- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువతే టార్గెట్… ఏటా రూ.7,500 కోట్ల దందా!
దిశ ప్రతినిధి, మేడ్చల్ : యువతే టార్గెట్. ఆన్ లైన్ వేదికగా జూదపు వల విసురుతూ లక్షలు కాజేస్తున్నారు. రాష్ట్రంలో నిషేధం విధించినా ముంబై, బెంగళూరు కేంద్రంగా మోసగాళ్లు ఫేక్ ఐడీలు.. లొకేషన్లు చూపుతూ రమ్మీ ఆటలోకి దించుతున్నారు. కరోనా కాలాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. పిల్లలు, యువత ఎక్కువగా ఆన్లైన్లోనే గడుపుతుండడంతో వారికి ఎర వేస్తున్నారు. వందకు వెయ్యి రూపాయలు వస్తాయంటూ ఆశ చూపి జేబులు గుల్ల చేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ రమ్మీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ లో ఆడే ఈ 13 ముక్కల పేకాట వ్యసనం ఎందరో బతుకులను బుగ్గిపాలు చేస్తోంది.
‘ఆన్ లైన్’ రమ్మీ అడండి. లక్షలు సంపాదించండి’ అంటూ సోషల్మీడియాలో, మెసేజ్ రూపంలో మాయగాళ్లు ఆశల వలలు విసురుతున్నారు. ఓసారి ఆడిచూద్దాం.. అనుకునే వారు బ్యాంక్ అకౌంట్, వారు అడిగిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మాయాజూదంలోకి వెళ్లి మొదట్లో కొన్ని ఆటలు గెలిచినట్టే అనిపిస్తాయి. ఆ తర్వాత నుంచి వరుసగా ఓడిపోతుంటారు. అవతల వ్యక్తి ఎవరో (గుర్తు తెలియని వ్యక్తి) ఇంత గెలిచారు.. అంత గెలిచారంటూ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. దీంతో మిగతా ఆటలో ఉన్నవాళ్లంతా తాము గెలవలేదు అని భావించి, తమ వద్ద ఉన్న డబ్బులతోపాటు అప్పులు చేసి ఆగమవుతున్నారు.
అంతా మాయ..
ప్రత్యక్షంగా ఆడే రమ్మీ ఆటలో ఒకరు ఔట్ అయిపోతే మళ్లీ పందెం కాసి ఆటలో కలవచ్చు. అలా ఎవరు కలుస్తారో ఆడేవాళ్లకు తెలుస్తుంది. కానీ ఆన్‌లైన్ రమ్మీలో అక్కడే మతలబు ఉంటోంది. ప్రతి ఆటలో ఒకరో ఇద్దరో త్వరగా ఔట్ అయిపోయి మళ్లీ కలుస్తారు. అక్కడ ఎవరు కలుస్తారో తెలియదు. చివరికి ఆలా కలిసిన వారే ఆట గెలుస్తుంటారు. కొన్నిసార్లు ఒకరే ఒకటి కంటే ఎక్కువ ఆటల్లో ఒకేసారి కలిసి ఆడుతున్న ఉదంతాలు కూడా ఉంటాయి. అసలు అటువైపు మనుషులే ఉండరని, కంప్యూటర్లే ఆడతాయని.. అంతా ఆన్‌లైన్‌లో మాయాజాలంతో బురిడీ కొటిస్తారని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
ముంబై, బెంగళూరు కేంద్రంగా…
‘గేమ్ ఆఫ్ స్కిల్స్’ పేరిట ఆన్ లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఆన్ లైన్ నిర్వహణ సంస్థలు రెచ్చిపోతున్నాయి. ముంబై, బెంగళూరు తదితర రాష్ట్రాలు ప్రధాన కేంద్రాలుగా 20కి పైగా సంస్థలు ఆన్ లైన్ రమ్మీ యాప్ నిర్వహిస్తున్నట్లు ఆన్ లైన్ గేమింగ్ ఫెడరేషన్ సంస్థ తెలియజేస్తోంది. 2020 జనవరి నాటికి దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్ లైన్ రమ్మీ ఆడుతుండగా, రూ.7,500 కోట్లు బిజినెస్ అవుతున్నట్లు సమాచారం. అయితే లాక్ డౌన్ కాలంలో యువత పెద్ద ఎత్తున ఆన్ లైన్ రమ్మీ వైపు ఆకర్షితులైనట్లు ఈ సంస్థ వెల్లడిస్తోంది. దీంతో ఆన్ లైన్ రమ్మీ వల్ల వ్యసనపరులు ఏటా వందల కోట్ల రూపాయలు గ్యాంబ్లింగ్ మాయలో పడి పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత వారికి తెలియకుండానే ఈ ఆన్ లైన్ రమ్మీకి బానిసలవుతున్నారు.
టార్గెట్ యూత్..
రాష్ట్రంలో ఆన్ లైన్ గేమ్‌కు అనుమతి లేకపోవడంతో కొందరు మాయగాళ్లు ఫేక్ యాప్‌ని క్రియేట్ చేసి, వేరే ప్రాంత లొకేషన్ లో ఉన్నట్లు చూపిస్తున్నారు. ఒక్కో వ్యక్తి మొబైల్‌కి రెండువేల రూపాయల చొప్పున చెల్లిస్తూ వారి ఆధార్‌కార్డు, పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్ వివరాలు ఇస్తూ, వారి ఫోన్ ద్వారా పెట్టుబడి పెట్టి గెలిచినా మొత్తం డబ్బులను కేటుగాళ్లు కాజేస్తున్నారు.
ఒకేసారి మూడు ఫోన్లలో లాగినై వ్యతిరేకంగా వచ్చే ముగ్గురిని మోసం చేసే విధానంతో యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కేవలం 30 నిమిషాల్లో పది వేల నుంచి రూ.15వేల రాబడి అంటూ యువతను చెడు అలవాట్లకు బానిసలు చేస్తూ, వారి బంగారు భవిష్యత్ను నాశనం చేస్తున్నారని పోలీసులు తెలియజేస్తున్నారు. ఆన్‌లైన్‌లో రమ్మీ కోసం మొబైల్ ఇచ్చిన వారి జాబితా కూడా సేకరిస్తున్నామని, వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులు గమనించాలి…
ఆన్‌లైన్ రమ్మీ వ్యసనానికి బానిస కాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి. ఒకసారి అలవాటు పడితే బయట పడటం కష్టం. ఆన్‌లైన్ ఆటల సందర్భంగా తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు. కరోనా నేపథ్యంలో యువత, పిల్లలు ఇంటి వద్దే ఉంటూ ఇలాంటి వ్యసనాలకు బానిసవుతున్నారు. ఎక్కువ శాతం యువత, పిల్లలు రాత్రి పూట ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. తల్లిదండ్రులు గమనించి పిల్లలను కాపాడుకోవాలి.
-మధుకర్ స్వామి,ఇన్ స్పెక్టర్ కార్ఖానా