ఉత్కంఠగా జాతీయ రాజకీయాలు.. ఒకే వేదికపైకి KCR, చంద్రబాబు

by Nagaya |   ( Updated:2022-09-08 09:48:22.0  )
ఉత్కంఠగా జాతీయ రాజకీయాలు.. ఒకే వేదికపైకి KCR, చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాలు మరోసారి ఆసక్తిగా మారాయి. ఇటీవల బిహార్ పర్యటనకు వెళ్లి జాతీయ రాజకీయాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ చర్చించి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చిన కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. ఇక కేసీఆర్‌తో భేటీ తర్వాత ఢిల్లీ టూర్‌కు వెళ్లిన బిహార్ సీఎం నితీష్ కుమార్ అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలో టార్గెట్‌గా ప్రతిపక్ష పార్టీల నాయకులను కలుస్తూ బీజేపీకి ఆల్టర్నేట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఓ విషయం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలో సీఎం కేసీఆర్, మాజీ సీఎం ఒకే వేదికను పంచుకోబోతున్నారనే సంగతి చర్చనీయాంశంగా మారుతోంది.

ఒకే వేదికపైకి కేసీఆర్, చంద్రబాబు?

సెప్టెంబర్ 25న హరియాణాలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్ డీ) భారీ ర్యాలీకి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆహ్వానించామని ఐఎన్ఎల్‌డి ప్రధాన కార్యదర్శి అభయ్ చౌతాలా వెల్లడించారు. వీరితో పాటు ఈ ర్యాలీకి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ బాదల్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, బిహార్ సీఎం, డిప్యూటీ సీంలు నితీష్, తేజస్వీ యాదవ్ లకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది.

విపక్షాల బలప్రదర్శన ర్యాలీ

మాజీ డిప్యూటీ పీఎం దేవీలాల్ జయంతి సందర్భంగా ప్రతిపక్షాలనన్నింటిని ఒకతాటిపైకి తీసుకువచ్చి సమస్యలపై చర్చించనున్నట్లు జేడీయూ నేత కేసీ త్యాగి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విపక్షాల బల ప్రదర్శన ర్యాలీ ఉంటుందని చెబుతున్నారు. బీజేపీ పాలనతో ప్రజలు విసుగు చెందారని రాబోయే ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకమై బీజేపీకి చెక్ పెట్టేలా వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో విపక్షాల మధ్య ఐక్యత తీసుకు వచ్చేందుకు నితీష్ కుమార్ కాలుకు బలపం కట్టుకుని ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. 2024 లక్ష్యంగా రాహుల్ గాంధీ, ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరీ, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఓం ప్రకాష్ చౌతాలా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, సీనియర్ రాజకీయ నేత శరద్ యాదవ్, సీపీఐ ఎంఎల్ నేత శ్రీ దీపాంకర్ భట్టాచార్య వంటి ప్రముఖులతో భేటీ అయ్యారు. బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యల విధానాలను ప్రస్తావిస్తూ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25న ఏం జరగబోతోందనేది ఆసక్తిగా మారింది.

కేసీఆర్, చంద్రబాబు హాజరుపై సందేహాలు?

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఫోకస్ పెంచిన నేపథ్యంలో సెప్టెంబర్ 25న హరియాణాలో జరగనున్న కార్యక్రమానికి సీఎం కేసీఆర్, చంద్రబాబులు హాజరు అవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో చంద్రబాబు చేసిన జాతీయ రాజకీయాలు విఫలం అయ్యాయి. బీజేపీని కాదని ఒంటరిగా ముందుకు వెళ్లడం టీడీపీకి తీవ్ర నష్టం కలిగించాయి. తాజాగా చంద్రబాబు తిరిగి ఎన్డీయేలో కలవబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో విపక్షాల సమావేశానికి చంద్రబాబు హాజరు అవుతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. మరోవైపు గతంలో కాంగ్రెస్ కలిసి వస్తున్న కార్యక్రమాలకు టీఆర్ఎస్ హాజరు కాదు అంటూ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికల సమావేశానికి కేసీఆర్ మొండిచేయి చూపించారు. చివరి నిమిషంలో టీఆర్ఎస్ విపక్షాల అభ్యర్థులకే మద్దతు ప్రకటించినా దానికి ముదు అభ్యర్థి ఖరారు కసరత్తుకు మమతా బెనర్జీ నేతృత్వంలో ఓసారి, శరద్ పవార్ నేతృత్వంలో మరోసారి జరిగిన సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, చంద్రబాబులకు ఆహ్వానం పంపించామని ఐఎన్ఎల్‌డీ నేత చెబుతుండగా ఈ కార్యక్రమానికి వీరిద్దరు హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తిని రేపుతోంది. ఒక వేళ హాజరైతే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే కోణంలో రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read : కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా జగన్ నిర్ణయం!


Advertisement

Next Story