రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం

by Shyam |
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వానకు పలు ప్రాంతాల్లోని స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఈ ఎఫెక్ట్ ఉత్తర తెలంగాణపై భారీగా పడింది. ఎన్పీడీసీఎల్ పరిధిలో ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రమైంది. వీటితో పాటు సిరిసిల్ల జిల్లా, వరంగల్, కరీంనగర్ ప్రాంతాలు సైతం నీట మునగడంతో విద్యుత్ సరఫరా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల విద్యుత్ కేబుళ్లపై చెట్టు కొమ్మలు విరిగిపడటంతో కరెంట్ సరఫరా జరగలేదు. అంతేకాకుండా పలు ఫీడర్లలో బ్రేక్ డౌన్ సమస్యల కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు సైతం దెబ్బతినడంతో విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఇప్పటికే వాతావారణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అయితే ఈ భారీ వర్షాలకు విద్యుత్ శాఖ సిబ్బంది ముందస్తుగానే రక్షణ చర్యలు చేపట్టినా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిలయ్యారు. అయితే గత నెలలో కురిసిన వర్ష బీభత్సంతో ఏర్పడిన నష్టంతో పోల్చితే ఇటీవల కురిసిన వానలకు విద్యుత్ సంస్థలు కాస్త తక్కువగానే నష్టపోవడంతో సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. హన్మకొండ గోపాల్​ పూర్ వద్ద సబ్​స్టేషన్​నీట మునగడంతో విద్యుత్​సరఫరాకు ఇబ్బందులు ఏర్పడి కొద్ది గంటలు సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆల్టర్ నేట్ లైన్ ద్వారా విద్యుత్​పునరుద్ధరణ చేయడంతో పరిస్థితి కాస్త మెరుగైంది.

ఇదిలా ఉండగా గతంలో వర్షాలు కురిసిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 517 స్తంభాలు దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లలో 117 చోట్ల బ్రేక్ డౌన్లు జరిగాయి. 28 చోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అయితే రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. అయినా మహానగరం పరిధిలోనే 13 స్తంభాలు, ఐదు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. గతంలోనే అన్ని స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లకు మరమ్మతులు పూర్తిచేయడం వల్ల నష్టం కాస్త తక్కువగా వాటిల్లినట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed