ఒలంపిక్ టార్చ్ ర్యాలీలో కొవిడ్ కలకలం

by Shyam |
ఒలంపిక్ టార్చ్ ర్యాలీలో కొవిడ్ కలకలం
X

దిశ, స్పోర్ట్స్ : విశ్వక్రీడలు ఒలంపిక్స్‌కు ఇప్పటికే కరోనా ప్రభావం తగిలిన విషయం తెలిసిందే. గత ఏడాది జులైలో జరగాల్సిన ఈ క్రీడా సంగ్రామం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ విజృంభిస్తుండటంతో ఈ జులైలో అయినా ఒలంపిక్స్ జరుగుతాయా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ, టోక్యో ఒలంపిక్స్ నిర్వాహక కమిటీతో సహా జపాన్ ప్రభుత్వం కూడా షెడ్యూల్ ప్రకారమే క్రీడలు నిర్వహిస్తామని ప్రకటించారు. అంతే కాకుండా గత నెలలో ఒలంపిక్ క్రీడాజ్యోతి ర్యాలీని కూడా ప్రారంభించారు.

పరిమిత మందితో పలు ఆంక్షల నడుమ ఈ ర్యాలీ జపాన్‌లోని పలు నగరాల నుంచి సాగుతున్నది. తాజాగా ఈ ఒలంపిక్ టార్చ్ ర్యాలీకి సెక్యూరిటీగా వెళ్లిన పోలీస్‌కు కరోనా సోకినట్లు నిర్వాహక కమిటీ గురువారం వెల్లడించింది. మార్చి 25న ప్రారంభమైన ర్యాలీలో పాల్గొన్న వారిలో కరోనా పాజిటివ్ వచ్చిన మొదటి వ్యక్తి ఆయనే అని నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 17న జపాన్‌లోని కగావా ప్రాంతంలో టార్చ్‌కు బందోబస్తుగా వెళ్లిన 30 ఏళ్ల పోలీస్‌కు కరోనా సోకిందని స్పష్టం చేసింది. అయితే బందోబస్తులో పాల్గొన్న మరుసటి రోజే కరోనా పాజిటివ్‌గా తేలాడని.. ఆయనకు తీవ్రమైన లక్షణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా, సీసీ టీవీ కెమేరాలు పరిశీలించగా.. సదరు పోలీస్ మాస్క్ ధరించి.. పూర్తిగా సోషల్ డిస్టెన్స్ పాటించాడని చెప్పారు. అయినా సరే ఆ రోజు ర్యాలీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed