ప్రజాసేవకుడు ‘కురిచేటి’ ఇకలేరు

by Sridhar Babu |
kuricheti panduranga rao
X

దిశ, భద్రాచలం టౌన్: భద్రాచలం పట్టణానికి చెందిన ప్రజాసేవకుడు కురిచేటి పాండురంగారావు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యం బారినపడిన ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కురిచేటి జనం మెచ్చిన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భద్రాచలం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్‌గా, షిర్డి సాయిబాబా సేవాసమితి అధ్యక్షులుగా, వెంకటేశ్వర సేవాసమితి అధ్యక్షులుగా, భద్రాచలం ఆర్యవైశ్య అన్నదాన సత్రం చైర్మన్‌గా, లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం మొట్టమొదటి అధ్యక్షులుగా ఆయన పనిచేశారు. అంతేగాకుండా.. దుమ్మగూడెం శ్రీ ఆత్మారామ చంద్రస్వామి దేవస్థానం వంశపారపర్య సేవా ప్రముఖునిగా, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పలు‌‌ పదవులు నిర్వహించి పదవులకి వన్నె తెచ్చారు. జిల్లాలో ప్రముఖ వ్యాపార వేత్తగా, ‘మానవ సేవయే మాధవ సేవ’ అని భావించి ప్రతిక్షణం ప్రజాహితం కోరుకునేవారు. ఆధ్యాత్మిక చింతనే పరమావధిగా భావించారు. బహుముఖ ప్రజానాయకుడిగా కురిచేటి పాండురంగారావు విశేష సేవలందించారు. ఆయన మరణం వ్యాపార, ఆధ్యాత్మిక, రాజకీయ రంగాలకు తీర్చలేనిదని భద్రాచలం పట్టణ ప్రముఖులు పలువురు ఘన నివాళి అర్పించారు.

Advertisement

Next Story

Most Viewed