AP Politics: టీడీపీ కంచుకోటల్లో బీజేపీ జెండాలు

by Indraja |   ( Updated:2024-06-06 07:10:10.0  )
AP Politics: టీడీపీ కంచుకోటల్లో బీజేపీ జెండాలు
X

దిశ ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటలుగా మారిన ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు, రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 ఏళ్ళుగా ఆ పార్టీ ప్రాభవం కోల్పోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్, వైసీపీలు అక్కడ పాగా వేశాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో 2004 నుంచి తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవుతూ వస్తోంది.

ఇలాంటి చోట ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు జెండాలు ఎగరేశారు. రిజర్వ్‌డు నియోజకవర్గమైన రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్ జనసేన అభ్యర్థిగా, జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డిలు విజయం సాధించారు.

1999 దాకా తెలుగుదేశం హవా..

దివంగత నందమూరి తారక రామారావు పార్టీ ఆవిర్భావమైన 1983 నుంచి 1999 దాకా తెలుగు దేశం హవా కొనసాగింది. అప్పటివరకు జమ్మలమడుగు, రైల్వే కోడూరులలో వరుస విజయాలను సాధిస్తూ వచ్చింది. 2004 ఎన్నికల్లో ఫలితాలు తిరగబడ్డాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఎంపికైన వైయస్ రాజశేఖర్ రెడ్డి జిల్లాలో తన ప్రాబల్యాన్ని చాటుకున్నారు.

ఆ ఎన్నికల్లో జమ్మలమడుగుతో పాటు రైల్వే కోడూరులో తెలుగు దేశం ఓటమిపాలైంది. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. 2009లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డే గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి గెలిచినా ఆయన కొద్ది కాలానికే టీడీపీలో చేరి మంత్రిగా పనిచేశారు.

2019లో టీడీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఫలితాలు వచ్చిన కొద్దిరోజులకే ఆయన బీజేపీలో చేరి ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించారు.

రైల్వే కోడూరు నియోజకవర్గంలో..

రైల్వే కోడూరు నియోజకవర్గంలో కూడా 1999 దాకా తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది.‌ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొరముట్ల శ్రీనివాసులు గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి గెలుపొందారు. వైఎస్ మరణానంతరం 2011లో జరిగిన ఉపఎన్నికల్లో కూడా విజయం సాధించిన కొరముట్ల శ్రీనివాసులు 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.

వరుసగా నాలుగు సార్లు సాధారణ ఎన్నికల్లోనూ, ఒక ఉప ఎన్నికల్లోనూ గెలిచిన శ్రీనివాసులు ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 1983 నుంచి 1999 వరకూ అటు జమ్మలమడుగు ఇటు రైల్వే కోడూరులలో వరుసగా టీడీపీ నేతలు గెలుపొందారు. 2004 నుంచి పరాజయాల పాలవుతూ వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఈసారి ఈ రెండు చోట్ల కూటమి అభ్యర్థులుగా బరిలో నిలిచిన బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్‌‌కు సహకారం అందించింది. కూటమిలో తెలుగుదేశం కంచుకోటలు బీజేపీ, జనసేనలకు దక్కడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story