భారత్ చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు

by Anukaran |   ( Updated:2020-07-29 05:06:30.0  )
భారత్ చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాఫెల్ యుద్ధ విమానాలు భారత గడ్డపై అడుగు పెట్టాయి. బుధవారం మధ్యాహ్నం అంబాలా ఎయిర్ బేస్ క్యాంప్‌‌ చేరుకున్న రాఫెల్ యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ స్వాగతం పలికారు. సోమవారం ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన ఈ యుద్ధ విమానాలు 7వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇండియా చేరుకున్నాయి. ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు నిన్న యూఏఈ ఆల్ ధఫ్రా ఎయిర్ బేస్‌లో హాల్ట్ చేసి ఇవాళ భారత్ చేరుకున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు సురక్షితంగా చేరుకున్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ట్వీట్ చేశారు. రాఫెల్‌ రాకతో భారత వైమానిక దళంలో కొత్త శకం మొదలైందని పేర్కొన్నారు.

పర్వత ప్రాంతాల్లో సైతం పోరాటానికి సై అనగల రాఫెల్ యుద్ధ విమానాలకు 50వేల అడుగుల ఎత్తుకు ఎగిరే సామర్థ్యం ఉంది. ఫ్రాన్స్‌ నుంచి 35రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌ కొనుగోలు చేయగా.. తొలి విడతగా ఐదు విమానాలు చేరుకున్నాయి. రెండో విడతగా మరో 28 విమానాలు ఆగస్టులో రానున్నాయి. గేమ్ ఛేంజర్‌గా వ్యవహరించడం రాఫెల్ సొంతం. గంటకు 1912 కి.మీ వేగంతో ప్రయాణించగల సత్తా రాఫెల్‌కు ఉంది. నిమిషానికి 2500 రౌండ్లు పేల్చే శక్తితో పాటు విజువల్ రేంజ్‌ను దాటి ఢీకొట్టే సామర్థ్యం ఉంది.

ఎన్నో ప్రత్యేకతలు ఉన్న రాఫెల్ యుద్ధ విమానం పొడవు 15.30 మీటర్లు కాగా బరువు 10 టన్నులు. శక్తి వంతమైన ఆయుధాలను సైతం సునాయసంగా తీసుకెళ్తాయి. 9500 కేజీలతో అణ్వాయుధాలను మోసుకెళ్లే శక్తి ఉంటుంది. ఏఈఎస్‌ఈ రాఢార్‌తో దూసుకెళ్లే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు.. సుఖోయ్ యుద్ధ విమానాల కంటే 1500 కిలోల బరువు ఎక్కువ ఉంటాయి. ఫ్రాన్స్‌, ఈజిప్టు, ఖతార్ తర్వాత రాఫెల్ కలిగి ఉన్న దేశంగా భారత్ నిలిచింది.

Advertisement

Next Story