భార్య అసెంబ్లీకి.. భర్త పార్లమెంటుకు నామినేషన్.. సంచలన డిమాండ్ ఇదే..!

by Indraja |
భార్య అసెంబ్లీకి.. భర్త పార్లమెంటుకు నామినేషన్.. సంచలన డిమాండ్ ఇదే..!
X

దిశ వెబ్ డెస్క్: రెక్కాడితేగానీ డొక్కాడని బ్రతుకులు వాళ్లవి. చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక కాస్త కూసో భూమి ఉంటే ఆ భూమి కూడా సమస్యల్లో ఉంది. డీపట్టా భూముల సమస్యపై ఏళ్ల తరబడి అధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. తమ సమస్య తీరకపోవడానికి కారణం పేదరికమని, అలానే తమకి అధికారం లేకపోవడమే అని భావించిన ఆ పేద దంపతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తమ సమస్యలు తీర్చుకోవడమే కాదు, తమలా ఎవరు సమస్యలతో పోరాటం చేయకుండా చేయాలి అనుకున్నారు. అందుకే ఎన్నికల బరిలో నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలోని పోలాకి మండలం, యాట్ల వలస గ్రామానికి చెందిన కాయ దుర్గారావు ఆయన భార్య కామేశ్వరి నరసన్నపేటలోని పెద్ద పేట సమీపంలో నిత్యం చేపలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.

రోజు పది కిలోమీటర్లు ప్రయాణించి నరసన్నపేటకు వచ్చి వీరు అక్కడ చేపలను విక్రయిస్తుంటారు. అయితే ప్రస్తుతం వాళ్ళ వ్యాపారం కూడ నిలిచిపోయింది. దీనితో వాళ్లకు ఎలాంటి రాబడి లేకుండా పోయింది. ఇక ఉన్న భూమి కూడా సమస్యల్లో ఉంది. ఆ భూ సమస్య కోసం 2020 నుంచి తిరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో వాళ్ళు నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి భర్త దుర్గారావు, నరసన్నపేట అసెంబ్లీ నుంచి భార్య కామేశ్వరి పోటీ చేసేందుకు ఎన్నికల బరిలో దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికంలో ఉన్న తమను ఏ అధికారులు ఆదుకోలేదని ఈ డీపట్టా భూముల సమస్యపై 2020 నుంచి తిరుగుతూనే ఉన్నామని, అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే రానున్న ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్నామని, తమలా ఎవరు సమస్యలతో పోరాడకూడదని, సమస్యల్లో ఉన్న వాళ్లకు అండగా నిలవాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story