AP Politics: మర్యాద రామన్నలు..వైసీపీ నాయకుల ప్రసంగాల్లో మారిన తీరు

by Indraja |
AP Politics: మర్యాద రామన్నలు..వైసీపీ నాయకుల ప్రసంగాల్లో మారిన తీరు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో ప్రధానంగా వైసీపీ నాయకులను చీల్చి చెండాడటంలో టీడీపీ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ముందుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే గతంలో సీఎంగా ఉన్న జగన్మోహనరెడ్డిని సైతం చెత్త పన్ను వేయడంపై చెత్త ముఖ్యమంత్రి అంటూ విమర్శలు ప్రారంభించారు. అప్పట్లో ముఖ్యమంత్రే కాకుండా ఇతర మంత్రులు అంబటి, రోజా, కొడాలి నాని వంటి వారిపై చమత్కారంగా విమర్శలు గుప్పిస్తూ అయ్యన్నపాత్రుడు రాష్ట్రస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ విధంగా అయ్యన్నపాత్రుడికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడంతో, వైసీపీ ఆయనను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది.

మైకు పట్టుకుంటే తిట్ల దండకమే..

దీనిలో భాగంగా అప్పట్లో నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న పెట్ల ఉమా శంకర్ గణేష్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అయ్యన్నపాత్రుడిపై విమర్శలు గుప్పించేందుకు నానా ఇబ్బందులు పడేవారు. ఒకవేళ తిట్టకపోతే, అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై పునరాలోచన చేస్తుందనే భయంతో తిట్ల దండకానికి సిద్ధపడ్డారు. ఇలా చివరకు చేసేది లేక మైక్ పట్టుకుంటే చాలు.. చెత్త నాకొడుకు అయ్యన్నపాత్రుడు అంటూ రాయడానికి వీలుకాని భాషలో తిట్ల దండకాన్ని అందుకునే వారు.

సమయం, సందర్భం లేకుండా సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు అయ్యన్నను తిడుతూనే ప్రసంగం ముగించేవారు. ఆ విధంగా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం అప్పటి ఎమ్మెల్యే గణేష్ మైకు పట్టుకుంటే తిట్ల దండకాన్ని అలవాటుగా చేసుకున్నారు. ఒకవేళ తిట్టకపోతే పార్టీ అధిష్టానం వద్ద తనకు గుర్తింపు తగ్గుతుందనే భయంతో దూషణలు నిరంతరం కొనసాగించేవారు.

దూషణలకు స్వస్తి..

కూటమి అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యేగా మారిన గణేష్‌లో ఒక్కసారే మార్పు కనిపించింది. తాజాగా గత ప్రభుత్వ హయాంలో రోడ్ల పనులు నిబంధనలకు వ్యతిరేకంగా చేశారంటూ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు అధికారులపై ఆగ్రహించారు. ఆర్ అండ్ బీ రోడ్డుకు మున్సిపల్ నిధులు ఎలా ఖర్చు చేస్తారంటూ ఆ శాఖ అధికారులను ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా నర్సీపట్నంలోనే ఉంటూ ఎందుకు పనులను అడ్డుకోలేదని ఆర్ అండ్ బీ అధికారులను నిలదీశారు.

ఈ ఘటనకు వ్యతిరేకంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే గణేష్ వ్యవహారశైలిలో ఒక్కసారే మార్పు కనిపించింది. సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు అయ్యన్నపాత్రుడు గారు అంటూ సంబోధించడం విశేషం. దీనికి విరుద్ధంగా మైకు పట్టుకుంటే చాలు.. ఆయన్ను తిట్టేందుకు గతంలో పోటీ పడ్డ గణేష్‌లో ఒక్కసారే వచ్చిన ఈ మార్పునకు పట్టణవాసులు ముక్కున వేలేసుకున్నారు.

ఈ మర్యాద రామన్న వ్యవహారం అధికార మార్పిడి వల్ల జరిగిందా? లేకపోతే గతంలో మాదిరి దూషణలకు దిగితే దానికి తగిన శాస్తి జరుగుతుందని భయపడ్డారా? అంటూ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ఏది ఏమైనా గతంలో వినేందుకే కర్ణకఠోరంగా ఉండే విమర్శలకు గణేష్ స్వస్తి పలకడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed