ఏపీలో ట్రెండింగ్.. లేఖల రాజకీయం

by srinivas |
ఏపీలో ట్రెండింగ్.. లేఖల రాజకీయం
X

ఆంధ్రప్రదేశ్‌లో లేఖల రాజకీయం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఆరంభమైన నాటి నుంచి అధికార పార్టీపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఆరంభమయ్యాక ఈ ఆరోపణల స్థాయిలో తీవ్రత పెరిగింది. కరోనా పేరిట స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు రద్దు చెయ్యగానే రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది.

స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ప్రకటించగానే అధికార పార్టీ అగ్గిమీద గుగ్గిలమైంది. సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్ ఆయనను కుల పక్షపాతిగా అభివర్ణించారు. ఇక రాజ్యాంగబద్దమైన పదవిలో కొనసాగుతున్న స్పీకర్ వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయన్నది నిర్వివాదాంశం. ఇందులో చీఫ్ సెక్రటరీ కలుగజేసుకుని పరిస్థితి ఏమాత్రం తీవ్రంగా లేనప్పటికీ ఎన్నికలను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? కరోనా స్థితి గతులపై ఆరాతీసేందుకు ఆరోగ్యశాఖాధికారులను సంప్రదించలేదు, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో డీజీపీని సంప్రదించలేదు. ఎలా రద్దు చేశారంటూ లేఖ ద్వారా సీఈసీని నిలదీశారు.

ఎన్నికల రద్దుపై గవర్నర్‌కు వివరణ ఇచ్చిన సీఈసీ.. సీఎస్‌కు లేఖ ద్వారా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులతో తనకు సంబంధం లేదని, దేశంలోని వివిధ రాష్ట్రాల సీఈసీలంతా టచ్‌లో ఉన్నామని, జాతీయ ఆరోగ్య శాఖను సంప్రదించి తన విశేషాధికారాలు ఉపయోగించి ఎన్నికలను రద్దు చేశానని, ఎన్నికల నిర్వహణ విషయంలో తన మాటే శాసనమని ప్రకటించారు. దీంతో మరోసారి అధికార పార్టీకి చిర్రెత్తుకొచ్చింది. దేశంలో ఇతర రాష్ట్రాలు, జాతీయ ఆరోగ్య శాఖ అన్నప్పుడు నోటిఫికేషన్ ఎలా ఇచ్చారంటూ నిలదీయడం ఆరంభించారు. దీంతో తన కుటుంబ సభ్యులకు హాని ఉందంటూ కేంద్రానికి ఆయన లేఖ రాశారంటూ వార్తలు హల్ చల్ చేశాయి.

సీఈసీ కేంద్రానికి లేఖ రాశారంటూ వార్తలు వెలవడడమే ఆలస్యం.. పదవీ గండం ముంచుకొస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో లేఖను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాశారు. అందులో సీఈసీ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఆయన కుటుంబాన్ని దూషించారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, స్పీకర్, ఇతర మంత్రులు ఆయనపై మాటలదాడి చేశారన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ చేసిన ఆరోపణల్లాంటివే.. ఆయన లేఖలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిందని ఆరోపించారు. ఆయనకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్ర బలగాల సాయంతో నిర్వహించాలని ఆయన కోరారు.

ఇంతలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ రంగంలోకి దిగి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లాకి తానెలాంటి లేఖ రాయలేదన్నారు. దీంతో అంతా అవాక్కయ్యారు. సినీ నటుడు, జనసేనాని స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకున్న దారుణాలపై సమాచారం అందించాలని సూచించారు. ఎలా కుదిరితే అలా సమాచారం అందించాలని దానిని తాను కేంద్రానికి చేరవేస్తానని వైఎస్సార్సీపీ ప్రభుత్వం దుమ్ముదులిపేస్తానని ప్రకటించారు. ఆయన కూడా కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల అక్రమాలపై కేంద్రానికి లేఖ రాశారు.

Tags: letters, letter to home minister, letter to central home department general secretary, letter to amit shah, kanna laxminarayana, ramesh kumar, neelam sahni,

Advertisement

Next Story

Most Viewed