బ్రేకింగ్.. శీతాకాల విడిది.. 29న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి కోవింద్

by Anukaran |   ( Updated:2021-12-21 03:12:17.0  )
బ్రేకింగ్.. శీతాకాల విడిది.. 29న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి కోవింద్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ నెల 29న నగరానికి వస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను కూడా ఇక్కడే జరుపుకోనున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోనే ఆయన బస చేయనున్నారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి అధికారికంగా సమాచారం రావడంతో తగిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ, జీహెచ్ఎంసీ కమిషనర్ సహా వివిధ విభాగాల అధికారులతో ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. విద్యుత్, వైద్యం, రోడ్లు, బీఎస్ఎన్ఎల్ తదితర పలు విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించి రోడ్ల మరమ్మత్తులు తదితరాలపై తగిన సూచనలు చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వివిధ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.

ప్రతీ సంవత్సరం శీతాకాల విడిది నిమిత్తం సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి రావడం ఆనవాయితీ. ఈసారి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నది. కంటోన్మెంట్ రోడ్ల మూసివేతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతిని కలవడానికి వచ్చే సందర్శకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. రాష్ట్రపతి షెడ్యూలుకు అనుగుణంగా బొల్లారం నుంచే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని పర్యటనలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది.

Advertisement

Next Story