ప్లాస్టిక్‌ సిటీ.. పబ్లిసిటీ పిటీ

by Shyam |
ప్లాస్టిక్‌ సిటీ.. పబ్లిసిటీ పిటీ
X

గ్రేటర్‌ హైదరాబాద్‌ను ‘జీరో ప్లాస్టిక్‌ సిటీ’గా మారుస్తామన్న జీహెచ్‌ఎంసీ పాలక మండలి, అధికారుల మాటల నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. బల్దియా పరిధిలో ప్టాస్టిక్‌ నిషేధానికి చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్‌లు ఏడాదికోసారి అన్నట్టుగా మారిపోయింది. బల్దియా కార్యాలయాల్లో యథేచ్ఛగా ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతూనే ఉంది. ఇంకా నగరమంతా నిషేధాన్ని అమలు చేయగలుగుతారని విమర్శలు వస్తున్నాయి.
చిత్తశుద్ధిలేని కార్యాచరణగా మారిపోయింది. 50 మైక్రాన్లకన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్ల వినియోగం లేని నగరాన్ని తీర్చిదిద్దే దిశగా బల్దియా ఏడాదికోసారి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీ అండ్ డీ వ్యర్థాలు, డెబ్రిస్ పారబోతలను పూర్తిగా నివారించిన తర్వాత ప్లాస్టిక్ వినియోగంపై దృష్టి కేంద్రీకరించాలని గతేడాది ప్రణాళికలు చేసింది. వినియోగంతోపాటు విక్రయిస్తున్నవారిపైనా భారీగా జరిమానాలు విధించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేసింది. మార్కెట్లు, వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించి కొంత వరకూ మార్పును తేగలిగారు. తర్వాత ఏం జరిగిందో ఏమో మళ్లీ ప్లాస్టిక్‌ వినియోగం ఊపందుకుంది. ఎంతలా అంటే స్వయానా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్లాస్టిక్‌ బాటిళ్లు, గ్లాసులు, బ్యానర్లు ఏర్పాటు చేసే వరకూ పరిస్థితి వచ్చింది.

అమలుకు నోచుకోని సుప్రీం ఆదేశాలు

ప్లాస్టిక్‌పై కేంద్రప్రభుత్వం 2012లో నిషేధం విధించగా సుప్రీంకోర్టు కూడా ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. ప్లాస్టిక్‌తో అనర్థాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర 25 ప్రధాన నగరాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు. మన నగరంలో కూడా ఐదేండ్ల కిందటే 50 మైక్రాన్లకన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్‌ను నిషేధించాలన్న నిర్ణయం జరిగింది. అయితే అమలు మాత్రం కాగితాలకే పరిమితమైంది. నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయం అక్కడకే పరిమితమైంది. తయారీ కేంద్రం నుంచి వినియోగదారుల వరకూ పూర్తిస్థాయిలో పకడ్బందీగా నిషేధాజ్ఞలు అమలు చేయాలని బల్దియా అధికారులు భావించారు.

నగరంలోని నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలు అడ్డంకిగా మారుతున్న తీవ్రత అధికారులకు తెలియందేమీ కాదు. చాలాప్రాంతాల్లో రోడ్లపై మురుగునీరు ప్రవహించడంతోపాటు డ్రైనేజీల్లో పూర్తిగా ప్రవాహం లేక నిలిచిపోతోంది. భూమిలో కలిసిపోకపోవడంతో జంతువులు తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు ప్రకృతిపరంగా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ప్రతీ ఏడాది ప్రత్యేకంగా స్పెషల్‌ ఫోకస్‌ చేసే సమయంలోనే కాకుండా రెగ్యులర్‌గా ప్లాస్టిక్‌ నిషేధానికి అవసరమైన తనిఖీలు, చర్యలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు వచ్చేవి. కానీ, ప్రభుత్వ సిబ్బందిలో ఆ చిత్తశుద్ధి కరువైంది. ఇక స్వీయ నియంత్రణ ఉండాల్సిన ప్రజల్లోనూ బాధ్యత కొరవడింది.

డెబ్రిస్‌ సేకరణకు ఏడాది

డెబ్రిస్‌ను ఎక్కడపడితే అక్కడ వేయకుండా రీసైక్లింగ్ చేయడం ద్వారా పునర్వినియోగంలోకి తేవాలని సుమారు రెండేండ్ల క్రితం బల్దియా అధికారులు ప్రతిపాదించారు. డెబ్రిస్‌ కోసం జీడిమెట్ల, ఫతుల్లగూడల్లో ప్రత్యేకంగా రెండు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇటీవలనే వీటిని అందుబాటులోకి తెచ్చారు. డెబ్రిస్‌ రీసైక్లింగ్‌ క్రమపద్ధతిలో నిర్వాహణ పూర్తయ్యాక ప్లాస్టిక్‌ నిషేధంపై పూర్తిస్థాయిలో కేంద్రీకరించాలని బల్దియా భావించింది. దేశంలోనే ఆదర్శంగా మన నగరాన్ని పూర్తిగా జీరో ప్లాస్టిక్ సిటీగా తీర్చిదిద్దాలని భావించారు. ప్లాస్టిక్‌ నిషేధంలో భాగంగా 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్‌ను వినియోగించేవారికి రూ.500 జరిమానా విధించాలని నిర్ణయించారు. విక్రయించేవారికి మొదటిసారి రూ. 10 వేలు, రెండోసారి రూ. 25 వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. మూడోసారికి దుకాణాన్ని సీజ్ చేయాలని నిర్దేశించుకున్నారు. సర్కిళ్లవారీగా స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించారు.

బల్దియాలోనే ప్లాస్టిక్‌ వినియోగం

బల్దియా ఆధ్వర్యంలో రోజూ చెత్త సేకరణ జరుగుతోంది. నగరంలో ప్రతీ రోజూ సుమారు 500 టన్నుల మేరకు ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు సంబంధించినవి కూడా 60 శాతానికి తగ్గకుండా ఉన్నట్టు అంచనా. బల్దియా కార్యాలయాల్లో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం యథావిధిగానే నడుస్తోంది. ప్రధాన కార్యాలయంలోనే ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అక్కడే ఉన్న క్యాంటీన్లు, ఇతర ఆఫీసుల్లో ప్లాస్టిక్‌ గ్లాసులు, బాటిళ్లు వాడుతున్నారు. సొంత కార్యాలయంలోనే ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిరోధించలేని బల్దియా నగరమంతా ఎలా చేస్తుందని పర్యావరణ వేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ వస్త్ర దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు యథేచ్చగా ప్లాస్టిక్‌ నిబంధనలు పాటించకున్నా ఆయా జోనల్‌, సర్కిల్‌ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed