- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల రోజుల లాక్‌డౌన్.. సక్సెస్సా.. ఫెయిల్యూరా?
దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయానికి నేటికి సరిగ్గా నెల రోజులు. లాక్‌డౌన్ ప్రకటించే నాటికి దేశం మొత్తం మీద 564 కేసులు ఉండేవి. ఈ నెల రోజుల వ్యవధిలో అది 21 వేలకు పెరిగిపోయింది. తెలంగాణలో 39 కేసుల నుంచి వెయ్యికి చేరువైంది. కేరళలో అదుపులోకి వచ్చినా మహారాష్ట్రలో మాత్రం అనూహ్యంగా కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ డిజిట్‌లో ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు వెయ్యికి దగ్గరవుతోంది. వ్యాప్తి విషయానికి వస్తే, 75 జిల్లాల నుంచి 430 జిల్లాలకు పాకింది. దేశవ్యాప్తంగా సుమారు 650 మందికి పైగా కరోనా కారణంగా చనిపోయారు. లాక్‌డౌన్ నిర్ణయంతో ప్రజలను ఇళ్ళకే పరిమితం చేసినా వైరస్ వ్యాప్తి వేగంగానే జరిగింది. ముఖ్యంగా మర్కజ్ వ్యవహారం తర్వాత అక్కడికి వెళ్లివచ్చిన వాళ్ల నుంచి పలువురికి సోకి, ఒక దశలో కమ్యూనిటీ స్ప్రెడింగ్‌లోకి వెళుతున్నామా? అన్న సందేహాలూ తలెత్తాయి. అయితే, లాక్‌డౌన్ మూలంగా అదృష్టవశాత్తూ అలా జరగలేదు. లాక్‌డౌన్ నిర్ణయమే కనుక తీసుకోకపోయినట్లయితే ఇప్పటికి పరిస్థితి చేయిదాటిపోయి ఉండేదనడంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలతో పోలిస్తే భారత్‌లోని పరిస్థితి చాలా నయమనడంలోనూ సందేహం లేదు. అయితే, కొత్త కేసులు నమోదు కాకుండా ఆపడంలో, అనుమానితులను గుర్తించి వారికి కొవిడ్ పరీక్షలు జరపడంలో, లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలుచేయడంలో ఎక్కడో ఏవో లోపాలు జరిగాయనే విషయంలో జనంలో చర్చ జరుగుతున్నది. ప్రజల్లో ఒక సెక్షన్ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపైనా.. వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్లు స్వచ్ఛందంగా అధికారుల వద్దకు రాకుండా తప్పించుకు తిరగడం పైనా.. ఆగ్రహం పెల్లుబుకుతున్నది.
కరీంనగర్ పట్టణంలో ఇండోనేషియా పౌరులకు వైరస్ వచ్చిందన్న వార్త వెలుగులోకి రావడంతోనే ఆ జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడికక్కడ రోడ్లను సీల్ చేసి, కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పరచి వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగింది. రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. కానీ ఇదే ప్రయోగం జీహెచ్ఎంసీలోనూ, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లోనూ అమలుచేయడంలో యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా ఆ జిల్లాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మరోవైపు, గత నెల రోజులుగా ప్రజలను రోడ్లమీదకు రాకుండా నివారించడంలో పోలీసులు అనేక సవాళ్ళను ఎదుర్కొన్నారు. మండే ఎండల్లో రోడ్లమీద విధి నిర్వహణలో పోలీసులు ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజలే పూర్తిస్థాయిలో సహకరించినట్లయితే వైరస్ వ్యాప్తి చాలా అదుపులో ఉండేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెల 7వ తేదీ వరకు లాక్‌డౌన్ మరింత పటిష్టంగా అమలుచేయడం ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసులకు పరీక్షగా మారింది. ఆ తర్వాత లాక్‌డౌన్ పొడిగింపు అవసరం రాకుండా ఉండాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది.
బాధ్యత మరచిన ప్రజలు
”కరోనాకు మందు లేదు. వ్యాక్సిన్ ఇంకా రాలేదు. ప్రజలు ఇండ్లకు పరిమితం కావడమొక్కటే మందు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండాలంటే ప్రజల సహకారం తప్పనిసరి. చేతులెత్తి మొక్కుతున్నా. రోడ్లమీదకు రావద్దు” అని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ప్రజలు మాత్రం దాన్ని పూర్తిస్థాయిలో పాటించడంలేదు. నిత్యావసరాలు సమకూర్చుకోడానికి ప్రజలకు పగటి సమయంలో ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడం దుర్వినియోగమవుతోంది. ప్రతీరోజు ఆ పేరుతో రోడ్లమీదకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. ఒకేసారి నాలుగైదు రోజులకు కొనుక్కుని వెళ్ళాలనే కనీస ఆలోచన కూడా చేయకపోవడం పోలీసులు కరుకుగా వ్యవహరించడానికి కారణమైంది. నయానా, భయానా అనే విధానాల్లో రెండోదానికే ప్రజలు వింటారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు సైతం గుర్తింపు కార్డును జేబులో పెట్టుకుని విధులకు హాజరయ్యే పేరుతో రోడ్లమీద చక్కర్లు కొడుతున్న విషయం పోలీసులకు అర్థమైంది. దీంతో ప్రభుత్వం ‘డ్యూటీ పాస్’ విధానానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆశించినట్లుగా ప్రజలే బాధ్యతతో వ్యవహరించినట్లయితే వైరస్ వ్యాప్తి ఈ స్థాయికి వచ్చేది కాదనేది డాక్టర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.
కరీంనగర్‌లో సక్సెస్…
ఇండోనేషియా పౌరులకు కరోనా సోకిందనే వార్త కరీంనగర్ జిల్లాలో ప్రకంపనలు సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయం తీసుకుంది. అన్ని విభాగాల సిబ్బంది సమిష్టిగా పనిచేసి వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగారు. నగరమంతా రసాయనాలు చల్లడం, ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేయడం, ఇండోనేషియా పౌరులు ఎక్కడెక్కడ తిరిగారో, ఎవరిని కలిశారో వివరాలను సేకరించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులోకి వెళ్ళినవారిని గుర్తించి క్వారంటైన్‌లో పెట్టడం, ప్రజలు రోడ్లమీదకు రాకుండా కఠినంగా వ్యవహరించడం.. ఇలాంటి అనేక జాగ్రత్తలతో అక్కడ పాజిటివ్ కేసులను గణనీయంగా తగ్గించగలిగారు. రాష్ట్రమంతటా ఇలాంటి చర్యలు తీసుకున్నా జీహెచ్ఎంసీ, సూర్యాపేట, గద్వాల, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో సక్సెస్ కాలేదు. ఇక్కడా కంటైన్‌మెంట్ జోన్లు, లాక్‌డౌన్ లాంటివి అమలుచేస్తున్నా వైరస్ వ్యాప్తి మాత్రం ఆగలేదు. కరీంనగర్ అనుభవాలను ఇక్కడ అమలుచేయడంలో లోపం జరిగిందనేది నిర్వివాదాంశం. ప్రయత్న లోపం లేకపోయినా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఫలితాలు రాబట్టడంలో కరీంనగర్‌తో పోటీపడలేకపోయాయి ఈ ప్రాంతాలు.
వలస కార్మికులతోనే అసలు సమస్య
లాక్‌డౌన్ నిర్ణయంతో ప్రజల కదలికలు బాగా తగ్గిపోయాయి. జనతా కర్ప్యూ తర్వాత లాక్‌డౌన్ లాంటి పరిస్థితి వస్తుందని ప్రజలు ఊహించలేకపోయారు. మార్చి 24వ తేదీ రాత్రి ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించడం గంటల వ్యవధిలోనే ఎక్కడివారక్కడ ఉండిపోవడం అమలులోకి వచ్చింది. దీంతో లక్షలాది మంది వలస కార్మికులు ఇళ్ళకు వెళ్ళలేక పనిచేసే పట్టణాల్లోనే చిక్కుకుపోయారు. కొంత మంది కాలినడకన వెళ్ళిపోయారు. మరికొద్దిమంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల ద్వారా వెళ్ళిపోయారు. ఇక మిగిలినవారు ఎక్కడికక్కడ క్యాంపుల్లో, పునరావాస కేంద్రాల్లో ఉండిపోయారు. నెల రోజుల నుంచి పని లేకుండా ఉండి తిండి కరువైన వీరు ఎప్పుడు అవకాశం వచ్చినా స్వస్థలాలకు వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నారు. మరికొంతకాలం లాక్‌డౌన్ కొనసాగితే వీరిని ఆపడం ప్రభుత్వాలకు, పోలీసులకు పెద్ద సవాలే అవుతుంది. ‘బతికుంటే బలుసాకు..’ అని కేసీఆర్ చెప్పే సామెత ఇప్పుడు వీరి విషయంలోనూ ప్రతిబింబిస్తోంది. ఇప్పటివరకూ ఏదోలా నచ్చచెప్పి వీరిని రోడ్లమీదకు రాకుండా ఆపగలిగిన పోలీసులు ఇకపైన ఎలా నిలువరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొన్నిచోట్ల సమయానికి వారికి తిండి దొరకడంలేదు. ఇక్కడి ఆహారపదార్ధాలతో సర్దుకోలేకపోతున్నారు. సొంతూరి మీద మమకారంతో లాక్‌డౌన్ ఎప్పుడు ముగిసిపోతుందా అని వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.
పొడిగించడమే మార్గమా?
నెల రోజుల అనంతరం పరిస్థితిని పరిశీలిస్తే, లాక్‌డౌన్‌ను మరింతకాలం పొడిగించడం తప్ప మరో మార్గం లేదన్నది ఇప్పుడు సర్వజనాభిప్రాయం. ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశంలోనూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది కనుక అందరూ అదే అభిప్రాయానికి వస్తున్నారు. అయితే, ఎంతకాలం ఇలా పొడిగించుకుంటూ పోతామన్నదే అసలు సమస్య. ప్రజల్లో అవగాహనను పెంచి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయడం, సమస్యాత్మక ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించడం, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను సకాలంలో గుర్తించి క్వారంటైన్‌కు తరలించడం, కరోనా టెస్టుల సంఖ్యను పెంచడం వంటి చర్యలతో కూడిన బహుముఖ వ్యూహాన్ని పకడ్బందీగా అమలుచేయడం పైనే ఇది ఆధారపడివుంది. మహమ్మారిని అంతం చేయడానికి నడుం బిగించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఎలాంటి వైఖరిని అనుసరిస్తాయో చూడాలి.
టెస్టులు పెరగాలి: ఐఎంఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ నర్సింగ్ రెడ్డి
”లాక్‌డౌన్ కొనసాగుతుండగానే దేశవ్యాప్తంగా కేసులు ఎలా పెరుగుతున్నాయో చూస్తున్నాం. ఈ ఆంక్షలనే సడలిస్తే.. ప్రజలు రోడ్ల మీదకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ప్రస్తుతం మనం ప్రైమరీ, సెకండరీ, థర్డ్ లెవల్ కాంటాక్టుల ద్వారా పెరుగుతున్న పాజిటివ్ కేసుల్ని చూస్తున్నాం. ఈ స్థాయి దాటిపోయి ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్’ దశకు వెళ్తే నియంత్రించడం ఎవరి తరమూ కాదు. మన వైద్యరంగ మౌలిక సదుపాయాలూ సరిపోవు. ఆ పరిస్థితి రావద్దంటే లాక్‌డౌన్‌ను మరో నెల రోజులు పొడిగించడం తప్ప మరో మార్గంలేదు. సింగపూర్‌లో లాక్‌డౌన్ ఎత్తేయడం ద్వారా వచ్చిన చేదు అనుభవాలతో మళ్ళీ జూన్ చివరి వరకూ పొడిగించక తప్పలేదు. ఇక్కడ అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. ఎలాగూ వైరస్ ఇన్‌క్యుబేషన్ గడువు 28 రోజులకంటే ఎక్కువ లేదు కాబట్టి ఆ మేరకు ప్రజలను ఇళ్ళకే పరిమితం చేస్తే వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుంది. ఇదే సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత ఎక్కువ సంఖ్యలో చేయాలి. రాష్ట్ర జనాభాలో కనీసం 40% మేరకైనా ఈ పరీక్షలు జరగాలి. ఒక్క కరోనా పాజిటివ్ పేషెంట్ ఉన్నా రోడ్డుమీదకు వస్తే కొన్ని వేల మందికి అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే కొత్త కేసులు ఏమీ లేవనుకున్నప్పుడే లాక్‌డౌన్‌ను ఎత్తేయాలి” అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ నర్సింగ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రజల్లో బాధ్యత మరింత పెరగాలి : షాద్ నగర్ ఏసీపీ సురేందర్
”ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లాక్‌డౌన్ సమయంలో ప్రజలు రోడ్లమీదకు రాకుండా ఇళ్ళకు పరిమితం కావడం సంతోషం. అయితే మేం ఆశించినదాంట్లో ఇది 60% మాత్రమే. పూర్తిస్థాయిలో అమలుకావాలంటే ప్రజలు బాధ్యతాయుతంగా నడుచుకోవడంతో పాటు మీడియా ద్వారా ఈ వ్యాధి తీవ్రతపై అవగాహన పెరగాలి. గత నెల 24 అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు రోజులు ఎలా ఉన్నా వారం పది రోజుల పాటు పటిష్టంగా అమలైంది. ఆ తర్వాత ప్రజల్లో కాస్త నిర్లక్ష్యం పెరిగింది. రకరకాల సాకులతో రోడ్లమీదకు వస్తున్నారు. బైటకు రావడం ద్వారా వైరస్ బారిన పడతామనేది సీరియస్‌గా తీసుకోవడంలేదు. మందులు, కూరగాయలు, నిత్యావసరాలు.. ఇలా రకరకాల పేర్లతో రోడ్లమీదకు వస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి సీసీ టీవీ కెమెరాలకు పని చెప్పాల్సి వచ్చింది. రెగ్యులర్‌గా రోడ్లమీదకు వచ్చే వాహనాల నెంబర్లను, వ్యక్తులను గుర్తిస్తున్నాం. లాక్‌డౌన్ ఎత్తివేయగానే వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు అప్పజెప్తాం. ప్రతీరోజూ రోడ్లమీదకు ఎందుకు వస్తున్నారో తేలిపోతుంది. ఇకపైన మరింత కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నాం. విధి నిర్వహణలో ఉండే పోలీసు కానిస్టేబుళ్ళకు లాక్‌డౌన్ ఒక పరీక్షలాగా నిలిచింది. ఎండల సమయంలో వారి ఏకాగ్రత దెబ్బతింటుంది. శారీరక సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఎనిమిది గంటల డ్యూటీ వేస్తున్నాం. ఆ తర్వాత 24 గంటల రెస్టు ఇస్తున్నాం. విటమిన్ సి మాత్రలను అందిస్తున్నాం. కుటుంబంలో, బంధువుల్లో పాజిటివ్ కేసులేమైనా ఉన్నాయోమోనని తరచూ పరిశీలిస్తున్నాం. ఇంతకాలం ఎలా నడిచినా ఇకపైన లాక్‌డౌన్‌ను అమలుచేయడం అసలైన పరీక్షగా నిలవనుంది” అని షాద్ నగర్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సురేందర్ వ్యాఖ్యానించారు.
కార్డన్ ఆఫ్‌తోనే సక్సెస్: కరీంనగర్ కలెక్టర్ శశాంక
ఇండోనేషియా వాసులు కరీంనగర్ కు రావడం, వారికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రత్యేక దృష్టి సారించాం. సీఎం, మంత్రులు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పనిచేశాం. పోలీసు, బల్దియా, వైద్య ఆరోగ్య శాఖల మధ్య ఎప్పటికప్పుడు కో ఆర్డినేషన్ చేసుకోగలిగాం. శాఖల మధ్య సమన్వయం సత్ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా ఫ్రజలను చైతన్యపర్చడంలో సక్సెస్ కాగాలిగాం. వ్యాధి తీవ్రత, దానివల్ల జరిగే నష్టాలను వివరించడంతో ప్రజలు కూడా సానుకూలంగా సహకరించారు. కంటైన్ మెంట్ ఏరియాను కార్డన్ ఆఫ్ చేయడం వల్ల ప్రజలకు వ్యాధి ఎంతటి ప్రమాదకరమో అర్థం అయింది. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో వైద్య పరీక్షలు తరుచూ నిర్వహించడం జరిగింది. కార్డన్ ఆఫ్ చేయడం మూలంగా కరోనా స్ప్రెడ్ కాకుండా నిలువరించడంలో సఫలం అయ్యాం. ఓ వైపున కరోనా మహమ్మారి గురించి ష్రజలను చైతన్యపరుస్తూనే మరో వైపున కఠినంగా కూడా వ్యవహరించాం. దీనివల్ల కరోనా విస్తరించకుండా నిలువరించగలిగాం. ఇక ముందు కూడా కరోనా కట్టడి కోసం ప్రజలు సామాజిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టనున్నాం.
లాక్ డౌన్ ఒక్కటే సరైన మందు : మంత్రి ఈటల రాజేందర్
మందే లేని కరోనా వైరస్‌కు లాక్‌డౌన్ ఒక్కటే సరైన మందు. దీన్ని గుర్తించాం కాబట్టే కేంద్ర ప్రభుత్వం మే నెల 3వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తే మనం ఏడవ తేదీ వరకు విధించాం. ఈ నెల 20 నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తే మనం ఇవ్వలేదు. దానికున్న ప్రాధాన్యతను గుర్తించాం కాబట్టే మనం ఆ విధంగా ఆలోచించాం. లాక్‌డౌన్ సమర్ధవంతంగా అమలుచేయలేని రాష్ట్రాల్లోని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే ఆ రాష్ట్రాలతో పోలిస్తే మనం చాలా బెటర్‌గా ఉన్నాం. ప్రజలకు కూడా పదేపదే విజ్ఞప్తి చేయడానికి కారణం అదే. మరోవైపు కంటైన్‌మెంట్ జోన్‌లలో మనుషుల కదలికలే లేకుండా చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నా అప్పటికే ఉన్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల ద్వారా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. లాక్‌డౌన్, కంటైన్‌మెంట్, ఆంక్షలే లేనట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. లాక్‌డౌన్ ద్వారా చాలావరకు మనం వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగాం. ఈ నిర్ణయం మంచి ఫలితాలనే ఇచ్చింది.