మా కామెంట్రీని పట్టించుకోకండి : మంజ్రేకర్

by Shiva |
మా కామెంట్రీని పట్టించుకోకండి : మంజ్రేకర్
X

దిశ, స్పోర్ట్స్: ఆట ఆడే సమయంలో తాము చెప్పే కామెంట్రీలో తప్పుఒప్పులను వెతికి మనసులు గాయపరుచుకోవద్దని.. తమ వ్యాఖ్యానాన్ని కేవలం ఒక అలంకారంగా మాత్రమే చూడాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఇటీవల కాలం వరకు క్రికెట్ వ్యాఖ్యాతగా ఉన్న సంజయ్‌ను బీసీసీఐ తమ కామెంటేటర్ల ప్యానల్స్ లిస్టులో నుంచి తొలగించింది. గత ఏడాది క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో రవీంద్ర జడేజాను ‘బిట్స్ అండ్ పీసెస్’ అని తూలనాడటం.. ఆ తర్వాత సహచర కామెంటేటర్ హర్ష భోగ్లేతో వివాదం కారణంగా అతడిని బీసీసీఐ తప్పించింది. అయితే తాజాగా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌తో లైవ్ చాట్ చేసిన మంజ్రేకర్ పలు విషయాలను పంచుకున్నాడు. కామెంట్రీ చెప్పే సమయంలో ఆటగాళ్ల మనసులను గాయపరచకుండా వ్యాఖ్యానించడం దాదాపు అసాధ్యమని అన్నాడు. ఆటగాళ్ల బలహీనతలు, తప్పులు బయటకు చెప్పడం తప్పదన్నాడు. అయినా ఆటగాళ్లు మా కామెంట్రీకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని.. మా మాటలు కేవలం అలంకారమేనని మంజ్రేకర్ చెప్పాడు. ఏ వ్యాఖ్యాత మాటలనైనా తేలికగా తీసుకొని క్రికెటర్లు తమ పనిని తాము చేసుకుంటూ వెళ్తే పెద్ద ఇబ్బంది ఉండదని సలహా ఇచ్చాడు. తాను క్రికెట్ ఆడే కాలంలో దిలీప్ వెంగ్‌సర్కార్ ఒక కాలమ్‌ రాస్తూ.. తన ఆట తీరును విమర్శించాడు. అప్పుడు తాను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆటగాళ్లు సున్నిత మనస్కులు.. విమర్శలను ఎక్కువగా తట్టుకోలేరు అన్నాడు. అయితే ఆ తర్వాత అతని పరిశీలనలను అన్నింటినీ ఎదుర్కోడానికి ప్రయత్నించి ఆటను మెరుగుపరుచుకున్నానన్నాడు. కాబట్టి ఎవరైనా విమర్శిస్తే అందులోని మంచిని మాత్రమే తీసుకోమని సలహా ఇచ్చాడు. అయినా నేను విమర్శించినంత మాత్రాన బీసీసీఐ జట్టులో నుంచి తీసేసిన సందర్భాలు ఉన్నాయా అని మంజ్రేకర్ ప్రశ్నించాడు.

Advertisement

Next Story

Most Viewed