‘పీకే’ ఎ‘జెండా’ ఎటెళ్లునో!

by Shamantha N |
‘పీకే’ ఎ‘జెండా’ ఎటెళ్లునో!
X

సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)పై జేడీ(యూ) వైఖరితో విభేదించినందుకు ఆయన్ను ఆ పార్టీ నుంచి ‘పీకే’సిన అనంతరం ఎన్నికల వ్యూహకర్త పీకే(ప్రశాంత్ కిషోర్) మంగళవారం మొదటిసారి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ అధికార దాహంతోనే బీజేపీతో జతకట్టారనీ, బీహార్ ప్రయోజనాల కోసమే అయి ఉంటే ఎందుకు ప్రత్యేక హోదా రప్పించలేకపోయారని ప్రశ్నించారు. నితీశ్ మహాత్మాగాంధీ వైపా, ఆయన్ను చంపిన గాడ్సే పక్షమా అనేది చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార జేడీయూ కూటమికి పీకే ప్రశ్నలు సంధించడం ఎవరికి లాభిస్తుంది.. చివరికి పీకే ఏ ‘జెండా’ కిందకు వెళ్తారు.. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, పీకే బీహార్ అభివృద్ధిపై వేసిన ప్రశ్నలకు ప్రజాక్షేత్రంలో పార్టీలు సమాధానం చెప్పాల్సి ఉంటుందేమోనని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

బీ‘హార్’ కిస్కా హోగా!

‘‘బాత్ బీహార్ కీ’’ పేరుతో బీహార్‌లో వచ్చే 100 రోజుల్లో పర్యటిస్తాననీ, యువతతో ముచ్చటిస్తానని రేపటి(ఫిబ్రవరి 20) నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తానని పీకే చెప్పారు. 1,000 మంది యువకులతో బీహార్ రాష్ట్రాన్ని ఏ విధంగా అగ్ర రాష్ట్రాల జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేస్తానని తెలిపారు. అదే సందర్భంలో తాను రాజకీయపార్టీని ప్రారంభించడం లేదనీ, ఏ కూటమిలో చేరడంలేదని పీకే స్పష్టం చేశారు. పీకే వేసిన ప్రశ్నలు పరిశీలిస్తే.. 2005 నుంచి 2020 వరకు (15 ఏండ్లలో) బీహార్‌లో జరిగిన అభివృద్ధి చాలా తక్కువనీ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అన్ని సూచికల్లో వెనుకబడే ఉందని చెప్పారు. 2005లో బీహార్ పేద రాష్ట్రమనీ, ఇప్పుడూ అలాగే ఉందని మార్పు చెందలేదని తెలిపారు. ఇంత సుదీర్ఘ కాలంలో బీహార్ అభివృద్ధికి నితీశ్ చేసిన సుపరిపాలన నమునా ఎక్కడుందని ప్రశ్నించారు.

వ్యూహకర్త రాజకీయం చేయొద్దా!

పీకే వ్యాఖ్యలపై జేడీయూ స్పందించింది. పీకే రాజకీయాలు మానేసి, తన వ్యాపారం చూసుకుంటే మంచిదని హితవు పలికింది. ఎన్నికల వ్యూహకర్తగా పీకే గతంలో చాలా పార్టీలకు పనిచేశారని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి గుర్తు చేశారు. అది అనైతికం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై పీకే స్పందిస్తూ వివిధ రాజకీయ పార్టీలకు తాను స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరించింది వాస్తవమనీ, కానీ, ఆ విషయం అందరికీ తెలుసునని, తాను ఏ విషయం దాచలేదని, జేడీయూలోనూ నేరుగానే చేరానని బదులిచ్చారు.

చినికి.. చినికి.. గాలి వానై..

చినికి.. చినికి.. గాలి వానవుతుందన్నట్టు పీకే తెరమీదకు తెచ్చిన చర్చ పెద్ద ఎజెండాగా మారితే.. జేడీయూ కూటమి ఇరకాటం తప్పదేమోనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో పీకే వ్యూహకర్తగా ఉన్న మహాకూటమి(మహా ఘట్ బంధన్)లో జేడీ(యూ) నితీశ్ కుమార్, ఆర్జేడీ (లాలూ ప్రసాద్ యాదవ్), కాంగ్రెస్‌ పార్టీలు బరిలో దిగాయి. కూటమి ఆధ్వర్యంలో హర్ ఘర్ దస్తక్(గడప గడపకు) నినాదంతో 243 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేశారు. నితీశ్ కుమార్ ‘బీహారి సమ్మాన్ సమ్మేళన్’ పేరిట ప్రవాస బీహారీలను సన్మానిస్తూ, బీహార్ ప్రైడ్ గురించి మాట్లాడుతూ ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. అయితే, ఆ తర్వాతి కాలంలో లాలూప్రసాద్ యాదవ్‌పై సీబీఐ దాడులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నితీశ్ ఆ కూటమి నుంచి బయటకొచ్చి బీజేపీతో జతకట్టి మళ్లీ సీఎం పీఠాన్ని అధిష్టించారు. (2015)నాడు బీహార్ ప్రైడ్ పేరిట ప్రచారం సాగించిన నితీశ్‌కు సరిగ్గా ఐదేండ్ల తర్వాత నేడు(2020) మళ్లీ అదే బీహార్ ప్రైడ్ పేరిట కౌంటర్ ప్రచారం ప్రారంభమైంది. పీకే చేసే ‘‘బాత్ బీహార్ కీ’’ నితీశ్‌కు, ప్రతిపక్ష పార్టీలకు ఏ మేర నష్టం లేదా లాభం చేకూరుస్తుందో చూడాలి. అయితే, ఇప్పటికే బీహార్‌లో సీపీఐ నాయకులు, జేఎన్‌యూ విద్యార్థి నేత ‘జన గణ మన’ పేరిట వామపక్ష పార్టీల మద్దతుతో యాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యాత్రల పర్వం సాగుతుండగా భవిష్యత్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు కూటమిగా మారేనా.. వారికి ‘పీకే’ వ్యూహాలు రచించేనా.. వీటన్నింటికి సమాధానం కాలమే చెబుతుందనీ, అప్పటి వరకు వేచి చూడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed