సెప్టెంబర్ లో సంస్థాగత కమిటీలు: కేటీఆర్

by Shyam |
సెప్టెంబర్ లో సంస్థాగత కమిటీలు: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ,మండల, మున్సిపల్, పట్టణ, జిల్లా కమిటీలను సెప్టెంబర్ 2న నియమించనట్లు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణం సెప్టెంబర్ లోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణం తర్వాత సరికొత్త రాష్ట్ర కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. దీనికి బాధ్యులుగా పార్టీ ప్రధానకార్యదర్శులు, కార్యదర్శలు వ్యవహరిస్తారని మరో రెండ్రోజుల్లో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు నేతృత్వంలో కార్యాచరణ ఖరారు చేస్తామన్నారు. ఆనవాయితీ ప్రకారం 2019 వరకు ప్రతి ఏటా పార్టీ ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నామన్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో లేక నవంబర్ లో ద్విదశాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికైన ఏదైనా టీఆర్ఎస్ తిరుగులేని ఘన విజయం సాధిస్తుందని అన్నారు. రెండు దశాబ్దాల కాలంలో చిరస్మరణీయమైన విజయాలు సాధించిందన్నారు. 87 అసెంబ్లీ, 9 పార్లమెంట్, 32 జిల్లా పరిషత్, 135మున్సిపాలిటీలు, 9వేల గ్రామపంచాయతీల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, పథకాలను చూసి ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు.

పార్టీని మరింత బలోపేతమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మినహా32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం జరుగుతుందని 24 జిల్లాల్లో పూర్తి కాగా, మరో 8 జిల్లాల్లో 80శాతం పూర్తయ్యాయన్నారు. అక్టోబర్ లో కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయాల ప్రారంభం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి స్వీయ అస్తిత్వమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్నారు. సెప్టెంబర్ లో ఢిల్లీలో 1200 చదరపు మీటర్ల స్ధలంలో టీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమిపూజ ఉంటుందన్నారు. టీఆర్ఎస్ కార్యవర్గంతో పాటు ఎమ్మెల్మేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ ఆహ్వానితులే అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగంలో తీసుకెళ్తున్నామని, ఇంటింటికి తాగునీరు, పశుసంపద, వ్యవసాయం, పరిశ్రమ, ఐటీ రంగాలతో పాటు తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రభాగాన ఉన్నామని కేంద్రమే చెబుతుందన్నారు. కులవృత్తులను ఆదుకునేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. దళితుల సంక్షేమం కోసం 25 ఏళ్ల క్రితమే సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతిని ప్రారంభించిన కేసీఆర్ అదే స్ఫూర్తితో దళిత బంధు పథకం తెచ్చారన్నారు. దళితబంధుపథకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేయాలని, చైతన్యవంతంగా పనిచేయడంతో పాటు ప్రజలను మమేకం చేయాలని కేసీఆర్ సూచించినట్లు వెల్లడించారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన కమిటీ సమావేశంలో రాలేదని, నోటిఫికేషన్ వచ్చిన తరువాత హుజురాబాద్ ఎన్నిక గురించి చర్చించనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత పదుల సంఖ్యలో ఎన్నికలు జరిగాయని, ఈ ఎన్నికల మాదిరిగానే హుజురాబాద్ ఉప ఎన్నిక ను చూస్తామన్నారు. ఇన్ని సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కోన్నామన్నారు. కొంతమందికి హుజురాబాద్ ఎన్నిక అత్యంత ప్రాధాన్యత గలది కావొచ్చు కానీ మాకు మాత్రం చిన్నదే అన్నారు. 75ఏళ్లలో మంచినీళ్లివ్వని…పేదరిక నిర్మూలన చేయని… ప్రభుత్వాన్ని నడపడం చేతకాని పార్టీల నేతలు చేసే ఆరోపణలు మానుకోవాలని సూచించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దళితుల సంక్షేమమే కోసమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే కొంతమంది ఈ పథకం విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ది బలహీనమైన గుండె కాదు ..ధైర్యం తో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్టే దళిత బంధు పథకం తెచ్చారన్నారు. పనికిమాలిన ప్రతిపక్షాలు…నాయకులు చేసే పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్టు గా మొదలు పెట్టిన దళితబంధు పథకం అమల్లో లో పాల్గోనాలని సూచించారు. హుజురాబాద్ లో దళితబంధు సక్సెస్ అయితే దేశం తెలంగాణను చూస్తది అన్నారు.

హుజురాబాద్ చిన్న ఉపఎన్నిక అని, ఆ ఎన్నికల్లో ఓడిపోతే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదు…కేంద్రం లో ప్రభుత్వం మారేది లేదని స్పష్టం చేశారు. హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని, ఈటలకు ముందు కూడా పాత కమలాపూర్ నియోజక వర్గం లో టీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. 2001లోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ గెల్చుకున్నామని, ఈటల రాజేందర్ 2003 లో టీ ఆర్ ఎస్ లో చేరి విజయం సాధించారన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం తధ్యమన్నారు. సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, జనరల్ సెక్రటరీలు సత్యవతి రాథోడ్, రాములు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్, గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed