సకలం బంద్.. స్వచ్ఛంద కట్టడి దిశగా ప్రజలు

by Shyam |   ( Updated:2020-06-27 22:40:37.0  )
సకలం బంద్.. స్వచ్ఛంద కట్టడి దిశగా ప్రజలు
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు వెయ్యి దాకా నమోదవుతున్నాయి. సచివాలయం మొదలు ఎమ్మార్వో ఆఫీసు వరకు ప్రభుత్వ సిబ్బంది కొవిడ్ బారిన పడుతున్నారు. కొందరి ప్రాణాలు పోతున్నాయి. ఆఫీసులు మూతపడుతున్నాయి. ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులకు కూడా వైరస్ బాధలు తప్పడం లేదు. ఆఫీసులకు 50% మంది మాత్రమే హాజరవుతున్నారు. దీంతో అంతటా ఆందోళన మొదలయ్యింది. దాంతోపాటే అప్రమత్తత కూడా పెరిగింది. ప్రభుత్వ నిర్బంధ లాక్‌డౌన్‌ను నిర్లక్ష్యం చేసిన ప్రజలు ఇప్పుడు స్వచ్ఛందంగానే ‘కట్టడి’ విధించుకుంటున్నారు. వ్యాపారులు దుకాణాలు మూసుకుంటున్నారు. మసీదులు, ఆలయాల్లో స్వీయ నియంత్రణ మొదలైంది. కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంక్షలను సడలించడంతోనే పరిస్థితి తీవ్రమైందని జనం మండిపడుతున్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసు, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం, అమీర్‌పేట ఎమ్మార్వో కార్యాలయం, సచివాలయంలోని పలు శాఖలకు చెందిన కార్యాలయాలలో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.

తెరిస్తే కఠిన చర్యలు

నగరంలోని బేగంబజార్, ఫీల్‌ఖానా, ఉస్మాన్‌గంజ్, సిద్ధి అంబర్ బజార్, సికింద్రాబాద్ జనరల్ బజార్, హోల్‌సేల్ కిరాణా, జువెల్లరీలాంటి దుకాణాలను జూలై ఐదు వరకు తెరవబోమని యజమానులు ప్రకటించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద ఎలక్ట్రికల్​ మార్కెట్ ఏరియా రాణిగంజ్​ దుకాణాలు కూడా మూతపడనున్నాయి. విద్యుత్​, వ్యవసాయ, గృహోపరకరణాలకు సంబంధించి ఎక్కువ వ్యాపారం జరిగే రాణిగంజ్​ దుకాణ అసోసియేషన్​ కూడా ఆదివారం నుంచి లాక్ డౌన్ పాటిస్తున్నట్టు ప్రకటించింది. సెలూన్లను కూడా మూసి ఉంచుతున్నారు. హోల్‌సేల్ వ్యాపారం వారం రోజుల పాటు బంద్ అవుతుండడంతో దాని ప్రభావం చిల్లర దుకాణాలపై పడుతోంది. చివరకు ప్రజలకు నిత్యావసరాల కొరత ఏర్పడనుంది. స్వచ్ఛందంగా విధించుకున్న లాక్‌డౌన్ కావడంతో పకడ్బందీగా అమలు చేయనున్నట్లు వ్యాపార సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. నిర్ణయానికి వ్యతిరేకంగా దుకాణాలు తెరిచినట్లయితే సంఘపరమైన చర్యలు తప్పవని ప్రతినిధులు హెచ్చరించారు.

పది రోజుల క్రితమే

కరోనా కేసులు పెరుగుతుండడంతో మరోసారి లాక్‌డౌన్ విధించడం ఉత్తమమని ప్రజలు పది రోజుల క్రితమే అభిప్రాయపడ్డారు. తప్పనిసరి అవసరాలకు మాత్రమే రోడ్డెక్కుతూ, వీలైనంతవరకు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎక్కడికక్కడ స్వచ్ఛంద లాక్‌డౌన్ అమలవుతోంది. కరోనా సోకిన తర్వాత ప్రభుత్వాసుపత్రుల్లో లభిస్తున్న వైద్యసేవలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడే బిల్లు లాంటివన్నింటినీ ప్రజలు అంచనా వేసుకుంటున్నారు. వైరస్ వచ్చిన తర్వాత పడే బాధలకంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని భావిస్తున్నారు. చేతులు కాలకముందే జాగ్రత్తపడాలనుకుంటున్నారు. అందుకే దుకాణాలు, షాపింగ్ మాల్స్ తెరిచినా వాటివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మద్యం దుకాణాలకు కూడా వ్యాపారం తగ్గిపోయింది. గతంలో ముఖ్యమంత్రి చెప్పిన ‘ బతికుంటే బలుసాకు తినొచ్చు’ అనే నానుడిని ప్రజలు అక్షరాలా పాటిస్తున్నారు. ఇంతకాలం ప్రభుత్వం సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజేషన్ లాంటి జాగ్రత్తలను చెప్పింది. ఇటీవల అనేక ప్రభుత్వ కార్యకలాపాల్లో వీటికి తిలోదకాలు ఇచ్చిన సంఘటనలను ప్రజలు కళ్లారా చూశారు. అందుకే పలువురు ఎమ్మెల్యేలకు, అధికారులకు వైరస్ సోకిందన్న వాస్తవాన్ని గ్రహించారు. రోజువారీ పుట్టుకొస్తున్న కేసుల్ని చూసి జరగబోయే ఉపద్రవాన్ని అంచనా వేసుకున్నారు. ప్రభుత్వం చేతులెత్తేసిందన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రజల చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు.

అదుపు తప్పుతోందని

వర్క్ ఫ్రం హోమ్ అమలవుతుండడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. క్యాబ్‌ డ్రైవర్లు కొంత మంది సొంతూళ్లకు వెళ్ళిపోయారు. మరికొంతమంది ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకున్నారు. ప్రభుత్వాఫీసులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. సీఎంఓ కార్యాలయంతో మొదలైన ఈ ప్రక్రియ సచివాలయం, కలెక్టర్ ఆఫీసు, ఎమ్మార్వో ఆఫీసు, పోలీసు స్టేషన్ల దాకా వచ్చింది. హైకోర్టు సైతం జూలై 15 వరకు అత్యవసర కేసులు మాత్రమే చూస్తామని స్పష్టం చేసింది. పిటిషన్లు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలని పేర్కొంది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూలై 31 దాకా పొడిగించింది. రైళ్ళు ఆగస్టు వరకు, విమానాలు జూలై 15 వరకు, విద్యా సంస్థలు జూలై చివరి వరకు మూసివేయక తప్పలేదు. కర్నాటక ప్రభుత్వం ప్రతీ ఆదివారం లాక్‌డౌన్, ప్రతీ శనివారం సెలవు ప్రకటించింది. తెలంగాణలోని పల్లెల్లో దండోరా వేసి వైరస్ వస్తే వెంటనే క్వారంటైన్, హోమ్ ఐసొలేషన్ జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు. ‘ప్రజలు సహకరించాలని రెండు చేతులెత్తి మొక్కుతున్నా’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ప్రజలు ఇప్పుడు గుర్తుచేసుకుని తమను చూసైనా ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుని వైరస్‌ను కట్టడి చేయాలని కోరుకుంటున్నారు.

అంచనాలకు మించి కేసులు

గత పది రోజులుగా అంచనాలను మించి కరోనా పాజిటివ్ కేసుల వస్తున్నాయి. మూడు రోజులుగా వెయ్యికి చేరువలో నమోదవుతున్నాయి. ఇందులో ఎక్కువ భాగం జీహెచ్​ఎంసీ పరిధిలోని జిల్లాలోనివే. హైదరాబాద్​తోపాటు గ్రామాల్లో కూడా కరోనా కేసులు బయటపడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రభుత్వం కరోనా టెస్టులు ఆపివేయడం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రామాలు, అర్బన్​ ఏరియాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్​, నల్లగొండ, కరీంనగర్​, ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి లాక్ డౌన్ ను ప్రజలు అమలు చేస్తున్నారు. కొత్తగా గ్రామాల్లోకి వచ్చినవారిని ప్రభుత్వ అధికారులకంటే ఎక్కువగా గ్రామ ప్రజలే ఎక్కువగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. అనేక కారణాలతో ప్రభుత్వం మళ్లీ లాక్​డౌన్ విధించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రజలు పాటిస్తున్న ఈ లాక్​డౌన్​ ఎలాంటి ఫలితాలు ఇవ్వనుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed