- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హామీలిచ్చి మరచిన TRS ఎమ్మెల్యే.. అభివృద్ధి ఏదంటూ ప్రజల ఆగ్రహం
దిశ, వర్ధన్నపేట : వర్ధన్నపేట నియోజవకర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరూరి రమేష్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగులుస్తున్నాడన్న విమర్శలు ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి. 2014, 2019 ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో అభివృద్ధిపై పదుల సంఖ్యలో హామీలిచ్చిన ఆరూరి అత్తెసురుగా కూడా అమలు చేయలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన అరూరి రమేష్ ఈ ప్రాంత ప్రజలకు అనేక హామీలిచ్చారు. నియోజకవర్గంలో చెక్ డ్యాం నిర్మాణం, వర్ధన్నపేటలోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయడం, ఐనవోలు, పర్వతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతానని హామీలిచ్చారు. కానీ, ఇప్పటి వరకు నెరవేరలేదు. దీంతో నిరుపేద కుటుంబాలకు స్థానికంగా సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఆస్తులు అమ్మి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
కానరాని పట్టణాభివృద్ధి..
వర్ధన్నపేట పంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న విమర్శలున్నాయి. వరంగల్- ఖమ్మం హైవేపై ఉన్న వర్ధన్నపేట అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయి. వాస్తవానికి వరంగల్‌కు అత్యంత సమీపంలో ఉన్న నియోజకవర్గం మాత్రమే కాకుండా అనేక వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన ఐదారేళ్లలో వర్ధన్నపేట పట్టణ జనాభా కూడా పెరగడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు లేవు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడటంతో తరచూ ప్రమాదాలకు గురవుతూ వాహనదారులు ప్రాణాలు కోల్పుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెక్ డ్యాంలేవీ..?
ఆకేరు వాగుపై చెక్ డ్యాములు నిర్మించి రైతుల కాళ్లు కడుగుతానని చెప్పిన ఎమ్మెల్యే ఆ మాటే విస్మరించినట్టు ఉన్నారన్న విమర్శలు రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి. 2019 సంవత్సరంలో రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత ఉప్పుగల్ ఫేస్-2లో జరుగుతున్న రిజర్వాయర్‌ను త్వరగా పూర్తి చేసి ఎనిమిది నెలల్లో ఆకేరు వాగు పక్కన ఉన్న రైతుల పొలాలకు నీళ్ళు తీసుకువస్తానని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికై మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని గుర్తు చేస్తున్నారు. అలాగే వరదలు వచ్చి కోనారెడ్డి చెరువుకు గండి పడి వందల ఎకరాల్లో పంట నష్టపోయినా ఇంత వరకూ నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. తెగిన చెరువుకు పడిన గండిని పూర్తి స్థాయిలో బాగు చేయకపోవడంతో నీరు వృధాగా పోతోందని రైతులు చెబుతున్నారు.
డిగ్రీ కళాశాల భవనానికి దిక్కులేదు..!
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రక్కన కొత్త భవనాన్ని నిర్మిస్తానని చెప్పి సంవత్సరాలు గడిచినా అటు వైపు కన్నెత్తి కూడా చూడటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిగ్రీ చదవడానికి పేదవారికి ఉచితంగా విద్య అందించడం, సరైన భవన వసతులు లేకపోవడంతో చుట్టుప్రక్కల గ్రామాల పేద విద్యార్థులు ప్రైవేటు కళాశాలలో ఫీజులు చెల్లించి చదువుకుంటున్నారు. ఉచిత విద్య, వైద్యం కోసం పేదవారికి సరైన సౌకర్యాలు అందించని ఎమ్మెల్యే ప్రజలకు ఏం మంచి చేస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.
పెరుగుతున్న ప్రజాగ్రహం..
నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఊసే లేకపోవడంతో పేద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇండ్లు వస్తాయని పేదవారు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా నియోజకవర్గం పరిధిలో ఎక్కడ కూడా మొదలు పెట్టనేలేదు. దీంతో ఎమ్మెల్యే మళ్లీ మమ్మల్ని ఓట్లు ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడో చుస్తామంటూ కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు బాహాటంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నా.. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ కేంద్రం నిర్లక్ష్యానికి గురవుతోంది. దీంతో వర్ధన్నపేట అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తారో లేదో వేచి చూడాలి.