- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనాథాశ్రమం టు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మహిళా క్రికెటర్ లీసా స్టాలేకర్ జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ప్రస్తుత తరానికి ఒక క్రికెట్ విశ్లేషకురాలిగా, వ్యాఖ్యాతగా మాత్రమే తెలిసిన ఆమె ఆస్ట్రేలియా తరఫున నాలుగు వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ అనే విషయం అంతగా తెలియకపోవచ్చు.
ఆమె క్రికెట్‌కు చేసిన సేవకు గుర్తింపుగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా లీసా రికార్డు సృష్టించింది. ఇంత విజయవంతమైన ఆమె జీవితం పూణేలోని ఒక అనాథాశ్రమంలో మొదలైందంటే నమ్మగలరా? కానీ ఇది నిజం.
లీసా స్టాలేకర్ 1978 ఆగస్టు 13న మహారాష్ట్రలోని పూణేలో ఒక పేద కుటుంబంలో జన్మించింది. అయితే కనీసం తిండి పెట్టే స్థోమత లేని ఆమె తల్లిదండ్రులు పూణేలోని శ్రీవత్స అనాథాశ్రమం గేటు ముందు వదిలేసి వెళ్లిపోయారు. ఆశ్రమ నిర్వాహకులు ఆ పాపను అక్కున చేర్చుకొని లైలా అనే పేరు పెట్టారు. అయితే మూడు వారాల వయస్సులో అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన హారేన్, సుయ్ స్టాలేకర్ దంపతులు ఆ పాపను దత్తత తీసుకొని అమెరికా వెళ్లిపోయారు. లైలా పేరును లీసాగా మార్చుకున్నారు.
అయితే, లీసాను దత్తత తీసుకున్న హారేన్ స్టాలేకర్ ముంబైలోనే పుట్టి పెరిగారు. ఆయనకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. దీంతో తన కూతురును క్రికెటర్‌ని చేయాలనుకున్నాడు. అమెరికాలో రెండేళ్లు ఉన్న తర్వాత కెన్యా వెళ్లారు. అక్కడ కొంత కాలం ఉండి చివరకు ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డారు.
అక్కడే లీసాకు క్రికెట్ శిక్షణ ఇప్పించారు. ముందు బ్యాక్ యార్డ్‌లో క్రికెట్ ఆట మొదలు పెట్టిన లీసా.. తర్వాత దగ్గర్లోని గ్రౌండ్‌లో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. ఒకవైపు చదువుకుంటూ మరోవైపు క్రికెట్‌లో కఠినమైన శిక్షణ తీసుకుంది. ఆమె ప్రతిభను గమనించిన న్యూ సౌత్‌వేల్స్ క్లబ్ తమ జట్టులోకి తీసుకుంది.
ఇక అప్పటి నుంచి లీసా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. 2001లో ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. సుదీర్ఘమైన క్రికెట్ ఆడిన లీసా నాలుగు వన్డే ప్రపంచ కప్‌లు ఆడింది. 125 వన్డేల్లో 2,728 రన్స్‌తో పాటు 146 వికెట్లు తీసింది. 54 టీ 20 మ్యాచ్‌లు ఆడి 769 పరుగులు చేయడంతో పాటు , 60 వికెట్లు తీసుకుంది.
2013లో ఆస్ట్రేలియా విశ్వ విజేత కావడంలో లీసా పట్టిన అద్భుత క్యాచే కారణం. ఆ వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా, కోచ్‌గా, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగుతున్నది. ఆమె సేవకు గుర్తింపుగానే ఈ ఏడాది సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కల్లీస్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్‌తో కలిసి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో లీసా చోటు దక్కించుకుంది. ఆమె జీవిత విశేషాలను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికార వెబ్‌సైట్‌లో పొందుపరచడం గమనార్హం.