- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ లో ‘డబుల్’ ట్రబుల్
దిశ, వరంగల్: ‘‘ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తా. నేనే స్వయంగా వచ్చి ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని ఇండ్లు కట్టిస్తా. ఇండ్లలోకి పోయేటప్పుడు మంచిగ దావత్ కూడా చేసుకుందాం.’’ ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా..? తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. 2014లో వరంగల్ బస్తీ వాసులతో అన్న మాటలవి. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆయన మొదటి సారి వరంగల్ పట్టణంలో పర్యటించారు. కొన్ని బస్తీల్లో పర్యటించిన ఆయన స్వయంగా అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అప్పడు అర్హులైన వారందరికీ ఇళ్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. కానీ, ఆరేళ్లవుతున్న‘డబుల్’ ఇండ్లకు నేటికీ మోక్షం లేదు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకుని ‘డబుల్’ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి, అర్హులను ఎంపిక చేసి ఇండ్లు కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం 5221 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. కానీ, 4784 ఇండ్లు మాత్రమే మంజూరు చేసింది. అందులో ఇప్పటి వరకు కేవలం 716 ఇండ్లు మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 2184 ఇండ్లు నిర్మాణ దశలో ఉండగా మిగిలిన 1884 ఇండ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. కానీ, నిర్మాణాలు ఇంకా చేపట్టడం లేదు. దీనిపై లబ్దిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సొంత ఇండ్లూ కూల్చారు..
వరంగల్, హన్మకొండ పట్టణాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు అత్యుత్సాహంతో అప్పటి వరకు పేదలు కష్టపడి కట్టుకున్న ఇండ్లనూ కూల్చారు. 2017లో వరంగల్ ఎస్‌ఆర్‌నగర్‌లో 900 మందికి జీ+3 ఇండ్లు నిర్మించే నిమిత్తం వారి నివాసాలను బలవంతంగా తొలగించారు. మూడేళ్లు గడుస్తున్నా ఇండ్ల నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. హన్మకొండలోని దీన్ దయాళ్‌నగర్, సమ్మయ్యనగర్‌లో పరిస్థితి ఒకేలా ఉంది. ఇక్కడి భూములు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో పనులు పెండింగ్‌లో పడ్డాయి. వేరే చోట నిర్మాణం చేద్దామంటే భూసేకరణ సమస్య ఉన్నది. దీనికి తోడు ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. హంటర్‌రోడ్‌లోని రైల్వే ట్రాక్ సమీపంలో 700 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలోనూ ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని హామీలిచ్చారు. దాంతో స్థానికులు మొదటి ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేకపోయిన మీరు మళ్లీ అదే హామీ ఇవ్వడం తగునా అని ప్రశ్నించారు.
ఇండ్లు పూర్తైనా..
హన్మకొండ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ నగర్‌లో చేపట్టిన 592 డబుల్ బెడ్ రూంల నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ, గృహ ప్రవేశం ఎప్పుడు, లబ్దిదారులెవరు అనే విషయంలో స్పష్టత లేదు. లబ్దిదారుల కేటాయింపులో నేతల మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయి. వాస్తవానికి ఆ ప్రదేశంలో 20 ఏళ్లుగా వందలాది కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. వారికే ఈ ఇండ్లు నిర్మించి ఇస్తామని నేతలు ప్రచారం చేశారు. కానీ, ఇప్పడు మాత్రం ఎవరిని లబ్దిదారులను చేయాలనే దానిపై రాజకీయం చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన తమకు ఇండ్లు దక్కయోమో అని భయపడుతున్నామని లబ్దిదారులు చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారులు జోక్యం చేసుకుని అర్హులకు ‘డబుల్’ ఇండ్లు లభించేలా చర్యలు తీసుకోవాలని గుడిసెవాసులు కోరుతున్నారు.
tags : double bedroom houses, application, warangal district, trs leaders