కేరళ నీళ్లలో ‘గ్రహాంతర చేపలు’..

by Shyam |   ( Updated:2021-11-23 01:54:21.0  )
Fish
X

దిశ, ఫీచర్స్ : 2018లో కేరళను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానిక మత్స్యకారులు అప్పటివరకు చూడని ‘విచిత్రమైన’ చేపలను చూశారు. వింత చేపలు లభించడంతో ఆ ఫొటోలు, విషయాలు వార్తల్లో హెడ్‌లైన్స్‌గా మారాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరలయ్యాయి. ఈ ఆసక్తికరమైన అంశమే.. కేరళ విశ్వవిద్యాలయంలో ‘ఇన్వాసివ్ ఏలియన్స్ ఫిషెస్’పై అధ్యయనం చేస్తున్న పరిశోధకురాలు స్మృతి రాజ్ దృష్టిని ఆకర్షించింది. గ్రహాంతర జల జాతుల ఉనికిని డాక్యుమెంట్ చేసేందుకు 2016 నుంచి కేరళ వ్యాప్తంగా మంచినీటి పర్యావరణ వ్యవస్థలను అధ్యయనం చేసిన బృందంలో ఆమె కూడా ఒకరు. ఈ పరిశోధనలు ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ హెల్త్ & మేనేజ్‌మెంట్‌లో ఇటీవలే ప్రచురిచతమయ్యాయి.

రాష్ట్రంలోని 44 నదులు, 53 రిజర్వాయర్లలో పరిశోధకులు సర్వే నిర్వహించగా, ఒరియోక్రోమిస్ మొసాంబికస్, సైప్రినస్ కార్పియో వంటి అత్యంత సాధారణ ఆక్రమణ జాతులను గుర్తించారు. ఒరియోక్రోమిస్ మొసాంబికస్‌ను మొజాంబిక్ టిలాపియా అని కూడా పిలుస్తుండగా, ఇది ఆఫ్రికాకు చెందినది కాగా సుమారు 39cm వరకు పెరుగుతుంది. కిలోగ్రాము కంటే కొంచెం బరువు ఉండే ఈ చేపలను కేరళలోని అన్ని నదుల్లో, 25 రిజర్వాయర్లలో, రెండు మంచినీటి సరస్సులలో కనుగొన్నారు. ఇక సైప్రినస్ కార్పియో, లేదా కామన్ కార్ప్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా అత్యంత తరచుగా కనిపించే జాతుల్లో మూడోది, ఈ చేపలు ప్రతి ఖండంలోని నీటి నాణ్యతను తగ్గించడంతో పాటు, జలజాతులు క్షీణించేందుకు కారణమయ్యాయి.

మొత్తంగా కేరళ జలాలు 28 గ్రహాంతర చేప జాతులకు, నాలుగు గ్రహాంతర ఆక్వాటిక్ కలుపు మొక్కలు లేదా మాక్రోఫైట్‌లకు నిలయంగా ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. ఇక నీటి వనరుల్లో సాల్వినియా మోలెస్టా, పిస్టియా స్ట్రాటియోట్స్, ఐచోర్నియా క్రాసిప్స్, కాబోంబా ఫర్కాటా అనే నాలుగు మాక్రోఫైట్స్ లేదా ఆక్వాటిక్ కలుపు మొక్కలను బృందం డాక్యుమెంట్ చేసింది. మొదటి మూడు మొక్కలు గార్డెన్ ప్లాంట్స్‌గా లేదా పరిశోధనను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టగా, సహజ వ్యవస్థలలోకి వీటి ప్రవేశం ప్రమాదవశాత్తు జరిగినట్లు పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Fish

32 గ్రహాంతర జాతులలో 15 అక్వేరియం హ్యాపీ అండ్ ట్రేడ్ ద్వారా పరిచయం చేయగా.. ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడానికి తొమ్మిది జాతులు, దోమల నియంత్రణ కోసం మూడు జాతులు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ చేపలు నీటి వనరుల్లో ఉండటం వల్ల స్థానిక జీవవైవిధ్యానికి ముప్పు కలిగిస్తాయి. చలకుడి నదిలో అత్యధికంగా 11 అన్యదేశ చేపలుండగా.. వీటిలో ఎనిమిది జాతులు వరదల వల్ల వచ్చినట్లు భావిస్తున్నారు. ఇందులో అరపైమా గిగాస్ వంటి అరుదైన మెగా చేపలున్నాయి. పెరుగుతున్న విపరీతమైన వాతావరణ సంఘటనలతో, రాష్ట్రంలో ఎక్కువ గ్రహాంతర లేదా స్థానికేతర జాతుల వ్యాప్తిని చూడొచ్చు. కేరళలో ఇప్పుడు అక్వేరియం ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న అక్రమ ఆక్వాకల్చర్‌కు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని స్మృతి రాజ్ తెలిపారు.

‘గ్రహాంతర జాతుల ప్రవేశ మార్గాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరముంది. స్థానికేతర జాతులను పెంచే హేచరీల దగ్గర బయో-సెక్యూర్ ఫెన్సెస్(కంచెలు) ఉపయోగించాలి. నీటి వనరుల నుంచి వీటిని తొలిగించేందుకు కృషి చేయాలి. ఇటీవల పెరియార్ సరస్సులో ఆఫ్రికన్ క్యాట్ ఫిష్‌ను నిర్మూలించడానికి పెరియార్ టైగర్ రిజర్వ్ డ్రైవ్ ప్రారంభించింది. మూడు రోజుల్లో 450 కిలోల ఆఫ్రికన్ క్యాట్ ఫిష్‌ను బయటకు తీశారు. ఇలా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. కానీ పూర్తిస్థాయిలో చేపలను నిర్మూలించడం కష్టసాధ్యం. ఇతర చేప జాతుల వల్ల కలిగే ప్రభావాలు, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అనుకుంటున్నాం. ఇక కొన్ని సంస్థలు ఇప్పుడు దురాక్రమణ కలుపు మొక్కలను ఉపయోగించి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటిని ఎరువుగా, పుట్టగొడుగుల పెంపకం కోసం తడి పదార్థంగా, విలువ ఆధారిత ఉత్పత్తుల హోస్ట్‌గా ఉపయోగించవచ్చు. ఈ కలుపు మొక్కల వాణిజ్య ప్రయోజనాలు కనుగొనగలిగితే, వాటిని నీటి నుంచి నెమ్మదిగా నిర్మూలించవచ్చు’ అని కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ ప్రొఫెసర్ రాజీవ్ రాఘవన్ చెప్పుకొచ్చారు.

వావ్ వాట్ ఏ లాజిక్.. మిర్చి పొలంలో వెరైటీ దిష్టి బొమ్మ..

Advertisement

Next Story

Most Viewed