చట్టాలను వెనక్కి తీసుకోవాలని విపక్షాల పట్టు

by Shamantha N |
చట్టాలను వెనక్కి తీసుకోవాలని విపక్షాల పట్టు
X

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయం బుధవారం కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. చట్టాలను రద్దు చేయడంతోపాటు ప్రత్యేక చర్చ చేపట్టాలని ప్రతిపక్షాల సభ్యులు డిమాండ్ చేయడంతో పలుమార్లు ఇరుసభలు వాయిదా పడ్డాయి. సాయంత్రం 4గంటలకు లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధరి మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల చేపట్టిన ఆందోళనలను ప్రస్తావిస్తూ ఇది దేశ ప్రతిష్ఠకు హానికరమని పేర్కొన్నారు. ఈ విషయమై తాము ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ప్రతిష్ఠాత్మక సమస్యగా భావించకుండా వివాదస్పద మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్, డీఎంకేతోపాటు ప్రతిపక్ష పార్టీలు సూచించాయి. ఆందోళన చేస్తున్న రైతులను శత్రువులుగా భావించవద్దని సూచించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని కోరారు. ఆ సమయంలో ప్రధాని సభలోనే ఉండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed