స్వీడన్ యువరాణీ.. వెల్‌డన్!

by vinod kumar |   ( Updated:2020-04-18 04:35:38.0  )
స్వీడన్ యువరాణీ.. వెల్‌డన్!
X

దిశ వెబ్‌డెస్క్:
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. మనలో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ, వైద్యులు, నర్సులు, హెల్త్ వర్కర్స్ కరోనాపై పోరులో ముందుండి ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. యావత్ ప్రపంచం వారి సేవలకు సలాం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వైద్య బృందానికి ఉడుతాభక్తిగా సాయం చేద్దామని.. స్వీడన్ యువరాణి సోఫియా స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. అందుకోసం మూడు రోజుల ఇంటెన్సివ్‌ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసి వాలంటీర్‌గా చేస్తోంది. స్టాక్ హోమ్ లోని సోఫియామెట్ ఆస్పత్రిలో ఆమె హెల్త్ కేర్ అసిస్టెంట్ గా సేవలందించింది. ఆ ఆస్పత్రికి ఆమె గౌరవ అధ్యక్షురాలు కావడం విశేషం. ‘గత వారం ఆస్పత్రిలో జరిగిన ‘మెడికల్ ఎడ్యుకేషన్ విత్ ఏ మేజర్ ఇన్ హెల్త్ అండ్ కేర్’ కార్యక్రమానికి వెళ్లాను. అత్యవసర సమయంలో.. పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. అందుకే నేను ఈ పనిలో భాగమయ్యాను. నాతో పాటు శిక్షణ తీసుకున్న కొత్త సిబ్బందితో, ఇప్పటి వరకు పనిచేస్తున్న వారికి కొంత వెసులు బాటు కల్పిస్తాం, వారికి మా సపోర్ట్ అందిస్తాం. అంతేకాదు కరోనా బాధితులను కూడా చూసుకుంటాం. ఈ విపత్తు సమయంలో పనిచేయడం నిజంగా నాకు గౌరవం. ధన్యవాదాలు’ అంటూ సోఫియా తెలిపారు. సోఫియామెట్‌ ఆస్పత్రి వైద్యేతర సిబ్బందికి ఆన్‌లైన్‌లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైద్య సిబ్బందిపై అధిక భారం పడకుండా క్లీనింగ్‌, వంట చేయడం తదితర పనుల్లో శిక్షణ ఇస్తారు.

ఇన్స్ స్టాగ్రామ్ వేదికగా :

‘‘ఈ సంక్షోభ సయమంలో.. వైద్యులు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్స్ పై పని భారం పెరిగింది. ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న యువరాణి తన వంతు బాధ్యతగా వాలంటరీ వర్కర్‌గా సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. వైద్య సిబ్బందికి కాస్తయిన పని భారం తగ్గించాలని భావించారు. ఆమె చాలా మంచి పని చేస్తోంది’’అని స్వీడిష్ రాయల్ ఫ్యామిలీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. స్వీడన్‌లో ఇప్పటి వరకు 1,300 కు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags: corona virus, princess sofia, sweden, carl philip,swedish royal family, sophiahemmet hospital, health care assistant

Advertisement

Next Story

Most Viewed