నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

by Sumithra |
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
X

దిశ, డోర్నకల్: విద్యుత్ స్తంభాలు మార్చండి, లైన్లు కిందికి వేళ్ళాడుతున్నాయి మహాప్రభో.. అంటూ తండా వాసులు విద్యుత్ అధికారులను ఎన్నోమార్లు వేడుకున్నారు. అధికారులు కూడా విన్నట్టే విని షరా మాములుగా పట్టించుకోకుండా వదిలేశారు. ఫలితంగా ఓ యువ రైతు నిండు ప్రాణం బలైంది. ఈ విషాద ఘటన నర్సింహులపేట మండలం వాంకుడొత్ తండాలో మంగళవారం జరిగింది.

తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మీర తండా గ్రామపంచాయతీ శివారులోని వాంకుడోత్ తండాకు చెందిన అమర్ సింగ్ కుమారుడు వాంకుడోత్ కిరణ్ సింగ్(27) పొలం పనులకు వెళ్లిన తండ్రికి సాయం చేయడానికి ఇంటి వద్ద ఉన్న గొర్రెను ఎత్తుకుని పొలానికి బయలుదేరాడు.

ఈ క్రమంలో పొలం వద్ద కిందకి వేళాడుతున్న విద్యుత్ తీగలు గొర్రెకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చేతికందొచ్చిన కొడుకు కళ్ళముందే విగతజీవిగా మారటం చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కరెంట్ తీగల విషయమై లైన్ మెన్ కు ఎన్నో సార్లు చెప్పినా పట్టించుకోలేదని తండా వాసులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed