ఇంకేమ్లేదు.. ఓన్లీ కరోనా

by Shyam |

దిశ, వరంగల్: కరోనా దెబ్బకు జిల్లాలో పోలీస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అంతకు ముందు పుట్టెడు కేసులతో పోలీసులు సతమతమయ్యేవారు. కొద్దిరోజులుగా కేసులు నమోదుకావడంలేదు. పోలీసులు 24 గంటలు డ్యూటీలు చేస్తున్నప్పటికీ కేసుల తలనొప్పి లేదు. సాధారణ రోజుల్లో యావరేజ్‌గా ఒక్కో పోలీస్‌స్టేషన్‌లో 2 నుంచి 5 వరకు కేసులు నమోదయ్యేవి. ఈ లెక్కన ఉమ్మడి వరంగల్ జిల్లాలో
వంద వరకు కేసులు నమోదయ్యేవని తెలుస్తోంది.

కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంలేదు. బైక్‌పై ఒక్కరు, కారు లాంటి పెద్ద
వాహనాల్లో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా ఇక్కడి వారికి మాత్రమే కావడంతో ప్రమాదాలకు ఆస్కారం లేకుండాపోయింది. పల్లెల్లో కక్ష్యలు, కార్పణ్యాలు లేవు. కరోనా నివారణకు పల్లె
జనమంతా ఏకమయ్యారు. ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. పక్క ఊరోళ్లనే పొలిమెర దాటనీయడం లేదు. ఇక దొంగతనం అనే మాట అస్సలు వినపడటం లేదు. ఇంతకు ముందు
వేసవికాలం వచ్చిందంటే ఎక్కువగా చోరీలు జరిగేవి. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు పేరిట ఇక్కడికి వచ్చి చోరీలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితులు లేవు. ఎక్కడికక్కడే రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్‌లు పెట్టి రాకపోకలు బంద్ చేశారు. దీంతో పల్లెలు, గ్రామాలు కర్ఫ్యూను తలపిస్తుండటంతో కరోనా కట్టడి ముందు మిగతావన్నీ లెక్కకు రావడం లేదనే అభిప్రాయాలున్నాయి.

తగ్గిన కేసులు..?

లాక్ డౌన్ విధించడానికి ముందు వరకు పరిస్థితులు వేరు. విధించిన తర్వాత పరిస్థితుల్లో పూర్తి మార్పులు చోటుచేసుకున్నాయి. అంతకు ముందు రోడ్డెక్కితే చాలు ట్రాఫిక్ రద్దీలో ప్రమాదాలను దాటుకుంటూ ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఉండేది. ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదం జరిగిందని, ఫలానా వాళ్లు చనిపోయారని లేదా తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వినేవాళ్ళం. మద్యం మత్తులో వచ్చి రాని డ్రైవింగ్‌తో అనేకమంది నిండు ప్రాణాలు బలితీసుకున్న సంఘటలు చూశాం. తెల్లవారు జామున నిద్రలోనే ప్రాణాలు విడిచిన లారీ డ్రైవర్లు, క్లీనర్ల విషాద ఘటనలు విన్నాం. తాగిన మైకంలో అభంశుభం తెలియని అమ్మాయిలపై అకృత్యాలు సైతం చూశాం. జనం పొద్దున లేస్తే వార్తాపత్రికల్లో ఎలాంటి వార్తలు చూడాల్సి వస్తదోనని భయాందోళనలు వ్యక్తం చేసేవారు. కానీ, కొద్దిరోజులుగా అలాంటి వార్తలు విన్న దాఖలాలు లేవు. అలాంటి వార్తలు వినడానికి ఆస్కారం లేకుండా పోయిందని సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కొత్త అనుభవాలకు తెరతీసినట్లు పేర్కొంటున్నారు.

సాధారణ పరిస్థితుల్లో ఓ పక్క విధులు నిర్వహిస్తూనే రోజువారీ కేసులు పెను సవాళ్లుగా నిలిచేవని
చెబుతున్నారు. వీఐపీల బందోబస్తు మాట పక్కన పెడితే చిన్న, చిన్న ఘర్షణల నుంచి మొదలుకుని రోడ్డు ప్రమాదాలు, భార్యభర్తల గొడవలు, భూతగాదాలు నిత్యకృత్యంగా ఉండేవని, కొన్ని కేసులను పరిష్కరించే
క్రమంలో రోజులు గడిచిపోయిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు. కానీ, కరోనా లాక్‌డౌన్ పెద్ద సవాల్ అయినప్పటికీ సాధారణ కేసుల నుంచి ఉపశమనం లభించిందనే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్‌లకు వచ్చేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు.

Tags: warangal, no crime, cases, police, corona

Advertisement

Next Story