నా గెలుపుతో తెలంగాణలో అనేక మార్పులు : ఈటల

by Sridhar Babu |
etala rajender
X

దిశ, హుజూరాబాద్ : పదిహేడు సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో గడిపిన తనను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని బీజేపీ నాయకులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజా దీవెన యాత్రలో కాలికి గాయమై హైదరాబాద్ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో కాలికి శస్త్రచికిత్స తర్వాత గురువారం హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఒక్క హుజురాబాద్లో గెలవడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేసిందని.. తనకు మద్దతిచ్చే నాయకులను కేసుల పేరు చెప్పి భయభ్రాంతులకు కు గురిచేస్తున్నారని అన్నారు. ఎవరెంత చెప్పిన ప్రజల అభిప్రాయం మారదని, నేను రాజీనామా చేయడంతో ఎన్నో మార్పులు వచ్చాయని.. ఎందరికో వరాలు వచ్చాయని గుర్తుచేశారు. అంతేకాకుండా నా గెలుపుతో తెలంగాణలో అనేక మార్పులు వస్తాయని ఈటల స్పష్టంచేశారు.

మానుకోటలో ఉద్యమకారుల పై రాళ్లు రువ్విన ఉద్యమ ద్రోహులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. 19 మంది పై రాళ్ల దాడి చేసి గాయపడిన ఒక వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్సీ కావడం ఆ పార్టీ దౌర్భాగ్యమని.. దీనంతటినీ ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న దిగజారుడు చర్యలను సోషల్ మీడియాలో ప్రజలు ఎండగడుతున్న విషయం తెలుసునన్నారు.

పాదయాత్ర కొనసాగిస్తా..

రెండు మూడు రోజుల విశ్రాంతి తర్వాత పాదయాత్ర తిరిగి కొనసాగిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎక్కడైతే ఆపి వేశానో అక్కడ నుండి తిరిగి ప్రజా దీవెన యాత్ర ప్రారంభిస్తానన్నారు. ప్రజలను కలుసుకుని వారి దీవెనలు పొందుతానని వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, అశ్వద్ధామ రెడ్డి పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed