మంత్రి ఇలాకాలో రోడెక్కిన మహిళలు.. పోలీసుల జులుం

by Shyam |   ( Updated:2021-09-23 11:29:33.0  )
Womens protest
X

దిశ, జల్‌పల్లి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత ఇలాకాలో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పది నెలలుగా పేరుకుపోయిన మురికినీటి సమస్యను పరిష్కరించాలని మంత్రి సొంత నియోజకవర్గమైన బోయపల్లి ఎన్‌క్లేవ్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. గత పది నెలలుగా మురికినీరుతో బతకలేక చస్తున్నా మంత్రి, మేయర్, కార్పొరేటర్‌లు ఎవరూ చలించడం లేదంటూ బడంగ్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ డివిజన్ అల్మాస్​గూడ బోయపల్లి ఎన్‌క్లేవ్ పెద్ద కమాన్ ఎదుట గురువారం రోడ్డుపై బైటాయించారు. మురుగునీటి సమస్య పరిష్కరించాలని గంటపాటు రాస్తారోకో నిర్వహించిన స్థానికులపై మీర్‌పేట్ పోలీసులు జూలుం ప్రదర్శించారు. శాంతి భద్రతలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ధర్నా విరమించాలని హెచ్చరించారని స్థానికులు వాపోతున్నారు.

దాదాపు 50 కుటుంబాలు ఈ మురికినీటి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వరదనీటి కారణంగా ఫ్లో పెరిగి బాత్ రూమ్స్, బోర్‌లలోకి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే కరోనా మహమ్మారి మూలంగా చస్తు బతుకుతుంటే, సీజనల్ వ్యాధులతో మరింత రోగాల బారినపడి నరకం చూస్తున్నామని వాపోయారు. భరించలేని దుర్వాసనతో సొంత ఇళ్లకు తాళాలు వేసి ప్రత్యమ్నాయంగా కొంతమంది మరోచోటుకి వెళ్లి ఉంటున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు ఒక్కసారి వచ్చి చూడండి మా బాధ తెలుస్తుందని వేడుకుంటున్నారు. ఈ ధర్నాలో జ్యోతి, గాయత్రి, సుమలత, సరిత, సాయికృష్ణ, రాజు, రాషీద్, గోపికృష్ణ, నరేందర్, జహంగీర్, రాజు, శ్రవణ్, ప్రవీణ్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed