అమర్‌నాథ్ యాత్ర రద్దు కాలేదు

by vinod kumar |
అమర్‌నాథ్ యాత్ర రద్దు కాలేదు
X

శ్రీనగర్ : కరోనావైరస్ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర్రపై అనిశ్చితి నెలకొంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం.. జమ్ము కశ్మీర్‌లో 77 కొవిడ్ 19 రెడ్ జోన్‌లు ఉండటంతో ఈ యాత్ర నిర్వహించడం కష్టమేనని అమర్‌నాథ్ దేవస్థానం బోర్డు ఓ ప్రకటన విడుదల చేయడంతో ఈ గందరగోళం మరింత పెరిగింది. అయితే, దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసినట్టు.. ఉపసంహరించినట్టుగా భావించాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. దీంతో అమర్‌నాథ్ యాత్ర యథావిధిగా కొనసాగనుందని తెలుస్తున్నది. గతేడాది కూడా అమర్‌నాథ్ యాత్ర అర్ధాంతరంగా రద్దయింది. జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని నీరుగార్చడం.. సెక్యూరిటీ పెంచడం.. ఉగ్రవాదుల కాల్పులు వెరసి ఈ యాత్రను ప్రభుత్వం నిలిపేసింది. కాగా, ఈ సారి కరోనావైరస్‌తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అదీగాక, లాక్‌డౌన్‌తో అన్ని మతాల ప్రార్థనలు, కార్యకలాపాలు రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలోనే మహమ్మారి కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము చైర్మన్‌షిప్ నేతృత్వంలో శ్రీ అమర్‌నాథ్‌జీ దేవస్థానం బోర్డు(ఎస్ఏఎస్‌బీ).. యాత్రను రద్దు చేస్తున్నట్టు తొలుత విడుదలైన ప్రకటన పేర్కొంది. అంతేకాదు.. మెడికల్ ఫెసిలిటీ, క్యాంప్‌లు, సరుకుల రవాణా, మంచు తొలగించే పనులు సాధ్యం కాకపోవచ్చని, ఈ యాత్ర రద్దుతో మతపరమైన కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని చాటిచెప్పినట్టవుతుందనీ అభిప్రాయపడింది. కాగా, తర్వాత జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ మరో ప్రకటన విడుదల చేసింది. అందులో తొలుత విడుదలైన ప్రకటనను రద్దు చేసినట్టుగా భావించాలని తెలిపింది. ఈ వ్యవహారంపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో జమ్ము కశ్మీర్‌ పాత్ర ఏమి ఉండటం లేదని మరోసారి రుజువు అయిందని విమర్శించారు.

Tags: amarnath yatra, cancelled, u turn, press note, withdrawn, lt. governor, corona

Advertisement

Next Story

Most Viewed