ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం.. సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు హాజరు

by D.Reddy |   ( Updated:2025-02-18 12:04:08.0  )
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం.. సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు హాజరు
X

దిశ, వెబ్ డెస్క్: దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ పీఠంపై భారతీయ జనతా పార్టీ (BJP) జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈనెల 20న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం (Delhi CM Oath Taking) చేయబోతున్నారు. అయితే, ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండటంతో ఈ వేడుకను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్దఎత్తున సినీ తారలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

ప్రఖ్యాత రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కమలదళం 50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ప్రమాణ స్వీకారానికి ముందు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది.

అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై బీజేపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రేపు జరగబోయే బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎంగా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది వెల్లడికానుంది. కాగా, ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రేఖ గుప్తా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా సీఎంలు లేరు. అందుకోసమే ఢిల్లీ పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈనెల 8న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాల్లో 70 స్థానాలకు గాను బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Next Story