మావోయిస్టుల భారీ యాక్షన్ ప్లాన్.. వేటాడుతున్న పోలీసులు..!

by Anukaran |   ( Updated:2021-02-28 13:10:09.0  )
మావోయిస్టుల భారీ యాక్షన్ ప్లాన్.. వేటాడుతున్న పోలీసులు..!
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఓ వైపు మాటువేసి ఉన్న మావోయిస్టులు.. మరో వైపు అణువణువూ అడవిని జల్లెడ పడుతున్న పోలీసులు.. వెరసి సరిహద్దుల్లో ఇరు వర్గాల ‘వేట’ వేడెక్కింది. ఛత్తీస్ గఢ్ అటవీ మార్గాన మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణలోకి ప్రవేశించారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే పోలీసులు కొత్త టెక్నాలజీతో ముందుకు పోతుంటే.. మావోయిస్టులు మాత్రం ‘పాత అస్త్రాలనే’ కొత్త వ్యూహంగా అమలు చేస్తున్నారు. మావోయిస్టుల జాడ కోసం, దట్టమైన అటవీ ప్రాంతాల్లో వారి కదలికలను తెలుసుకునేందకు పోలీసులు డ్రోన్ కెమెరాలను వాడుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది.

ఇక మావోయిస్టులు తమకున్న పరిమిత వనరులనే సరికొత్తగా ఉపయోగిస్తున్నారు. వెదురు బొంగులు, ఖాళీ బీరు బాటిళ్లతో పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవసరమైన చోట బూబీట్రాప్స్ ను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీస్థాయిలో బూబీట్రాప్స్ బయటపడడం పోలీసులను విస్మయానికి గురిచేయగా.. రెండ్రోజుల క్రితం కొత్తగూడెం అటవీ ప్రాంతంలో ఇద్దరు మిలీషియా సభ్యులు, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఏడుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయగా వారి వద్ద పేలుడు పదర్థాలతో పాటు వెదురు బొంగులు, ఖాళీ బీరుబాటిళ్లు, విల్లంబులు, డైరెక్షనల్ మైన్ ట్రిగ్గర్లకు సంబంధించిన సామగ్రితో పట్టబడడం విశేషం.

డ్రోన్ కెమెరాలకు చిక్కిన మావోయిస్టులు..

మావోయిస్టుల కదలికల కోసం పోలీసులు టెక్నాలజీలో భాగంగా డ్రోన్ వీడియో కెమెరాలను ఉపయోగిస్తున్నారు. దీంతో బలగాలు వెళ్లలేని ప్రాంతాల్లో కూడా కదలికలు తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నాలుగు నెలల క్రితం ఛత్తీస్ గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలడవి అటవీ ప్రాంతంలో డ్రోన్ కమెరాలకు మావోయిస్టుల కదలికలు చిక్కాయి. వందల సంఖ్యలో వాగుదాటుతూ కనిపించారు. వారంతా ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ వైపు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు పసిగట్టారు. ఇప్పటికే తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కొందరు అగ్రనేతలు మకాం వేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అందుకే కొన్ని నెలలుగా తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ పల్లెల్లో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ మొదలు పెట్టాయి. దీనిలో భాగంగా నక్సల్ కదలికలను తెలుసుకునేందకు అటవీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను కూడా విస్తృతంగా వాడుతున్నట్లు సమాచారం.

మావోయిస్టుల భారీ యాక్షన్ ప్లాన్

భద్రతా బలగాలను హతమార్చేందకు మావోయిస్టులు తమ పంథా మార్చినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం ఇద్దరు మిలీషియా సభ్యులను కొత్తగూడెం పోలీసులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి ఖాళీ బీరు బాటిళ్లు, వెదురు బొంగులు, జిలిటెన్ స్టిక్స్, వైర్లు తదితర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ అమర్చుతున్న ఏడుగురు నక్సల్స్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేయగా వారి వద్దకూడా ల్యాండ్ మైన్స్, వెదురు బొంగులతో కూడిన డెరెక్షనల్ మైన్ ట్రిగ్గర్స్, జిలిటిన్ స్టిక్స్, బాణాలు తదితర సామాగ్రి బయట పడ్డాయి. దీంతో మావోయిస్టులు తమ ఎత్తుగడలను మార్చినట్లు అర్థం అవుతోంది. వారికి ఉన్న అందుబాటులో ఉన్న వనరులతోనే భారీ విధ్వంసం సృష్టించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు రకాల పేలుడు పదార్థాలు తయారు చేసి వాటిని కూంబింగ్ దళాలే లక్ష్యంగా అమర్చేలా ప్లాన్ చేస్తున్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల బూబీ ట్రాప్స్ తో..

ఈనెల 14వ తేదీన భారీ స్థాయిలో బూబీట్రాప్స్ బయటపడడమే అందుకు నిదర్శనం.. పూసుగుప్ప (తెలంగాణ) రాంపురం (ఛత్తీస్‌గఢ్) గ్రామాల నడుమ గల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తు్న్న చర్ల పోలీసులు ఆ ప్రాంతంలో 78 చోట్ల పెద్దపెద్ద గోతులు తీసి అమర్చిన 100 బూబీట్రాప్స్ వెలికితీశారు. దీంతో బలగాలకు పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. మావోయిస్టు అగ్రనేతలు హరిభూషణ్, దామోదర్, ఆజాద్, శారదక్క ఆదేశం మేరకు రాంపురం, భీమారం, పూసుగుప్ప గ్రామాల మిలీషియా సభ్యులు, మావోయిస్డు దళ సభ్యులు కలిసి ఈ బూబీట్రాప్స్ అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మహా డేంజర్..

మావోయిస్టులు బూబీట్రాప్స్ అనే పాత విధానాన్నే మళ్లీ అమలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. పదునైన ఇనుప చువ్వలు, కత్తులతో చెక్కలకు ఏర్పాటు చేసిన వస్తువులే బూబీట్రాప్స్. గతంలో వీటిని ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో ఎక్కువగా ఉపయోగించేవారు. తమను వేటాడటానికి వచ్చే పోలీసుల కోసం వీటిని భూమిలో అమర్చుతారు. వీటికి చిక్కి పడిపోయిన తర్వాత లేవడం అంత సులభం కాదు. శత్రువులను మానసికంగా బలహీనపర్చి వారిపై మెరుపు వేగంతో దాడి చేయడం.. ఫలితంగా ఎక్కువ స్థాయిలో ప్రాణనష్టం ఉండే విధంగా చూడడమే బూబీ ట్రాప్స్ అమర్చేందుకు ప్రధాన ఉద్దేశం. వీటిని అటవీ ప్రాంతంలోని రెండు వైపులా రాళ్లు, రప్పలు, చెట్లు ఉండి మధ్యలో సన్నని దారి ఉన్న ప్రదేశంలో ఎక్కువగా అమర్చేందుకు వీలుంటుంది.

దీనివల్ల బలగాలు వాటిపై అడుగు వేయగానే అందులో చిక్కుకుని లేవడం కష్టంగా ఉంటుంది.. ఫలితంగా కంగారుకు లోనై భయం ఆవహిస్తుంది.. సరిగ్గా ఆ టైంలోనే మావోయిస్టులు దాడిచేసి హతమార్చేందుకు ఇలా వ్యూహరచన చేస్తుంటారు. వీటితోపాటు అక్కడక్కడా ల్యాండ్ మైన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. గతంలో ఇలా బూబీట్రాప్స్ ను ఉపయోగించి పోలీసులకు ఎక్కువగా ప్రాణనష్టం కల్గించిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఈ విధానాన్ని పాతకాలంలో మావోయిస్టులు ఎక్కువగా ఉపయోగించేవారని తెలుస్తోంది. మళ్లీ ఈ పద్ధతినే ఉపయోగించేందుకు సిద్ధపడడం.. భారీ స్థాయిలో దొరకడంతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించారా..?

ఛత్తీస్ గఢ్ నుంచి మావోయిస్టులు భారీ సంఖ్యలో తెలంగాణ వైపు వస్తున్నట్లు నాలుగు నెలల క్రితం డ్రోన్ కెమెరాకు చిక్కిన వీడియోలను బట్టి పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. వీరిలో అగ్రనేతలు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆధ్వర్యంలో మావోయిస్టుల బృందం భద్రాద్రి అటవీ ప్రాంతంలో తిరుగుతున్నట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మావోయిస్టుల చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సరిహద్దు అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ పల్లెల్లో కూంబింగ్ ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

విలువైన జీవితాన్ని కోల్పోవద్దని పోలీసుల హెచ్చరిక..

యువత మావోయిస్టులకు సహకరించడం కానీ, వారి వలలో చిక్కి వారికి అనుగుణంగా పనిచేయడం కానీ చేయవద్దని పోలీసులు కోరుతున్నారు. అలా చేస్తే విలువైన జీవితాన్ని కోల్పోవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొందరు మావోయిస్టులకు సహకరిస్తూ వారంతపు సంతలో వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసి అందిస్తున్నారని.. అలాంటి చర్యలు మానుకోవాలని చెపుతున్నారు. మావోయిస్టుల ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. కాగా.. పోలీసుల కూంబింగ్, మావోయిస్టుల చర్యలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సరిహద్దు ఏజెన్సీ గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed