ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు

by Shyam |
ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరద ముంపు ప్రాంతాల ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారు. నగరంలో అనేక ప్రాంతాలు నీటిలో మునిగాయి. మొత్తం ఫిర్యాదుల్లో 70% మంది దురదతో కూడిన ఫంగల్ ఇన్ఫెక్షన్లతో, 10% మంది జ్వరం, ఒంటి నొప్పులతో, 20% మంది నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నట్లుగా ఇంటింటికి స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. ఈ సర్వేను హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సంస్థ నిర్వహించింది. అనేక ప్రాంతాలలో నీరు తగ్గింది.. కానీ వీధులలో చెత్త, బురద నిండిపోయి ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చి వైద్య సేవలు అందుకునేందుకు వీలు లేకుండా ఉన్నది. స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో చాలా ప్రాంతాలలో ప్రజలు మందులను డోర్ డెలివరీ చేయాలని కోరుకుంటున్నట్లుగా వెల్లడయ్యింది.

ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు నగరంలో వరద ప్రాంతాలలో అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు, పెద్దల కోసం ఫివర్ కిట్లు, మందులను తీసుకుని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తున్నారు. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత వైద్యుడితో ఆన్లైన్ సంప్రదించి అక్కడికక్కడే వైద్యం అంచనా వేస్తున్నారు. తర్వాత వారికి అవసరమైన మందులను వారి ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఫలక్ నుమా డివిజన్ పరిధిలోని హషామాబాద్, ఫారూఖ్ నగర్, ఫాతిమానగర్ ప్రాంతాలకు చెందిన 150కి పైగా ఇళ్లకు సహాయక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

లక్షణాలున్న వారికి కొవిడ్ టెస్టులు..

కొవిడ్ లక్షణాలున్న రోగులను కూడా పర్యవేక్షించి వారికి టెస్టింగ్ చేసి అవసరమైన మందులను వారికి సిఫార్సు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. స్వచ్ఛంద సంస్థ ఈ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కూడిన బృందం ఇంటింటికీ వెళుతుండగా, మరొక బృందం బురద మరియు చెత్తను తొలగిస్తూ క్రిమిసంహారక బ్లీచింగ్ పౌడర్ను చల్లడంలో సహాయ పడుతున్నది. ఇక్కడి ప్రజలు తమ సర్వస్వం కోల్పోయారు.

కేవలం కట్టుబట్టలతోనే మిగిలారని, మందులకు, వైద్య చికిత్సకు వారి వద్ద డబ్బులేదని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సభ్యుడు ముజ్తబా హసన్ అక్సారీ అన్నారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వరద ప్రభావిత ప్రాంతాలైన బాబానగర్, ఆమానగర్, గంగానగర్, తలాబ్కట్ట, జుబైల్ కానీ, హషామాబాద్, ఫాతిమా నగర్, ఫారూఖ్ నగర్ వంటి నగర మురికివాడల్లో 12 అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచిందన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలకు హెల్ప్ లైన్ నెంబర్లు 8790679505, 789319193 సంప్రదించాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed