కానుకలు ఆన్‌లైన్..‘పెళ్లి’ కార్డులో క్యూఆర్ కోడ్

by Shyam |
కానుకలు ఆన్‌లైన్..‘పెళ్లి’ కార్డులో క్యూఆర్ కోడ్
X

దిశ, వెబ్‌డెస్క్‌: ఇటీవల కాలంలో పెళ్లి వేడుకల్లో చాలా మార్పులు వచ్చేశాయి. కరోనా అందుకు కారణం కాగా, పెరిగిన టెక్నాలజీని పెళ్లిళ్లకు వాడుకుంటూ నయా పోకడలను ఆహ్వానిస్తున్నారు. లైవ్‌లో మ్యారేజ్ సెర్మనీ, అతిథులు తమకు నచ్చింది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే సదుపాయం, ఎక్కడో ఉన్నా పెళ్లి మండపంలో ఉన్నట్లే భ్రమ కలిపించే వీఆర్ టెక్నాలజీతో వీక్షించడం వంటి సాంకేతికత పెళ్లిని ‘డిజిటల్‘ బాట పట్టించాయి. ఈ క్రమంలో మధురైకి చెందిన ఓ జంట తమ వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో క్యూఆర్‌కోడ్ ప్రింట్ చేసి మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

సాధారణంగా స్నేహితులందరం కలిసి ఏదైనా పెళ్లికి వెళితే తప్పనిసరిగా గిఫ్ట్ తీసుకెళతాం. లేదంటే కట్నకానుకలు సమర్పిస్తాం. పెళ్లిళ్లే సాంకేతికతను అందిపుచ్చుకుంటే, అతిథులు ఆ ట్రెండ్‌కు తగ్గట్లు ఉండొద్దు అని అనుకున్నారేమో! మరి..అందుకే.. అతిథుల కోసం మధురైకి చెందిన జంట తమ పెళ్లి కార్డులో గూగుల్ పే, ఫోన్ పేలకు సంబంధించిన క్యూఆర్ కోడ్స్ ప్రింట్ చేయించారు. 30 మంది దీంతో ట్రాన్సాంక్షన్స్ జరిపినట్లు వరుడి తల్లి జయంతి తెలిపింది. న్యూ కొవిడ్ స్ట్రెయిన్ భయంతో పాటు, ఏవో కారణాల వల్ల పెళ్లికి రాలేకపోయినా ఎంతోమంది తమ కానుకలను మాత్రం అందించాలని అనుకుంటారు. అలాంటివారికి అనుగుణంగా ఉంటుందని ఉద్దేశంతోనే క్యూఆర్ కోడ్ ఫెసిలిటీని కల్పించామని జయంతి చెప్పారు.

ఒకప్పుడు ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి, శుభలేఖలు అందించేవారు. కానీ, ఇప్పుడంతా డిజిటల్ ఇన్విటేషన్స్‌కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వీడియోకాల్‌లో మాట్లాడటానికి, మనిషి పక్కన ఉండి మాట్లాడిన దానికి ఎంత భేదం ఉంటుందో, ఈ డిజిటిల్ ఇన్విటేషన్స్‌లోను అంతే తేడా ఉంటుంది. పెళ్లి ఆహ్వానాల నుంచి కానుకల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే జరిగితే..ఇక అతిథులను పిలవడమెందుకు, వారి ఆశీర్వాదం, కానుకలు మాత్రం స్వీకరించడం ఎందుకని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజమే కదా మరి!

Next Story

Most Viewed