కవిత ఇష్యూలో ఈడీ సీరియస్.. అందుకే ఆమె జైలు వెళ్లడానికి సిద్ధమైందా..?

by Nagaya |   ( Updated:2022-12-02 05:37:18.0  )
కవిత ఇష్యూలో ఈడీ సీరియస్.. అందుకే ఆమె జైలు వెళ్లడానికి సిద్ధమైందా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉన్నదంటూ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ఒక రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంతో ఇకపై ఏం జరగబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఈడీ అధికారుల దర్యాప్తు ప్రక్రియ ఏ రూపం తీసుకుంటుంది? ఆమెకు నోటీసులు జారీ చేస్తారా? విచారణకు పిలుస్తారా? మొబైల్ ఫోన్లలో ఆధారాలు ధ్వంసం చేయాల్సిన అవసరంపై ప్రశ్నిస్తారా? ఆమెను కస్టడీలోకి తీసుకుంటారా? జైల్లో పెడితే పెట్టుకో.. అంటూ కవిత చేసిన వ్యాఖ్యల వెనక మర్మమేంటి? జైలుకు వెళ్లడం ఖాయమా? అందుకు ఇప్పటికే ఆమె మానసికంగా సిద్ధమయ్యారా..? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చలకు దారితీశాయి.

6వ తేదీ తర్వాతే అసలు కథ

మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ అంశం ఉందంటూ ఈడీ తాజాగా ఢిల్లీ స్పెషల్ కోర్టుకు సమర్పించిన అమిత్ అరోరా రిమాండ్ డైరీ రిపోర్టులో పేర్కొన్నది. 'సౌత్ గ్రూపు'ను నియంత్రిస్తున్న ముగ్గురిలో కవిత కూడా ఒకరని ఆ నివేదికలో ఈడీ వ్యాఖ్యానించింది. ఆమె ఏడాది కాలంలో పది ఫోన్లను మార్చిన వ్యవహారాన్ని కూడా ప్రస్తావించింది. బడ్డీ రిటైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అమిత్ అరోరాను అదుపులోకి తీసుకున్న తర్వాత వెల్లడించిన వివరాల మేరకు, ఆయన నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్ ఆధారంగా నివేదికలో వీటన్నింటినీ ఈడీ పేర్కొన్నది. ఇప్పుడు ఏడు రోజుల కస్టడీలో ఉన్నందున ఆయన నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా తదుపరి స్టెప్ ఎలా ఉంటుందనేది కీలకంగా మారింది. డిసెంబర్​6వ తేదీతో ఆయన కస్టడీ ముగిసిపోతున్నందున ఆ తర్వాత జరిగే పరిణామాలపైనే ఆసక్తి నెలకొన్నది.

ఆర్థిక లావాదేవీలపై స్పెషల్ ఫోకస్

లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు ద్వారా రూ.100 కోట్ల మేర ముడుపులు చేతులు మారాయని, చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరాయన్నది ఈడీ వాదన. ఈ వ్యవహారంలో నాలుగైదు దశల్లో ఒక్కొక్కరు ఒక్కో రోల్ పోషించారన్నది అధికారుల ఆరోపణ. వివిధ కంపెనీల బ్యాంకు ఖాతాల మధ్య జరిగిన లావాదేవీలనూ ఈడీ గుర్తించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పలువురిని ఈడీ, సీబీఐ అరెస్టు చేసింది. అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఇంకా కొంత మంది జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. రెండు నెలలుగా ఏకకాలంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుగుతున్నా కవిత పేరు తెరమీదకు రాలేదు. తాజాగా అమిత్ అరోరాను అరెస్టు చేసిన తర్వాత మాత్రమే రిమాండ్ డైరీలో పేర్కొనడంతో వివరాలను రాబట్టడానికి కవితకు కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తారా? అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై ఈడీ ఫోకస్ పెట్టినందున కవిత డైరెక్టర్‌గా ఉన్న పలు కంపెనీల వివరాలను ఈడీ రాబట్టే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆమెకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించింది. కవితకు చెందిన పలు కంపెనీలకు ఆయన చార్టర్డ్ అకౌంటెంట్‌గా వ్యవహరించారు. ఆ కంపెనీల ఆడిట్ రిపోర్టులు, బ్యాంకు ఖాతాల ద్వారా జరిపిన లావాదేవీలు, ఐటీ రిటన్‌లలో పేర్కొన్న ఆదాయం వివరాలు, ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లలోని అంశాలు, తెలంగాణ జాగృతి, భారత్​ జాగృతి లాంటి ఎన్జీవో సంస్థలకు సంబంధించిన విరాళాలు, ఖర్చులు తదితరాలన్నింటిపైనా ఈడీ ఫోకస్ పెట్టే అవకాశముందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

ఆధారాల ధ్వంసంపై ఈడీ సీరియస్

లిక్కర్ స్కామ్‌లో చాలా మంది పాత్ర ఉన్నదంటూ సీబీఐ, ఈడీలు మొదటి నుంచీ వ్యాఖ్యానిస్తున్నాయి. ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. సీబీఐ ఎఫ్ఐఆర్‌లో పేర్లు లేకపోయినప్పటికీ బోయిన్‌పల్లి అభిషేక్, శరత్‌చంద్రారెడ్డి, ముత్తా గౌతమ్, గండ్ర ప్రేమ్ సాగర్ రావు.. ఇలా అనేకమందికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. స్కామ్‌లో వారికి వేర్వేరు రూపాల్లో సంబంధం ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తున్నది. దీనికి సంబంధించి 36 మంది ఏడాది కాలంలో సుమారు 170 మొబైల్ ఫోన్లను, సిమ్ కార్డులను మార్చారని, వాటిలో డిజిటల్ ఎవిడెన్సులు దొరకకుండా ధ్వంసం చేశారని వివరాలతో సహా అమిత్ అరోరా రిమాండ్ డైరీ రిపోర్టులో ఈడీ పేర్కొన్నది. అందులో కవితకు సంబంధించిన పది ఫోన్లు కూడా ఉన్నాయి. వీటిని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందో ఈడీ ఇకపైన ఆరా తీయనున్నట్లు సమాచారం. కొన్ని ఫోన్లలోని డిజిటల్ వివరాలను రాబట్టినప్పటికీ ధ్వంసమైనవాటికి సంబంధించి మాత్రం సీరియస్‌గానే ఉన్నట్లు తెలిసింది. ఫోన్లను ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఇచ్చే వివరణకు అనుగుణంగా తదుపరి చర్యలపై ఈడీ ఫోకస్ పెట్టనున్నది.

ఇప్పటివరకూ ఉన్న ఆరోపణలకు తోడు తాజాగా డిజిటల్ ఎవిడెన్సులను ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారనే అభియోగం కూడా చేరినట్లయింది. ఈ ఫోన్లలోని వివరాలను ఏ మేరకు రాబట్టగలిగినా దానికి అనుబంధంగా ఇంకా ఎవరెవరు కొత్తగా తెరమీదకు వస్తారనేది గమనార్హం. దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిన తర్వాత సీబీఐ దర్యాప్తుకు ఉపశమనం లభించినట్లయింది. ఈడీ తదుపరి దర్యాప్తుపైనే రాష్ట్రంలోని ప్రజల, రాజకీయ పార్టీల దృష్టి కేంద్రీకృతమైంది. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నెలకొన్న పొలిటికల్ వార్ ఇకపైన లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ వ్యవహరించే దూకుడు, మొయినాబాద్ ఫాంహౌజ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 'సిట్' జోరు సరికొత్త దశకు చేరుకోవడం ఖాయమనే కామెంట్లు పొలిటీషియన్ల నుంచి వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య మాటలు, చేతల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది కాలమే నిర్ణయించనున్నది.

Read more:

TRS ఉక్కిరి బిక్కిరి.. మంత్రులు, లీడర్లలోనూ భయం భయం....కవిత ప్రకటనతో మరింత గందరగోళంలోకి గులాబీ శ్రేణులు

Advertisement

Next Story