స్పీకర్‌ vs సీఎల్పీ లీడర్

by Shyam |
స్పీకర్‌ vs సీఎల్పీ లీడర్
X

దిశ, న్యూస్ బ్యూరో :
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా స్పీకర్‌కు, కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. అన్ని పార్టీలకూ తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన స్పీకర్ అధికార పార్టీకే ఎక్కువ సమయం ఇస్తున్నారని భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యానికి అర్థం లేదని, అందువల్ల రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడానికి ప్రతిపక్షానికి తగిన అవకాశం, సమయాన్ని కేటాయించాలని వాదించారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఇచ్చిన సమయం అయిపోయినందున మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందకపోతే ఆ అంశానికి మాత్రమే పరిమితం కావాలని, రాజకీయ ఉపన్యాసం తరహాలో ప్రసంగాన్ని అనుమతించేది లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతవరణం చోటుచేసుకుంది.

బడ్జెట్ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ లేవనెత్తిన అంశాలపై మంత్రుల వివరణలో స్పష్టత కరువైందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. అలాంటి అంశాలను ప్రస్తావించడానికి కూడా స్పీకర్ అవకాశం ఇవ్వకపోతే ప్రజలు మమ్మల్ని అసెంబ్లీకి పంపించడంలో అర్థమే లేదన్నారు. అధికార, విపక్ష సభ్యులను ప్రజలే ఎన్నుకున్నారని, సభలో గొంతెత్తడానికి పార్టీల మధ్య తేడాలు ఉండవద్దన్నారు.

ప్రజా సమస్యలను, ప్రభుత్వ తప్పులను సభలో ప్రస్తావించడానికి సమయాన్ని కొలమానంగా పెట్టి ఆంక్షలు విధిస్తే వాస్తవాలు ప్రజలకు ఎలా తెలుస్తాయని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అసలు తప్పుపట్ట కూడదన్నట్టుగా సభ నిర్వహించడం సరికాదన్నారు. తాము ఏం మాట్లాడాలో కూడా అధికార పార్టీ సభ్యులే నిర్ణయిస్తారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు అధికారపార్టీ సభ్యులు తరచూ అడ్డుపడితే ఇక చెప్పాలనుకున్న విషయం ఎలా బయటకు వస్తుందన్నారు. ఇంతలోనే తమకు కేటాయించిన సమయం అయిపోయిందంటూ స్పీకర్ పదేపదే బెల్ కొట్టడం మంత్రులు హరీశ్‌, ఈటల వివరణ ఇవ్వడం కూడా వెనువెంటనే జరిగిపోయింది.ఈ పరిణామాలతో సీఎల్పీనేత కొంత అసెంబ్లీ వేదికగా కొంత అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది.

Tags: Telangana, Assembly, Congress, Speaker and Mallu Bhatti fires eachother, Arguments

Advertisement

Next Story

Most Viewed