్‌లో పలు చోట్ల రూ.150 కూడా అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయి.

గత కొంత కాలంగా చికిన్ తింటే కరోనా సోకుతుందన్న వదంతులు వ్యాపించడంతో ఇటీవల చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా పౌల్ట్రీ రంగం తీవ్ర నష్టాలను చవిచూసింది. కొన్ని చోట్ల ఉచితంగా కోళ్లను పంపిణీ చేశారు. ”నేను రోజూ చికెన్‌ తింటాను.. మా ఇంట్లో కూడా అంతా చికెన్‌ తింటారు” అంటూ స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సహా పలువురు నేతలు ప్రకటనలు చేసినా.. చికెన్‌ అమ్మకాలు పుంజుకోలేదు. ఇటీవల పౌల్ట్రీ వ్యాపారులు చికెన్ మేళాలు నిర్వహించి అవగాహన కల్పించడంతో కొంత పరిస్థితి మెరుగైంది. తాజాగా ఆదివారం జనతా కర్ఫ్యూ ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించడంతో శనివారం మాంసం షాపులు కిటకటలాడాయి. చికెన్ కొనుగోళ్లకు ప్రజలు ఎగబడ్డారు. ఇదే అదునుగా భావించిన చికెన్ విక్రయదారులు రేట్లను అమాంతం పెంచారు.

Tags: janatha curfew, chicken rate high

Advertisement

Next Story

Most Viewed