పీవీ, ట్రాక్టర్లు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి : ఎఫ్ఏడీఏ!

by Harish |
పీవీ, ట్రాక్టర్లు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి : ఎఫ్ఏడీఏ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటో మొబైల్ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పండుగ సీజన్‌లో దేశీయంగా ప్యాసింజర్ వాహన(పీవీ) విభాగం మెరుగైన విక్రయాలను నమోదు చేసింది. 42 రోజుల పండుగ సీజన్‌లో రిటైల్ అమ్మకాల్లో 13.6 శాతం వృద్ధిని సాధించింది. అయితే, వాల్యూమ్ పరంగా పరిశ్రమలో అతిపెద్ద విభాగమైన టూ-వీలర్ వాహన అమ్మకాలు ఆశ్చర్యకరంగా 6.3 శాతం క్షీణత నమోదు చేయడం షాక్‌ను కలిగించే విషయం. పండుగ సమయంలో ట్రాక్టర్లు, ప్యాసింజర్ వాహన విభాగాలు మాత్రమే పూర్తిస్థాయిలో వృద్ధిని సాధించాయి.

అక్టోబర్ ప్రారంభం నుంచి నవంబర్ మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 73,003 ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 48.7 శాతం వృద్ధి. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 4,31,597 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇతర విభాగాల్లో ఆశించిన స్థాయిలో నమోదుకాలేదు. టూ-వీలర్ విభాగంలో కంపెనీలు పండుగ డిమాండ్‌ను అధికంగా అంచనా వేసి రికార్డు స్థాయిలో స్టాక్ డీలర్లకు చేర వేసింది. అయితే, అంచనాలను తలకిందులు చేస్తూ విక్రయాలు క్షీణించాయని ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య(ఎఫ్ఏడీఏ) వెల్లడించింది.

ప్రస్తుత ఏడాది పండుగ సీజన్‌లో టూ-వీలర్ అమ్మకాలు 6.31 శాతం తగ్గిపోయాయి. త్రీ-వీలర్ వాహన అమ్మకాలు 60.3 శాతం క్షీణించాయి. కమర్షియల్ వాహనాలు 22.3 శాతం పడిపోయాయి. కేవలం ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాల్లో పెరుగుదల ఉన్నప్పటికీ మొత్తం పరిశ్రమ అమ్మకాలు 4.74 శాతం పడిపోయాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. ‘ప్రస్తుతం పండుగ సీజన్ ముగిసింది. దేశీయంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయాయి. ఈ ఏడాది ముగింపు సందర్భంగా అందించే ఆఫర్లపైనే డిమాండ్ ఆధారపడి ఉంటుంది. ప్యాసింజర్ వాహనాల విభాగంలో సరఫరా సమస్యలను అధిగమిస్తే డిసెంబర్‌లోనూ నిరంతర వృద్ధిని చూడగలం’ అని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేష్ గులాటీ తెలిపారు.

Advertisement

Next Story