- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రైవేటు ఆసుపత్రుల ‘పైసా’చితకత్వం..!
దిశ ప్రతినిధి, మెదక్ : కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగిని కనికరించాల్సింది పోయి ఆ రోగి వద్ద అధిక డబ్బులు వసూలు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయి కొన్ని ప్రైవేటు ఆస్పతులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు ఆస్పతుల తీరు అలాగే ఉంది. కొవిడ్ బారినపడిన వ్యక్తి ఆస్పత్రిలో చేరింది మొదలు అడ్డగోలుగా డబ్బులు గుంజుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలు వేలల్లో ఉంటే ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు మాత్రం లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారి పట్ల అశ్రద్ధ చూపిస్తున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. పలుమూరు అధికారులు అన్ని తనిఖీలు నిర్వహించినా, మంత్రి హరీశ్ రావు ఉమ్మడి జిల్లా ప్రైవేటు అస్పత్రులతో మాట్లాడినా ఏ మాత్రం ఫలితం లేదు.
లక్షల్లో వసూలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో సగటున రోజుకు మూడు వందల పైగా కరోన కేసుతు నమోదవుతుంటే అందులో సుమారు వంద మంది వరకు కొవిడ్ చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు అస్పత్రుల్లో చేరిన వ్యక్తి వద్ద జీవో 248 ప్రకారం ఐసోలేషన్ వార్డు ( ఆక్సిజన్ లేకుండా ) రోజుకు రూ . 4 వేలు, ఐసీయూ ( ఆక్సిజన్ ) రోజుకు రూ .7,500, ఐసీయూ ( వెంటిలేటర్ ) రోజుకు రూ .9 వేలు, ఆర్టీపీసీఆర్ టెస్టు కు రూ .850, రాపిడ్ టెస్టుకు రూ.750 చెల్లించాలని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా వేలల్లో నుండి లక్షల్లో వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తుండటంతోనే ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.
మూడు రోజులకు రూ.లక్షా 70 వేలు వసూలు …
సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా సోకిన వ్యక్తి ఆడ్మిట్ అయ్యాడు. అతని వద్ద నుండి మూడు రోజులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అతను ఐసీయూలో ఉన్నా సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. కానీ ప్రైవేటు ఆస్పత్రిలో ఏకంగా లక్షా 70 వేలు వసూలు చేశారు. అడ్మిట్ ఫీజుగా రూ.500, ఇద్దరు డాక్టర్లు పరీక్షించినట్టు బిల్లులో పేర్కొన్నారు. ఇద్దరు డాక్టర్లకు రూ.15 వేలు ( రెండు విజిట్స్ కి ), డీఎంవో ఛార్జీలు రూ. 6వేలు, జనరల్ వార్డు, నర్సింగ్ ఛార్జ్, మానిటర్ చార్జ్, శానిటైజేషన్‌కు రూ .87,500, ఆక్సిజన్ ఇన్స్టాలేషన్ రూ.1,850, డిస్పోసిబుల్ ఛార్జీగా రూ.3,980, రూం సర్వీస్ రూ .2,600, ఈసీజీ రూ .300, ఫార్మసీ ఛార్జీగా రూ .16,250, ఆంటీ వైరల్ డ్రగ్స్ రూ.32,900, డయాగ్నోస్టిక్ కు రూ.2,900, ఫుడ్ ఛార్జ్ రూ.1050 మొత్తం రూ.లక్షా 71 వేల 530 బిల్లు వేశారు. అందులో అడ్వాన్స్ గా 70 వేలు చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకున్నారని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితుడు తెలిపిన వివరాలివి. ఇంతలా అధిక ధరలకు వసూలు చేస్తే తాము ఎలా చికిత్స పొందేదంటూ తన ఆవేదన వెలిబుచ్చాడు.
మంత్రి మాటలు బేఖాతర్ …
సిద్దిపేటతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు కొవిడ్ పేషంట్ల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఆస్పత్రి యాజమాన్యాలతో మాట్లాడి సిటీ స్కాన్ డబ్బులను రూ. 5 వేల నుండి రూ.2500 లకు తగ్గించారు. మంత్రి మాట విన్న ఆస్పత్రి నిర్వాహకులు రెండు రోజుల పాటు రూ.2,500 వసూలు చేసి, తిరిగి మళ్లీ అదే రూ .5 వేలను ఫీజుగా వసూలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇతర వైద్య అధికారులు పలు మార్లు తనిఖీ చేశారు. తనిఖీలో అధిక ఛార్జీలువసూలు చేయడంతో పలు ప్రైవేటు ఆస్పత్రులను హెచ్చరించారు. మరోసారి ఇలాగే రిపీట్ అయితే తప్పకుండా ఆస్పత్రిని సీజ్ చేస్తామని వారించారు. అయినా ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం తన తీరు మార్చుకోలేదు. అదే స్థాయిలో రోగుల వద్ద ముక్కుపిండి మరీ డబ్బులు గుంజుతున్నారు.
ప్రభుత్వ వైద్యుడు ప్రయివేట్ గా వైద్యం…
సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డా. క్రాంతికుమార్ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడని సమాచారం. జిల్లా ఆస్పత్రికి వచ్చిన వారందని తన ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న నర్సులు, సిబ్బంది సైతం ఆ వైద్యుడికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం జిల్లా వైద్యాధికారులు, ఉన్నతాధికారులు, సంబంధిత జిల్లా మంత్రికి తెలిసిన వారి నుండి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆయన వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయల్లా కొనసాగుతుందని పలువురు ముచ్చటించుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేస్తున్న ప్రభుత్వ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.