ఉస్మానియా ఆస్పత్రి ఎదుట వైద్య సిబ్బంది ధర్నా..

by Anukaran |   ( Updated:2020-07-14 06:42:03.0  )
ఉస్మానియా ఆస్పత్రి ఎదుట వైద్య సిబ్బంది ధర్నా..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఓవైపు కరోనా విజృంభిస్తోంది. మరోవైపు కరోనా పేషెంట్లకు అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం వసతులతో పాటు సరైన వేతనాలు అందించడం లేదని వైద్యులు ఆందోళనకు దిగుతున్నారు. వీరికి తోడుగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది సైతం తమకు కొన్ని నెలలుగా వేతనాలు అందడంలేదని ఆందోళన బాటపట్టారు.

ఉస్మానియా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని మంగళవారం ఆస్పత్రి ఎదట ధర్నాకు దిగారు. కోవిడ్ -19 సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నామని.. అలాంటిది తమకు వేతనాలు పెంచకపోగా.. వచ్చే అరకొర జీతాలను కూడా నాలుగు నెలలుగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

నిత్యం డ్యూటీకి రావాలంటే ఆటో చార్జీలకు డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటి కిరాయి, నిత్యావసర సరుకులు కొనడానికి కూడా చేతిలో డబ్బులు లేవని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఉద్యోగులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూనే పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు వేతనాలు పెంచాలని ప్రతిరోజూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed