- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంక్రాంతి.. ‘ప్రైవేట్’కు నిజమైన పండుగే..!
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేట్‌కు నిజంగా పండుగే.. అనుకున్న సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు నడపకపోవడం నిజంగా ట్రావెల్స్‌కు కలిసొచ్చే సందర్భమే.. ప్రైవేట్‌ను ఢీకొట్టే స్థాయి లేదనుకోవాలో లేక అవసరాన్ని క్యాష్‌గా మలుచుకునే వెసులుబాటు రోడ్డు రవాణా సంస్థ కల్పిస్తుందనుకోవాలో గానీ ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.. సొంతూళ్లకు వెళ్లాలన్న తాపత్రయంలో బస్సెక్కక ముందే చుక్కలు చూస్తున్నారు. పండుగపూట భారమైన ప్రయాణాన్ని భరిస్తూ సాగిస్తున్నారు. ఆర్టీసీ స్వీయ తప్పిదమో, సర్కార్ నిర్లక్ష్యమో సంక్రాంతి పండుగ ట్రావెల్స్ యాజమాన్యాలకు కనక వర్షం కురిపిస్తున్నది.
సంక్రాంతి పండుగ అంటే చాలు హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా ఖాళీ అవుతుంది. మూడు రోజుల పాటు సాగే పెద్ద పండుగకు తెలుగు రాష్ట్రాల్లో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ. లక్షలాది మంది పల్లె బాట పడతారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి తెర తీశాయి. పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రైవేట్‌కు రాచమార్గం వేసింది. సంక్రాంతికి మరో రెండు రోజులే ఉండగా ప్రైవేటు ఆపరేటర్లు తత్కాల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అడిగినంత చెల్లిస్తేనే టిక్కెట్ రిజర్వు చేస్తున్నారని, ఆర్టీసీ బస్సులు సరిపడా లేవని ప్రయాణికులు బాధపడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ సాధారణ రోజుల్లో చార్జీల కంటే ఈ సీజన్‌లో ఏకంగా ఐదింతలు గుంజుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతానికైతే అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు.
మీరే వసూలు చేసుకోండి..
నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరలను పెంచేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాల్సిన రవాణా శాఖ అటు వైపే చూడడం లేదు. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తూ దోపిడీకి పరోక్షంగా సహకరిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూల్‌తో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే ఈ ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో ప్రైవేటు బస్సులు నడుపుతున్నారు. ఈ ప్రాంతాలకు డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం బస్సులను నడపాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. మొక్కుబడిగా స్పెషల్ బస్సులు వేసి ఊరుకుంది. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా సరిపోవడం లేదు. ఇదే ప్రైవేటు ట్రావెల్స్‌కు వరంగా మారింది. అడ్డగోలుగా టికెట్ల ధరలను పెంచేస్తున్నారు.
డిమాండ్‌ను బట్టి దోపిడీ..
సంక్రాంతికి నగరం నుంచి వెళ్లే వారు ఈనెల 12, 13, 14 తేదీల్లో ఎక్కువగా ప్రయాణమవుతుంటారు. తిరిగి 16, 17 18 తేదీల్లో నగరానికి వస్తుంటారు. ఈ తేదీల్లోనే టిక్కెట్ల ధరలను రెట్టింపు, అంతకంటే ఎక్కువ పెంచి విక్రయిస్తున్నారు. ఆరు రోజుల్లో ఉన్న డిమాండును సొమ్ము చేసుకునేందుకు పగలూ రాత్రి ప్రైవేటు బస్సులను నడుపుతున్నారు. బస్సుల్లో కల్పించే సౌకర్యాలు, సమయాలను బట్టి టికెట్ ధరలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
11 వేల కాంట్రాక్టు క్యారేజ్ బస్సులు..
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు పెద్దసంఖ్యలోనే ప్రైవేటు బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. తెలంగాణ రవాణా శాఖ రికార్డు ప్రకారం కాంట్రాక్టు క్యారేజ్ పర్మిట్ ఉన్న బస్సులు 11 వేల వరకు తిరుగుతున్నాయి. వీటిలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో రిజిస్టర్ అయిన బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్తున్నవీ ఉన్నాయి. నగరం నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తున్నా సరిపడా లేకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్ కేంద్రంగా బస్సులు నడుపుతున్నారు. రూట్లలో డిమాండును బట్టి బస్సులు నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రైవేట్ కోసమేనా..?
తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ బస్సులపై నిర్లక్ష్యం తేటతెల్లమైంది. గత ఏడాది వరకు ఏటా కనీసం 4 వేల బస్సులను తిప్పే ఆర్టీసీ ఈసారి కేవలం 1600 బస్సులకే పరిమితమైంది. ప్రధాన రూట్లలో అసలు బస్సులే నడపడం లేదు. ఇది కేవలం ప్రైవేట్ కోసమేనని స్పష్టమవుతోంది. తెలంగాణ ఆర్టీసీ 2019లో 4100 బస్సులు, 2020లో 4940 బస్సులను ఏపీకి తిప్పింది. దీంతో ఆదాయం కూడా రూ.100 కోట్లకు చేరింది. సంక్రాంతి ఆర్టీసీకి కీలకమైన రోజులుగా భావిస్తోంది. ఏటా నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఆర్టీసీ ఉద్దేశపూర్వకంగానే ప్రైవేట్‌కు మద్దతుగా ఉండేందుకు తక్కువ బస్సులను తిప్పుతుందని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రూట్లలో ఎందుకు బస్సులు తిప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్తో ఒప్పందంతోనే ఆర్టీసీ రిజర్వేషన్లు, ప్రత్యేక ఏర్పాట్లు చేయడం లేదనే అపవాదూ ఉంది.
ధరలు ఐదింతలు..
పండుగ జర్నీని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ధరలు విపరీతంగా పెంచాయి. టికెట్లపై ఐదింతలకుపైగా ధరలు పెంచారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ ఆధ్వర్యంలోని ఏసీ బస్సులకు రూ.540 వరకు ఉండగా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం రూ.1700 నుంచి రూ.2390 వరకు తీసుకుంటున్నాయి. కనీస ధరను రూ.1500గా నిర్ధారించారంటే ఏ రకంగా దోచుకుంటున్నారో తెలుస్తోంది. ఆరెంజ్ ట్రావెల్స్ వంటి సంస్థలు ఒక్క టికెట్‌కు రూ.2200 వరకు ధర ఖరారు చేశాయి.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి సాధారణ ధర రూ.1023 వరకు ఉండగా ప్రస్తుతం రూ.400 వరకు పెంచాయి. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ రూ.5000 దాటించాయి. ఆరెంజ్, న్యూ కాళేశ్వరి, టూర్ వంటి ట్రావెల్స్ సంస్థలు రిజర్వేషన్ల ఛార్ట్‌లో ప్రారంభ ధరనే రూ.5 వేల నుంచి మొదలుపెట్టాయి. కొన్ని ట్రావెల్స్ ఏకంగా రూ.7000 వరకు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి గుంటూరుకు సాధారణ ధర రూ.380 నుంచి రూ.408, రూ.580 వరకు ఉండగా ప్రైవేట్ సర్వీసుల్లో మాత్రం రూ.3 వేలకు పైగా వసూలు చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బస్సులు రూ.3,600 వరకు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు సాధారణ ధర రూ.580 నుంచి రూ.620 వరకు స్పెషల్ ఛార్జీతో సహా టికెట్ ధర ఉంటుండగా ప్రైవేట్ ట్రావెల్స్ నాన్ ఏసీ బస్సుల్లోనే రూ. 3,200, ఏసీ బస్సుల్లో రూ.4 వేలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి సాధారణ ధర రూ.765 నుంచి రూ.1145 వరకు ధర ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ సోమవారం నుంచి ధరను రూ.4 వేలుగా నిర్ధారించారు.