ప్రయాణికుల మతిమరుపు విలువ రూ.9 వేల కోట్లు!

by Shyam |
ప్రయాణికుల మతిమరుపు విలువ రూ.9 వేల కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా సరే దూర ప్రయాణాలకు రైలు ప్రయాణమే సురక్షితమని భావిస్తారు. అందుకే, చాలామంది ప్రయాణమనుకున్న వెంటనే రైల్వే టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో కొంతమంది ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు. ప్రయాణమైతే రద్దు చేసుకుంటారు కానీ, బుక్ చేసిన టికెట్లను రద్దు చేయడం మర్చిపోతారు. అలా ఇప్పటి వరకూ ఎన్ని టికెట్లు రద్దు చేసుకోవడం మర్చిపోయారు? ఆ టికెట్ల విలువ ఎంత? అని ఓ సామాజిక కార్యకర్త రైల్వే సమాచార కేంద్రాన్ని కోరగా వచ్చిన సమాధానం విని అతను ఆశ్చర్యపోయాడు. అతనితో పాటు మీరు ఆశ్చర్యపోవాలంటే చదవండి!

రాజస్థాన్‌కు చెందిన సామాజిక కార్యకర్త సుజిత్ సమాచార హక్కు చట్టం కింద వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రైల్వే టికెట్ల రద్దు మర్చిపోవడం ద్వారా ఎంత ఆదాయం వచ్చిందని అడగ్గా… అక్షరాల రూ. 9,000 కోట్లని రైల్వేసంస్థ సమాధానం ఇచ్చింది. నమ్మడానికి కొన్ని సెకన్ల సమయం పట్టినా ఇది నిజం. గడిచిన మూడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వెయిటింగ్ లిస్టులో ఉండి రద్దు అవ్వని టికెట్ల నుంచి రైల్వే శాఖకు రూ. 9,000 కోట్ల ఆదాయం వచ్చిందని స్వయంగా రైల్వే సమాచార విభాగం తెలిపింది.

2017, జనవరి నుంచి 2020 జనవరి మధ్యకాలంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న సుమారు తొమ్మిదిన్నర కోట్ల మంది.. తాము బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేయలేదు. ఆ ప్రయాణికుల ద్వారా రూ. 4,335 కోట్లు రైల్వే సంస్థ ఆర్జించింది. టికెట్ బుక్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ రుసుము ద్వారా రూ. 4,684 కోట్లు సంపాదించింది. గడిచిన మూడేళ్లుగా టికెట్ రద్దు ఛార్జీలు, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను రద్దు చేసుకోకపోవడం వల్ల ఇండియన్ రైల్వేకు రూ. 9,000 కోట్లు ఆదాయం సమకూరింది. ఆన్‌లైన్ విభాగం నుంచి ఐఆర్‌సీటీసీ రైల్వే టికెట్లను బుక్ చేసుకునేవారి శాతం పెరిగిందని రైల్వే శాఖ పేర్కొంది. 2017-2020 మధ్య మొత్తం 145 కోట్ల మంది ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్నారు. రైల్వే స్టెషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్ ద్వారా సుమారు 75 కోట్ల మంది ప్రయాణికులు టికెట్లను తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆర్‌టీఐకి దరఖాస్తు చేసుకున్నవ్యక్తి ఇండియన్ రైల్వేలో రిజర్వేషన్ పాలసీలోనూ, రీఫండ్ పాలసీలోనూ చాలా వివక్ష కొనసాగుతోందని ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆన్‌లైన్ బుకింగ్, కౌంటర్ బుకింగ్ మధ్య ఉన్న వ్యత్యాసం కూడా ఎక్కువే అని, ఈ ప్రక్రియ వల్ల ప్రయాణీకులకు అనవసరమైన భారమే కానీ ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశారు. ఈ రకంగా చూస్తే రైల్వే శాఖ అన్యాయమైన రీతిలో ఆదాయాన్ని సంపాదిస్తోందని రాజస్థాన్ హైకోర్టులో సుజిత్ పిటిషన్ వేశారు.

సాధారణంగా ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకున్నప్పుడు సర్వీస్ ఛార్జీలను మినహాయించి మిగిలిన సొమ్మును వినియోగదారుడి అకౌంట్‌కు జమ చేస్తుందనే విషయం తెలిసిందే. నిర్ణయించిన సమయానికి 48 గంటల్లోగా టికెట్లను రద్దు చేసుకుంటే ఏసీ ఫస్ట్‌క్లాస్‌కు అయితే రూ. 240తో పాటు జీఎస్టీ ఉంటుంది. ఇలా, ఏసీ 2 టైర్, ఫస్ట్ క్లాస్‌కు రూ. 200తోపాటు జీఎస్టీ, ఏసీ 3 టైర్‌కు రూ. 180తో పాటు జీఎస్టీ, స్లీపర్‌కైతే రూ. 120, సెకండ్ క్లాస్ టికెట్ల మీద రూ.60 ఛార్జీలను రైల్వే శాఖ వసూలు చేస్తోంది.

Advertisement

Next Story