అమెరికా గడ్డపై పీవీ బిడ్డ ఘనత

by Sridhar Babu |
అమెరికా గడ్డపై పీవీ బిడ్డ ఘనత
X

దిశ, కరీంనగర్: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, సుస్థిర పాలనను అందించిన భారత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ) కుటుంబం వైద్య రంగంలోనూ విశిష్ట సేవలందిస్తూ మన్ననలు అందుకుంటోంది. క్లిష్ట సమయంలో దేశానికి దిక్సూచిగా సేవలందించిన తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పీవీ చిన్న కూతురు.. ఖండాంతరాలను దాటి సేవాభావంతో ముందుకు సాగుతున్నారు. తండ్రి దేశ ఔన్నత్యాన్ని కాపాడిన మహాయోధుడిగా చరిత్ర పుటలకెక్కితే.. తనయ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న నోవెల్ కరోనా వైరస్ బాధితులను కాపాడేందుకు తన వంతు బాధ్యతలను నిర్వర్తిస్తోంది.

వైద్యరంగంలో స్థిరపడిన డా. విజయ సోమరాజు.. ప్రస్తుతం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌ క్లినికల్‌(యూఐసీ)లో ప్రొఫెసర్‌గా వివిధ శాఖల్లో సేవలందిస్తున్నారు. యూనివర్సిటీలో ఔట్ స్టాండింగ్ టీచింగ్ అవార్డు గ్రహీత కూడా అయిన డాక్టర్ విజయ.. విస్కాన్ సిటీ బెలాయిట్ హెల్త్ సిస్టమ్‌లో మెడికల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటల వరకు పీపీఈ సూట్ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్)తో కరోనా బాధితులకు సేవలందిస్తూ.. డాక్టర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. విజయ భర్త ప్రసాద్ సోమరాజు ముప్పై ఏళ్లుగా అమెరికాలోనే వైద్యసేవలు అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి సమీపంలోని రేగళ్ల గ్రామం డాక్టర్ విజయ మెట్టినిళ్లు. ఆమె హైదరాబాద్‌లోని మాదాపూర్ వెంకటేశ్వర ఫార్మాస్యూటికల్ కాలేజి డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్న ఈ విపత్కర పరిస్థితుల్లోడాక్టర్ విజయ కొవిడ్ 19 బాధితులకు సేవలందించే పనిలో నిమగ్నం కావడం తెలంగాణకే గర్వకారణం.

Tags: PV Narasimha Rao, PM Daughter, Dr. Vijaya American, Medical service

Advertisement

Next Story

Most Viewed