నేను తగ్గాను.. మీరు కూడా తగ్గండి: పవన్

by srinivas |
Pawan Kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కులాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హుకుంపేటలోని బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కులాల ప్రస్తావనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులు రాజకీయంగా ముందుండాలంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు గతంలో ఓ గొప్ప వ్యక్తిని కాపాడుకోలేకపోయామంటూ దివంగత నేత వంగవీటి రంగా గురించి ప్రస్తావించారు. అలాగే 2009లో ఒక పెద్దాయన రాజకీయాల్లోకి వస్తే ఆయన్ను పలుచన చేశారంటూ చిరంజీవి రాజకీయ ఆరంగేట్రం గురించి చెప్పుకొచ్చారు. 2014 ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ప్రభుత్వం అణచివేస్తే అడ్డుకోలేకపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకు వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదంటూ పవన్ వ్యాఖ్యానించారు. కుల పెద్దలు, నాయకులు ఎక్కడ తప్పులు జరిగాయి….? ఎవరి చేతిలో మోసపోయాం..? అనేదానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మీరు ముందుకు వస్తే తప్ప శెట్టిబలిజలు, కొప్పుల వెలమ, తూర్పుకాపులు, దళితులు, మైనార్టీలు ముందుకురారని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అదే సందర్భంలో అన్ని కులాలను గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు. జనసేన కమ్మసామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని చెప్పేందుకే టీడీపీకి మద్దతిచ్చినట్లు పవన్ స్పష్టం చేశారు. కాపులు ఏడు దశాబ్ధాలుగా అణచివేతను అనుభవిస్తున్నారని గుర్తుచేశారు. ‘నేను తగ్గాను.. మీరు కూడా తగ్గి ఎలా ఎదగాలో ఆలోచించుకొని ముందుకెళ్లాలి..సమాజంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలంటూ‘ పవన్ కల్యాణ్ క్లాస్ పీకారు. అలాగే అన్ని కులాలు, మతాలకు మాటిస్తున్నానని.. తుదిశ్వాస వరకు రాజకీయాలను వదిలే ప్రసక్తి లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed