జగన్ టార్గెట్ నందమూరి ఫ్యామిలీనా?

by Nagaya |   ( Updated:2022-09-23 05:17:54.0  )
జగన్ టార్గెట్ నందమూరి ఫ్యామిలీనా?
X

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నందమూరి ఫ్యామిలీ కేంద్రంగా రాజకీయ రగడ మెుదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసిందని తెలుగు తమ్ముళ్లు, నందమూరి అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నందమూరి తారక రామరావు పేరును కేంద్రంగా చేసుకుని వైసీపీ రాజకీయం చేస్తోందని ఆ పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఇదంతా చంద్రబాబు, లోకేశ్‌లను ఇరుకున పెట్టేందుకేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ ప్రయత్నం నందమూరి ఫ్యామిలీని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆ కుటుంబం వాపోతోంది.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు తెలుగోడి దెబ్బను ఢిల్లీకి రుచి చూపించారు. అంతేకాదు రాజకీయాల్లో రూపాయికే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో హక్కు, బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు రిజర్వేషన్లు... ఇలా అనేక కీలక పథకాలు పెట్టి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారనడంలో సందేహం లేదు. ఇది జగమెరిగిన సత్యం.. జగన్ ఎరిగిన నిజం కూడా. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఎన్టీఆర్ పేరుతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కార్యక్రమాలను రద్దు చేయడం సంచలనంగా మారింది. అన్న క్యాంటీన్లను మూసేయడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశనిస్పృహలకు గురయ్యారు. నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ ఉదంతం మరువకముందే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు నందమూరి ఫ్యామిలీతోపాటు అందరికీ ఆగ్రహం కలిగించాయి. అది మరవకముందే ఎన్టీఆర్ కుమార్తె ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణిస్తే ఆమె మరణంపై కూడా వైసీపీ నేతలు విమర్శలు చేశారు. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు బిల్లు కూడా పాస్ చేసేశారు. ఇవన్నీ గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ పేరు కనిపించకుండా వైసీపీ కుట్ర చేస్తున్నట్లుందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. వైసీపీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. ఎన్టీఆర్ అంటే చంద్రబాబు కంటే తమకే ఎక్కువ గౌరవం ఉందని వాదిస్తోంది. ఎన్టీఆర్ పై అభిమానం, ప్రేమ ఉంది కాబట్టే ఒక జిల్లాకు పేరు పెట్టామని చెప్తోంది. ఒకవైపు అభిమానం ఉందని చెప్తూనే మరోవైపు ఎన్టీఆర్ ఫ్యామిలీ కేంద్రంగా జరుగుతున్న వ్యవహారం వైసీపీ రాజకీయ ఎత్తుగడ అనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, లోకేశ్‌లను దెబ్బకొట్టేందుకు వైసీపీ వేస్తున్న పాచికలు పారకపోగా నందమూరి ఫ్యామిలీకి ఇబ్బందులు తేవడంతోపాటు వైసీపీ కూడా ఆ చట్రలో ఇరుక్కునే పరిస్థితులు వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

అన్న క్యాంటీన్ మూసివేతతో మెుదలు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు విపరీతమైన అభిమానం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, టీడీపీ నేతలు అయితే ఎన్టీఆర్‌ను ఒక దైవంగా కొలుస్తారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నందమూరి తారక రామారావు పేరుతో పథకాలు అమలు చేయడం పరిపాటి. ఎన్టీఆర్ మరణానంతరం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ పేరుతో అనేక పథకాలు అమలు చేసేవారు. అలాంటి కీలకమైన పథకాలలో అన్న క్యాంటీన్ ఒక్కటి. ఈ అన్న క్యాంటీన్ పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసింది. ఈ పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేసింది. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలందరికీ నాణ్యమైన ఆహారాన్ని కేవలం రూ.5కే అందించింది. ప్రతి రోజూ అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఆహార సరఫరా బాధ్యతను 'అక్షయపాత్ర' సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. రోజూ రెండున్నర లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అమలు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. దీంతో తెలుగు తమ్ముళ్లు రోడ్లపైకి ఎక్కి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పేదోడికి పట్టెడన్నం పెడితే నేరమా అంటూ టీడీపీ నిరసన గళం వినిపించింది. అన్న క్యాంటీన్లను నిలిపివేసినప్పుడు నందమూరి ఫ్యామిలీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న గొప్ప కార్యక్రమాన్ని నిలిపివేయవద్దని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ అవి ఓపెన్ కాలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అయితే ఇటీవల కాలంలో తిరిగి తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తోంది. నందమూరి బాలకృష్ణ సతీసమేతంగా హిందూపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. కుప్పంలో చంద్రబాబు ప్రారంభించారు. నందమూరి సుహాసిని గుంటూరు జిల్లాలో ప్రారంభించారు.

నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సహించం

నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు నందమూరి ఫ్యామిలీలో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు బోరున విలపించారు. టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ అంశంపై నందమూరి కుటుంబం ఏకతాటిపైకి వచ్చి వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి, లోకేశ్వరితోపాటు జూ.ఎన్టీఆర్, నందమూరి సుహాసిని అంతా స్పందించి వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. 'మీలా మేం మాట్లాడలేం. మాకు సంస్కారం, సంప్రదాయం ఉంది. మా నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సహించం. రాజకీయాలు హుందాగా చేయాలి. అంతేకాని వ్యక్తిగత దూషణలకు దిగితే వ్యవస్థలను బద్దలు కొట్టుకుని మరి వచ్చి, మీ భరతం పట్టి, తగిన బుద్ధి చెబుతాం అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. నిండు సభలో ఒక ఆడబిడ్డను పట్టుకుని వ్యక్తిగతాన్ని హననం చేస్తుంటే మహిళా ఎమ్మెల్యేలు ఖండించకపోవడం శోచనీయం. నా చెల్లిని పట్టుకుని అనరాని మాటలు అంటారా? గొడ్ల చావిడిలోని భాష వాడితే చూస్తు ఊరుకోం. సమస్యలు, రాజకీయాలు మాట్లాడకుండా నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేస్తే చేతులు కట్టుకుని కూర్చునే పరిస్థితి ఉండదు అని బాలయ్య హెచ్చరించారు. ఇప్పటికైనా మారండి .. లేకుంటే మీ మెడలు వంచి ఎలా మార్చాలో మాకు తెలుసు. అందరికి భార్యలు, పిల్లలు ఉన్నారు.. మేం ఏమీ చేతులు కట్టుకుని కూర్చోం ఖబడ్దార్ అని హెచ్చరించారు. నోరు జాగ్రత్తలో పెట్టుకుని మాట్లాడండి. చంద్రబాబు అనుమతి కూడా మాకు అవసరం లేదని తీవ్ర స్థాయిలో నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఉమామహేశ్వరి ఆత్మహత్యపైనా రాజకీయం

ఎన్టీఆర్ చివరి కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమెకు, రాజకీయాలకు అంతగా సంబంధం లేదు. అయినప్పటికీ ఆమె ఆత్మహత్య ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. ఉమా మహేశ్వరి ఆత్మహత్యకు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ కారణం అని వైసీపీ ఆరోపణలు చేసింది. ఉమామహేశ్వరి మరణంపై అనుమాలున్నాయని.. చంద్రన్న వేధించాడా? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా? ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదంటూ వైసీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాదు ఏకంగా సీబీఐ దర్యాప్తునకు సైతం డిమాండ్ చేసింది. ఈ అంశం నందమూరి కుటుంబాన్ని అభిమానులను తీవ్రంగా బాధించిందంటూ వార్తలు వినిపించాయి. మా ఇంటి మనిషి చనిపోతే రాజకీయం చేస్తారా అంటూ వైసీపీ నేతలకు వారు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వర్సిటీ పేరు మార్పుపై మండిపడ్డ బాలయ్య, తారక్

తాజాగా డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం రాజకీయాలను కుదిపేస్తోంది. ఎన్టీఆర్ పేరును మార్చొద్దంటూ అటు నందమూరి ఫ్యామిలీతోపాటు ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అయితే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గవర్నర్ హరిచందన్‌కు ఫిర్యాదు సైతం చేశారు. అవసరమైతే లీగల్‌గా కూడా పోరాడతామని హెచ్చరించారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై నందమూరి ఫ్యామిలీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ పేరును తొలగించడం అంటే తెలుగు జాతిని అవమానించడమే నందమూరి బాలకృష్ణ అన్నారు. మరోవైపు ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని జూ.ఎన్టీఆర్ కొనియాడారు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు..అలాగని ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు... అని వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

పేరు మార్పు తప్పన్న కల్యాణ్ రామ్

రాజకీయ లాభం కోసం చాలా మంది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అని నందమూరి కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. '1986లో విజయవాడలో మెడికల్‌ యూనివర్సిటీ స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్‌ ఈ మహా విద్యాలయానికి అంకురార్పణ చేశారు. అదే విధంగా ఎంతోమంది వైద్య నిపుణులను ఈ విద్యాలయం అందించింది. తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు, ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వ విద్యాలయానికి డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ అని పేరు మార్చారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, 25ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు' అని కల్యాణ్‌రామ్‌ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పునరాలోచించాలని ప్రభుత్వానికి సూచించారు.

చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు తెరపైకి తారక్ పేరు

అవకాశం దొరికినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందమూరి ఫ్యామిలీని తెరపైకి తీసుకువస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ విడుదల సందర్భంగా ఆ సినిమాపై చంద్రబాబు, లోకేశ్‌లు ట్వీట్ చేశారు. అంతేకాదు పవన్ సినిమాకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందంటూ ధ్వజమెత్తారు. దీంతో నాటి మంత్రి పేర్ని నాని చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను తెరపైకి తీసుకువచ్చారు. తారక్‌ను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సినిమాకు మద్దతుగా మాట్లాడుతున్న చంద్రబాబు... ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎప్పుడైనా పాజిటివ్ కామెంట్లు చేశారా అని నిలదీశారు. జూనియర్ ఎన్టీఆర్‌తో బలవంతంగా జెండా మోయించి.. తరువాత వాడుకుని వదిలేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తావన తీసుకువస్తూ పొగడ్తలు కురిపించారు. అయితే పేర్ని నాని వ్యాఖ్యల వెనుక నందమూరి అభిమానులను ఓన్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా వైసీపీ ప్లాన్ వేస్తోందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

కమ్మ సామాజిక వర్గం మరింత దూరం?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు మీద ఉన్న కోపాన్నంతా కమ్మ సామాజిక వర్గంపై చూపిస్తున్నారని ఇప్పటికీ రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టేందుకు వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలను సీఎం జగన్ రంగంలోకి దించుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మాజీమంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లను తీవ్రస్థాయిలో దుయ్యబడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిని సైతం కమ్మరావతి అంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అది అమరావతి కాదని కమ్మరావతి అని, ఆ భూములు అన్నీ కమ్మ వారివే తప్ప వేరొకరికి లేవు అని ఆరోపిస్తోంది. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూనే వైసీపీ విమర్శలు చేస్తోంది. మరోవైపు వైసీపీ హయాంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలు అనేక కేసులు సైతం ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తాము ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ పేరు విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కమ్మ సామాజిక వర్గం గుర్రుగా ఉంది. ఈ అంశంపై వైసీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గ నాయకులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి కమ్మ సామాజిక వర్గం అండగా నిలిచినా ఆ కులాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ వారు వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన వైసీపీలోని కొందరు నేతలు ఇలానే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి పడవని బాహాటంగానే చెప్తున్నారు. ఓట్లు పడకపోగా టీడీపీకి ఏకపక్షంగా మద్దతిస్తే ఇబ్బందులు పడతామని కూడా చెప్తున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం ఈ వ్యహారంలో వెనుకడుగువేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

డైవర్షన్ పాలిటిక్స్ వర్కౌట్ అయ్యేనా?

కమ్మ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో వైసీపీ అప్రమత్తమవుతూనే ఉంది. తెరపైకి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావడం, ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ టీడీపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. అదేతరుణంలో నందమూరి తారక రామారావుపై తమ అభిమానం చాటుకుంటోంది. అన్న కాంటీన్లకు సంబంధించి వివాదం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జన్మించిన ఊరు అయిన నిమ్మకూరులోని 14 ఎక‌రాల చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజు నాటికి నిమ్మకూరులో 100 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు. దీంతో నందమూరి అభిమానులు కాస్త శాంతించారు. అనంతరం భువనేశ్వరిపై వ్యాఖ్యలు, ఉమా మహేశ్వరి ఆత్మహత్యపై చేసిన వ్యాఖ్యల వల్ల కమ్మ సామాజిక వర్గం నుంచి తిరుగుబాటు వస్తుందని భావించిన వైసీపీ నాయకత్వం అనూహ్యంగా తెరపైకి ఎన్టీఆర్ పేరును తీసుకువచ్చింది. విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టింది. అయితే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. మెుత్తానికి వైసీపీ నాయకత్వం ఎన్టీఆర్ కేంద్రంగా చేస్తున్న రాజకీయం భవిష్యత్‌లో ముప్పు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదనే విమర్శలు ఉన్నాయి.

Also Read : ఎన్టీఆర్ VS కళ్యాణ్ రామ్.. నకిలీ బ్లడ్ అంటూ ఘాటు విమర్శలు

Advertisement

Next Story

Most Viewed