TRS ఎమ్మెల్యేలు సచ్చేదాక అవి సక్కగా రావు : రేవంత్ రెడ్డి

by Anukaran |
PCC-Chief-Revanth-Reddy,-CM
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కంటే డేంజర్ అని టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డి ఘాటూ వ్యాఖ్యలు చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్​వచ్చిందని, కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు రావాలని, ఎన్నికలే సర్వరోగ నివారిని అని అన్నారు. టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​అంజన్​కుమార్​యాదవ్​ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కాంగ్రెస్​పార్టీ అధ్యక్షులతో బుధవారం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు ఏ సమయంలోనైనా వస్తాయని, కేసీఆర్​ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదని, ఏ రాత్రి ఎన్నికలకు వెళ్దామంటాడో తెలియదని, ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని, అందుకే కాంగ్రెస్​పార్టీ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్‌కు దుర్బుద్ధి పుట్టి ప్రభుత్వాన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. గతంలో అనేకసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ప్రజల కోసం మరోసారి ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు రావాలని, భస్మాసుర హస్తం కేసీఆర్ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజలకు మేలు జరగాలంటే .. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ప్రభుత్వాన్నీ రద్దు చేసుకోమని చెప్పాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల కష్టాలను చూసి తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని, కానీ మరోరకమైన లబ్ధి జరిగి కేసీఆర్ కుటుంబంతో పాటు ఇతర రావులకు మేలు జరుగుతోందన్నారు. తెలంగాణ తల్లి కేసీఆర్​బిడ్డ పోలికలున్న బొమ్మ కాదని, సోనియాగాంధీ తెలంగాణ తల్లి అన్నారు.

ఆర్థిక ఉగ్రవాదులు

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ ఆర్థిక ఉగ్రవాదులని రేవంత్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్నారని, కమీషన్లు లేకుంటే సంతకాలు చేయడం లేదన్నారు. తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరుల స్థూపాన్ని కూడా వదల్లేదని, దాంట్లో కూడా కోట్ల రూపాయల దోపిడీ చేశారని, త్వరలోనే ఆధారాలతో బయటపెడుతానని రేవంత్​రెడ్డి వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్​ ఇద్దరూ ఆర్థిక ఉగ్రవాదులంటూ వ్యాఖ్యానించారు. వచ్చే రెండేండ్లు కాంగ్రెస్​నేతలు, శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, రావణాసురున్ని ఎదుర్కొనేందుకు వానర సైన్యం ఎలా పని చేసిందో కేసీఆర్‌ను దింపాలంటే కాంగ్రెస్ సైన్యం అదే తరహాలో పని చేయాలని రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చస్తేనే పథకాలు అమలు

రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై రేవంత్​రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చస్తేనే పథకాలు సక్కగా అమలవుతున్నాయని, అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని అందుకే పథకాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మంగళి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, గొల్ల, కురుమ, గౌడ్​ ఇలా అన్ని వర్గాలనుమోసం చేశాడని, బీసీల కోసం బడ్జెట్‌లో మూడు శాతమే నిధులు కేటాయిస్తున్నారన్నారు. బీసీ కార్పొరేషన్లలో లోన్లు కూడా వస్తలేవని, గతంలో దుబ్బాక, నాగార్జున సాగర్, ఇప్పుడు హుజురాబాద్‌లో మాత్రమే పథకాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్​ తొలి ప్రణాళిక నిరుద్యోగ సమస్యలపైనే ఉంటుందని, ఉన్నత చదువులు చదివిన యువత చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సోనియా మనిషిని

తాను సోనియాగాంధీ మనిషినని, కాంగ్రెస్ పార్టీ బిడ్డనని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనకు తక్కువ సమయంలో అత్యంత గౌరవమైన బాధ్యత ఇచ్చారని, రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. అంజన్​కుమార్​చాలా ఏండ్ల నుంచి తెలుసని, తనకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్లు కాంగ్రెస్​పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేస్తున్నారని, అందరిలో ఉత్సాహం పెంచేందుకు తనను పీసీసీ చీఫ్‌గా నియమించారని, అందరి అభిప్రాయాలతో ముందుకు వెళ్తామని రేవంత్​రెడ్డి అన్నారు.

Advertisement

Next Story

Most Viewed