Congressలో పదవులు తెచ్చిన పంచాయితీ

by Nagaya |   ( Updated:2022-12-14 04:43:02.0  )
Congressలో పదవులు తెచ్చిన పంచాయితీ
X

దిశ బ్యూరో, సంగారెడ్డి : ఉమ్మడి మెతుకుసీమ కాంగ్రెస్‌లో పదవుల ప్రకటన పెద్ద కుంపటి రాజేసింది. పదవుల పంపకాలు పార్టీలో కోవర్టు రాజకీయాలను బజారుకీడ్చాయి. పార్టీలో కోవర్టులనే అందలం ఎక్కిస్తున్నారని, కష్టపడి పనిచేసే వారికి విలువ, గౌరవం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి..? పదవుల పంపకాలపై ఆయన అధిష్టాన తీరును మీడియా ముఖంగా తూర్పార పట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాలకు పార్టీలో తీవ్ర నష్టం జరుగుతుందని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్‌లో ఉంటూ కోవర్టులుగా పనిచేసే వారికి పదవులు ఇచ్చారని చేసిన ఆరోపణలపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. పదవుల కేటాయింపు సరిగ జరగలేదని ఇప్పటికే మాజీ మంత్రి గీతారెడ్డి కూడా అధిష్టాన తీరును తప్పుబట్టగా మరో ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి మాత్రం ఇంకా నోరుమెదపలేదు. సంగారెడ్డి జిల్లా డీసీసీ పీఠం నుంచి తన సతీమణి నిర్మలను తప్పించడంతో ఆయన ఎలా స్పందించనున్నారో చూడాల్సి ఉన్నది. మొత్తంగా పార్టీలో పదవుల ప్రకటన గందరగోళ పరిస్థితులను సృష్టించింది. ఈ వ్యవహారాన్ని అధిష్టానం ఎలా చక్కబెట్టనున్నదో చూడాల్సి ఉన్నది.

మొదటి సారి దామోదర ఆగ్రహం

పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నిక అయినప్పటి నుంచి కాంగ్రెస్‌లో నేతల మధ్య పంచాయితీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో పాటు మరి కొంత మంది సీనియర్లు రేవంత్ ఎన్నికను తీవ్రంగా వ్యతిరేకించిన విషయం కూడా విధితమే. అయితే మాజీ మంత్రి దామోదర్ మాత్రం మౌనంగా ఉంటూ వస్తున్నారు. రేవంత్‌తో బాగానే ఉంటూ వచ్చిన ఆయన పార్టీలో జరిగే వ్యవహారాలపై మీడియా ముందుకు రాలేదు. ఇదిలా ఉండగా పార్టీలో పదవుల ప్రకటనతో ఆయన తవ్ర మనస్థాపానికి చెందినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీకి నష్టం చేసే వారికి పదవులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా ముందుకు వచ్చి పదవుల పంపకంపై అధిష్టానం తీరును తప్పుబట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క జగ్గారెడ్డి మాత్రమే రేవంతరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడని పార్టీ శ్రేణులు భావించాయి. ఆయనకు తోడు ఇప్పుడు దామోదర వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.

సిద్దిపేట జిల్లాలో ఎవరు కోవర్టులు..?

ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వారు చేస్తూనే ఉన్నారు. రాహూల్ భారత్ జోడో యాత్రను విజయవంతం చేశారని దామోదర పార్టీ నాయకులను అభినందించారు. అయితే అలాంటి కార్యక్రమాలను జయప్రదం చేసిన వారిని కాకుండా కోవర్టులను పదవులు ఇచ్చారని ఆయన ఆరోపణలు చేశారు. ప్రదానంగా సిద్దిపేట జిల్లాలో అధికార పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్న వారికి పదవులు ఇచ్చారన్నారు. అయితే దామోదర ఎవరి ఉద్దేశించి ఈ ఆరోపణలు చేశారని విస్త్రతంగా చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, మరో నేత శ్రావణ్ కుమార్ రెడ్డి పేర్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది. పార్టీలో కూడా వీరిద్దరి ఉద్దేశించి దామోదర కోవర్టు వ్యాఖ్యాలు చేశారంటున్నారు. అయితే దామోదర పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడని, అందుకే ఇలాంటి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

మరో సీనియర్ నేత గీతారెడ్డి కూడా...

జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి కూడా పదవుల పంపకంపై అధిష్టాన తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె కూడా ఇప్పటి వరకు పార్టీలో వ్యవహారాలపై మీడియా ముందు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పడు స్పందించారు. భట్టి విక్రమార్కకు కూడా సంబంధం లేకుండా ఎలా పదవులు కేటాయింపు చేశారని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో బలమైన నేతలే దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, జగ్గారెడ్డిలు ఈ ముగ్గురు అధిష్టాన తీరును వ్యతిరేకిస్తుంటే పరిస్థితి గందరగోళంగా మారిపోయింది.

పదవులపై జగ్గారెడ్డి మౌనం..

ఇటీవల ప్రకటించిన పార్టీ పదవులు విషయంలో జగ్గారెడ్డి ఇంకా స్పందించకపోవడం గమనార్హం. పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న జగ్గారెడ్డి అందరికంటే ముందే స్పందించేవారు. పదవుల విషయంలో మాత్రం మౌనంగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న తన సతీమణి నిర్మల పేరు కూడా తిరిగి ప్రకటించలేదు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు పాతవారినే తిరిగి డీసీసీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వగా సంగారెడ్డి పేరు ప్రకటించకపోవడం గమనార్హం. అయితే ఆ స్థానంలో ఎవరికి అవకాశం కల్పిస్తారనే చర్చ కూడా జరుగుతుంది. అదే తరుణంలో జగ్గారెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా పార్టీలో చర్చకు వస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా ఈ పంచాయతీలతో పరిస్థితి మరింత అద్వాన్హంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరు కోవర్డులో కూడా త్వరలో వెల్లడిస్తానని దామోదర రాజనరసింహ పేర్కొనడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొన్నది.

Also Read....

ఏపీ పాలిటిక్స్‌పై కార్టూన్-

Advertisement

Next Story

Most Viewed